తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ulavacharu Biryani: ఉలవచారు బిర్యానీ అంటే ఏంటి? దాన్నెలా వండుతారు?

Ulavacharu biryani: ఉలవచారు బిర్యానీ అంటే ఏంటి? దాన్నెలా వండుతారు?

14 October 2024, 11:30 IST

google News
    • Ulavacharu biryani: ఉలవచారు బిర్యానీ వినడమే గానీ దాని అర్థం చాలా మందికి తెలీదు. బిర్యానీ చారు కలిపి ఉన్న ఈ పేరు అర్థం ఏంటో తెల్సుకోండి. ఉలవచారు బిర్యానీ తయారీ కూడా చూసేయండి.
ఉలవచారు బిర్యానీ
ఉలవచారు బిర్యానీ

ఉలవచారు బిర్యానీ

ఉలవచారు బిర్యానీ పేరు చాలా సార్లు విన్నా కూడా.. దాని రుచి చూసిన వాళ్లు.. దాన్నెలా తయారు చేస్తారో తెల్సిన వాళ్లు తక్కువే. దాని పేరు చెబుతున్నట్లే ఉలవలతో తయారు చేసుకున్న చారుల బియ్యాన్ని ఉడికించి ఉలవచారు బిర్యానీ తయారు చేస్తారు. మామూలు బిర్యానీలు కారంగా, మసాలాల రుచితో ఉంటాయి. కానీ ఉలవల చారులో ఉడికించి చేయడం వల్ల ఈ బిర్యానీ కాస్త పుల్లగా, కారంగా ఉంటుంది. ఉలవల చారు తయారు చేయకుండా నేరుగా ఉలవలను ఉడికించుకున్న నీళ్లు, చింతపండు కలిపి కూడా ఈ బిర్యానీ చేసుకోవచ్చు. అదెలాగో వివరంగా చూసేయండి. దీంట్లో వెజ్, నాన్ బెజ్ రకాలుంటాయి. ఇప్పుడు వెజ్ రెసిపీ చూద్దాం.

ఉలవచారు బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

సగం కప్పు ఉలవలు

1 కప్పు బాస్మతీ బియ్యం

1 బంగాళదుంప, ముక్కలు

2 ఉల్లిపాయ, ముక్కలు

పావు కప్పు క్యాలీ ఫ్లవర్ ముక్కలు

పావు కప్పు బీన్స్ ముక్కలు

పావు కప్పు క్యారట్ ముక్కలు

2 బిర్యానీ ఆకులు

5 వెల్లుల్లి రెబ్బలు

1 చెంచా కారం

సగం చెంచా పసుపు

2 చెంచాల చింతపండు గుజ్జు

అంగుళం దాల్చినచెక్క ముక్క

5 లవంగాలు

2 యాలకులు

2 జాపత్రి రేకులు

నూనె

తగినంత ఉప్పు

ఉలవచారు బిర్యానీ తయారీ విధానం:

ఉలవచారు తయారీ:

1. ముందుగా ఉలవల్ని శుభ్రంగా కడుక్కోవాలి. రెండు కప్పుల నీళ్లు పోసుకుని రాత్రంతా లేదా కనీసం ఆరు నుంచి ఏడు గంటల పాటూ నానబెట్టుకోవాలి.

2. తర్వాత నీళ్లు పోసి ఉలవల్ని ఉడికించుకోవాలి. ఆరేడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అయితేనే మెత్తగా ఉడికిపోతాయి. వాటిని మెత్తగా మెదిపేలా ఉలవలు ఉడికిపోవాలి.

3. ఇప్పుడు ఉలవల్ని నీళ్ల నుంచి వడకట్టేసి ఉలవలు ఉడికిన నీళ్లను పక్కన పడేయకుండా పక్కన పెట్టుకోవాలి.

4. ఉడికించుకున్న ఉలవల్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ముద్దను ఉలవలు ఉడికించుకున్న నీళ్లలో కలిపేసుకుని కనీసం అయిదు నిమిషాల పాటూ ఉడికించుకోవాలి.

5. ఇది పూర్తిగా చల్లారాక వడకట్టుకోవాలి. ఈ నీళ్లను మనం బిర్యానీ కోసం వాడతాం. దీంట్లోనే బిర్యానీ ఉడికించుకుంటాం.

బిర్యానీ తయారీ:

6. ముందుగా బియ్యాన్ని పావుగంట సేపు నానబెట్టుకోవాలి. నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు బిర్యానీ వండుకునే కాస్త వెడల్పాటి పాత్ర పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులు వేసుకుని వేయించాలి.

8. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేగిపోయాక తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కల్నీ వేసుకోవాలి. అన్నింటినీ నూనెలో కనీసం అయిదు నిమిషాలన్నా కలుపుతూ మగ్గనివ్వాలి.

9. పసుపు, కారం, ఉప్పు వేసి కలియబెట్టాలి. వెంటనే బియ్యం కూడా వేసుకుని మరోసారి కలపాలి.

10. ఇందులో ముందుగా తయారు చేసుకున్న ఉలవలు ఉడకబెట్టి తయారు చేసుకున్న నీళ్లు రెండు కప్పుల దాకా పోసుకోవాలి. దాంతో పాటూ చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి.

11. మూత పెట్టుకుని నీళ్లన్నీ ఆవిరైపోయి బియ్యం పొడిపొడిగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకోవాలి. అంతే పది నిమిషాల్లో ఉలవచారు బిర్యానీ రెడీ అయిపోతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం