World Music Day 2022: సంగీతంతో రాళ్లు కరగడమే కాదు.. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి
21 June 2022, 11:55 IST
- సంగీతంతో రాళ్లుకరుగుతాయని ఊరికే అనరు. మానసిక స్థితి, శారీరక మెరుగుదలకోసం సంగీతం ఎంతగానో సహాయం చేస్తుంది. ఈ విషయాన్ని పలు పరిశోధనలు కూడా రుజువు చేశాయి. మరి సంగీతం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో మీరు తెలుసుకోండి.
ప్రపంచ సంగీత దినోత్సవం
World Music Day 2022 : సంగీతం అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం. అందుకే చాలా మంది ఖాళీ సమయంలో పాటలు వినడానికి ఇష్టపడతారు. జర్నీల్లో, లేదా ఏదైనా బ్రేక్ సమయంలో పాటలు వినేందుకు ఇష్టపడతారు. అయితే ప్రపంచ సంగీత దినోత్సవం రోజున.. సంగీతం వినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చరిత్ర
మొదటిసారి సంగీత దినోత్సవాన్ని 1982లో జరిపారు. ఫ్రాన్స్‌లో అప్పటి సాంస్కృతిక మంత్రి జాక్వెస్ లాంగ్ సంగీత దినోత్సవాన్ని చేసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేకమైన రోజు సంగీతం వినడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తారు.
* ఒత్తిడి తగ్గుతుంది
సంగీతాన్ని వినడం వల్ల బయోకెమికల్ స్ట్రెస్ రిడ్యూసర్‌లను ప్రేరేపించి.. ఒత్తిడి తగ్గుతుందని పరిశోధనలు కూడా తేల్చాయి.
* గుండె ఆరోగ్యానికి మంచిది
సంగీతాన్ని ప్లే చేస్తే రక్త ప్రసరణ సాఫీగా సాగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది హృదయ స్పందన రేటును, రక్తపోటును తగ్గిస్తుంది. కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
* చిరస్మరణీయ క్షణాల కోసం..
అల్జీమర్స్ వ్యాధి లేదా చిత్తవైకల్యానికి ఎటువంటి నివారణ లేదు. కానీ మ్యూజిక్ థెరపీ దాని లక్షణాల నుంచి కొంత ఉపశమనం ఇవ్వడంలో సహాయపడుతుంది. మ్యూజిక్ థెరపీ వల్ల రోగికి విశ్రాంతి వస్తుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది.
* మానసిక స్థితి కోసం..
పాటలు వినడం వల్ల మూడ్ కూడా చాలా వరకు మారిపోతుంది. పాటలు వినడం ద్వారా మెదడు డోపమైన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ డోపమైన్ ఆందోళన, డిప్రెషన్ నుంచి ఉపశమనం ఇస్తుంది. అంతేకాకుండా మీకు ఇష్టమైన పాట మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
* నొప్పిని నియంత్రిస్తుంది..
ఒత్తిడి స్థాయిని, మెదడులోకి ప్రవేశించే నొప్పి సంకేతాన్ని తగ్గించడంలో మ్యూజిక్ థెరపీ అద్భుతంగా పని చేస్తుంది. క్రమంగా మీకు నొప్పి తగ్గుతుంది.
* స్టామినా పెంచుతుంది..
వ్యాయామం చేసే సమయంలో సాంగ్స్ వినడం వల్ల శారీరక పనితీరును మెరుగ్గా ఉంటుంది. కఠినమైన వర్కవుట్‌ల సమయంలో కూడా ఇది శక్తిని పెంచుతుంది.