తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lighting Tips: ఇంట్లో ఏ గదిలో ఎలాంటి లైట్లను ఉపయోగించాలి?

Lighting Tips: ఇంట్లో ఏ గదిలో ఎలాంటి లైట్లను ఉపయోగించాలి?

20 September 2023, 17:00 IST

  • Lighting Tips: ఇంట్లో అన్ని గదుల్లో ఒకేరకమైన లైట్లు పెట్టుకోవడం కన్నా గదిని బట్టి మారిస్తే లుక్ బాగా వస్తుంది. ఏ గదికి ఎలాంటి లైటింగ్ బాగుంటుందో తెలుసుకోండి. 

ఇంటి లైటింగ్ టిప్స్
ఇంటి లైటింగ్ టిప్స్ (pexels)

ఇంటి లైటింగ్ టిప్స్

ఇల్లు ప్రశాంతంగా ఉన్న భావన కలగాలంటే ఎంతో ఆర్గనైజ్డ్‌గా సర్దుకున్న సామాన్లు, గదులకు తగినట్లుగా లైటింగ్‌ ఉండటం అనేది తప్పనిసరి. మరి అన్ని గదులకూ ఒకటే లైటింగ్‌ని ఏర్పాటు చేసుకోవడం కంటే ఆ గది అవసరాలకు అనుగుణంగా బల్బులను అమర్చుకోవాలి. అప్పుడు మన ఇల్లు మరింత ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది. మీరు కొత్త ఇంటి ఆలోచనల్లో ఉంటే గనుక ఈ సలహాలన్నీ బాగా ఉపయోగపడతాయి.

హాల్లో :

వచ్చిపోయే వారితో సరదాగా సంభాషించుకోవడానికి వీలుగా మనం మన హాల్‌ని ప్రత్యేకంగా అలంకరించుకుంటాం. మిగిలిన గదులతో పోల్చి చూస్తే ఇక్కడ పెయింటింగ్‌లు, మొక్కలు, వాల్‌ డెకరేటివ్‌ పీస్‌ల్లాంటివి ఎక్కువగా ఉంటాయి. సోఫాల్లాంటి పెద్ద ఫర్నిచరూ ఉంటాయి. ఇక్కడ ఏదో ఒక అలంకరించుకున్న గోడను ఎలివేట్‌ చేయడం బాగుంటుంది. అందుకనే మామూలు లైటింగ్‌ మాత్రమే ఇచ్చి వదిలేయకండి. సీలింగ్‌లో కొన్ని ఫోకస్డ్‌ లైట్లను అమర్చుకోవడానికి ప్రయత్నించండి. అన్ని వైపులా అవసరం లేదు. మీరు ఎలివేట్‌ చేయాలనుకుంటున్న వాల్‌ వైపు పై భాగంలో ఫోకస్డ్‌ లైట్లను ఏర్పాటు చేయండి. అప్పుడు వచ్చిపోయే వారికి ఆ లైట్ల వల్ల మీరు అలంకరించుకున్న గోడ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది.

వంటింట్లో :

మనం ఆహారం వండుకునేందుకు, తిన్న సామాన్లను శుభ్రం చేసుకునేందుకు ఎక్కువగా వంటింటిని ఉపయోగిస్తుంటాం. గదిలో మామూలు లైట్లతో పాటుగా మీరు ఎక్కువగా పని చేసుకునే గ్యాస్‌ పొయ్యి దగ్గర, సింక్‌ దగ్గర కౌంటర్‌ల పై భాగంలో తప్పకుండా లైటింగ్‌ని ఏర్పాటు చేసుకోండి. అప్పుడు కాంతి సరైన ప్రదేశంలో ఎక్కువగా పడి మీరు పనులు చేసుకోవడానికి మరింత వీలుగా ఉంటుంది. చాలా మంది సింకును కిటికీ దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. కారణం ఏంటంటే దీని నుంచి సహజమైన కాంతి అందుతుందని. మీకూ ఇలాంటి కిటికీ వెసులుబాటు ఉంటే అప్పుడు మరో బల్బును అక్కడ అమర్చుకోవాల్సిన పని లేదు.

పడక గదిలో :

మిగిలిన గదులతో పోల్చుకుంటే పడక గదిలో లైటింగ్‌ కాస్త మైల్డ్‌గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఆ గది కోజీగా ఉన్న భావన కలుగుతుంది. లైటింగ్‌ తక్కువ ఉంటే నిద్ర తొందరగా పట్టేస్తుంది. అలాగే కొందరికి నిద్ర పోయే ముందు పుస్తకం చదువుకునే అలవాటు ఉంటుంది. కొందరు పిల్లల బెడ్‌రూంల్లో ఇక్కడే స్టడీ టేబుల్‌ ఉంటుంది. మీరూ ఇలా చదువుకోవడానికి ఇక్కడ సీలింగ్‌లో ఉండే లైట్ల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. బదులుగా వాల్‌ మౌంటెడ్‌ ఫోకస్డ్‌ లైట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఆ లైట్‌ని ఎటు వైపు కావాలంటే అటువైపు ఫోకస్ తిప్పుకునే వెసులుబాటు ఉండాలి. అప్పుడు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది.

డ్రస్సింగ్‌ రూంలో :

సాధారణంగా చాలా ఇళ్లల్లో బాత్రూమ్‌కి బయట వైపు డ్రెస్సింగ్‌ ఏరియాను ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ అద్దంలో చూసుకుంటూ డ్రస్సింగ్‌ చేసుకోవడం, మేకప్స్‌ చేసుకోవడం లాంటివి చేస్తారు. అందుకని ఇక్కడ అద్దాలకు ఇరు వైపులా , సీలింగ్‌లో నుంచి ఓవర్‌ హెడ్‌ లైటింగ్‌ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం