తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Periods: నెలలో రెండు సార్లు పీరియడ్సా? కారణాలు తెలుసుకోవాల్సిందే..

Periods: నెలలో రెండు సార్లు పీరియడ్సా? కారణాలు తెలుసుకోవాల్సిందే..

HT Telugu Desk HT Telugu

29 October 2023, 16:00 IST

google News
  • Periods: నెలలో రెండుసార్లు పీరియడ్స్ రావడానికి చాలా కారణాలే ఉంటాయి. సమస్య పట్టించుకోవడం, కారణాలు తెలుసుకోవడం తప్పనిసరి. అవేంటో మీరూ తెలుసుకోండి. 

పీరియడ్స్
పీరియడ్స్ (pexels)

పీరియడ్స్

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి రుతుక్రమం క్రమం తప్పకుండా ఉండాలి. ఏ మాత్రం అటూ ఇటూ అయినా రకరకాల సమస్యలు ప్రారంభం అవుతాయి. సాధారణంగా ఆరోగ్యవంతమైన మహిళలకు ప్రతి 28 రోజులకు ఒకసారి నెలసరి వస్తుంది. కొందరి శరీర తత్వాన్ని బట్టి ఈ కాలం 21 రోజుల నుంచి 35 రోజుల మధ్య ఉంటూ ఉంటుంది. అయితే కొందరికి ఒకే నెలలో రెండు సార్లు పీరియడ్స్‌ వస్తుంటాయి. దీన్ని ఏ మాత్రం తేలికగా తీసుకోవద్దని గైనకాలజిస్టులు చెబుతున్నారు. ఇలా రావడం వెనుక రకరకాల కారణాలు ఉండి ఉండొచ్చని చెబుతున్నారు. ఆ కారణాలేంటో తెలుసుకుని అవగాహనతో ఉండటం అవసరం.

హార్మోన్ల అసమతుల్యత :

నెలలో రెండు సార్లు పీరియడ్స్‌ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి హార్మోన్ల అసమతుల్యత. ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ లాంటి హార్మోన్లు దీన్ని నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి అసమతుల్యంగా ఉండటం వల్ల ఈ సమస్యలు ఏర్పడతాయి. అలాగే కొంత మంది మహిళలు పీసీఓఎస్‌ అనే హార్మోనల్‌ డిజార్డర్‌తో బాధ పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి కూడా రుతు క్రమం అస్తవ్యస్తం అవుతుంది.

గర్భ సంచిలో ఫైబ్రాయిడ్స్‌ :

కొందరికి గర్భ సంచిలో చిన్న చిన్న ఫైబ్రాయిడ్లు (గడ్డలు) సమస్య తలెత్తుతుంది. ఇవి ఎంత పరిమాణంలో ఉన్నాయి? గర్భ సంచిలో ఏ ప్రాంతంలో ఉన్నాయి? అన్న దాన్ని బట్టి నెలసరి సమస్యలు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి రక్త స్రావం తీవ్రంగా జరిగి మహిళలు నీరసించిపోతుంటారు.

సంతాన నిరోధక మాత్రలు :

కొందరు పిల్లలు పుట్టకుండా కొన్ని రకాల మందుల్ని వాడుతుంటారు. అవి కూడా నెలసరి మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి వల్ల కలిగే దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయి. అలాగే థైరాయిడ్‌కి సంబంధించిన సమస్యలు ఉన్నా ఈ మెన్స్ట్రువల్ సైకిల్‌ అస్తవ్యస్తం అవుతుంది.

ఒత్తిడి :

హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన కారణాల్లో ఒకటి ఒత్తిడి. ఎక్కువ ఒత్తిడితో కూడిన పనులను చేస్తున్నప్పుడు ఆ ప్రభావం తప్పకుండా హార్మోన్లపైన, నెలసరిపైనా పడుతుంది. రుతు క్రమం అదుపు తప్పే అవకాశం ఉంది. మెడిటేషన్‌, వ్యాయామాలు, ప్రణాళికా బద్ధమైన పనులు, ఒత్తిడిని తగ్గించుకునే టెక్నిక్‌లను వాడటం ద్వారా దీని నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి.

ప్రీ మెనోపాజ్‌:

మెనోపాజ్‌కి ముందు దశలో అంటే 40ల్లో ఉన్న మహిళలకు ఇలా నెలకు రెండు సార్లు పీరియడ్స్‌ రావడం జరగవచ్చు. దీన్నే ప్రీ మెనోపాజ్‌ దశ అంటారు. ఈ సమయంలో శరీరం అండాల విడుదలను నిలిపివేసే స్థితికి దగ్గరగా ఉంటుంది. అలాంటప్పుడూ ఇలాంటివి చోటు చేసుకుంటాయి. కారణమేదైనాగానీ ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నవారు వైద్యుల్ని సంప్రదించడం మంచిది. సరైన సమయంలో వైద్యం అందితే సమస్య పెద్దగా అవ్వకుండా ఉంటుంది.

తదుపరి వ్యాసం