Belly Fat Workouts: పొట్ట చుట్టూ కొవ్వుల్ని తగ్గించుకునే ఇంటి వర్కవుట్లు..
30 November 2023, 8:30 IST
Belly Fat Workouts: ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేసి పొట్టు చుట్టూ కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. అవెలాంటి సింపుల్ వ్యాయామాలో తెలిస్తే తేలిగ్గా చేసేస్తారు.
పొట్టు చుట్టూ కొవ్వు తగ్గించే వర్కవుట్లు
మనం తిన్న ఆహారంలో అదనంగా లభ్యమయ్యే కొవ్వులు అన్నీ ముందుగా మనకు పొట్ట, తుంటి భాగంలోనే ఎక్కువగా జమ అవుతాయి. ఆ తర్వాత మాత్రమే ఇతర శరీర భాగాల్లోకి వ్యాపించడం మొదలు పెడతాయి. అందుకనే సన్నగా ఉన్న వారికి కూడా కొంత మందికి కాస్త పొట్ట ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అయితే మనం రోజు వారీ చేసుకునే నడక, జాగింగ్, సాధారణ వ్యాయామాల వల్ల అంత తేలిగ్గా పొట్టలో పేరుకున్న కొవ్వులు కరిగిపోవు. దీన్ని కరిగించుకోవాలంటే ప్రత్యేకంగా దీని కోసం నిర్దేశించిన వ్యాయామాలు చేసుకోవాల్సిందే. అలా దీని కోసం ఇంట్లోనే చేసుకోగల వ్యాయామాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం.
జంప్ స్వ్కాట్స్ :
నిటారుగా నిలబడండి. తర్వాత కాళ్లను వెడంగా చాపి చేతులని మడచి కూర్చున్న భంగిమలోకి వచ్చి ఒక స్క్వాట్ చేయండి. తర్వాత పైకి లేచేప్పుడు సాధారణంగా నిలబడకుండా ఒక జంప్ చేయండి. మెల్లగా నేల మీదకి దిగండి. ఇలా 15 నుంచి 20 సార్లు చేయండి. వీటినే జంప్ స్క్వాట్స్ అని పిలుస్తారు. పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వుల్ని తగ్గించడంలో ఇవి ఎంతగానో సహకరిస్తాయి.
మౌంటేన్ క్లైంబర్స్ :
చిన్న పిల్లలు పాకే పొజిషన్‌లోకి శరీరాన్ని తీసుకురండి. మోకాలిని గుండెల వరకు తీసుకువస్తూ కొండలు ఎక్కుతున్నప్పుడు ఎలాగైతే చేస్తారో అలా పాకుతూ ముందుకు నడవండి. వేగాన్ని పెంచుతూ పాకండి. 30 సెకన్లు అలా పాకితే ఒక సెట్ కింద లెక్క. ఇలా కనీసం 3, 4 సెట్లు చేయడానికి ప్రయత్నించండి.
బైస్కిల్ క్రంచెస్ :
యోగా మ్యాట్ వేసుకుని వెల్లకిలా పడుకోండి. చేతులు రెండూ తల కింద పెట్టుకోండి. చేతుల సాయంతో తలను ఎడమ వైపుకు లేపి పొట్ట దగ్గరకు కుడి వైపుకు తీసుకురండి. అలాగే కుడి కాలిని మడిచి పొట్ట దగ్గరకు తీసుకురండి. అలాగే రెండూ వైపూ చేయండి. దాదాపుగా సైకిల్ తొక్కినట్లుగా ఉంటుంది ఈ వ్యాయామం. ఇది పొట్ట దగ్గర కొవ్వుల్ని కరిగించివేయడంలో ఎంతో సమర్థవంతంగా పని చేస్తుంది.
హులా హూపింగ్ :
రింగును నడుము చుట్టూ తిప్పుతూ చేసే హూలా హూపింగ్ చాలా మందికి వచ్చే ఉంటుంది. ఒక వేళ రాకపోయినా రెండు రోజుల పాటు సాధన చేస్తే వచ్చేస్తుంది. ఎక్కువ బరువు ఉన్న హూప్‌ని తిప్పడం వల్ల చాలా కొవ్వు, కేలరీలు కరిగిపోతాయి. పొట్ట దగ్గర పేరుకు పోయిన కొవ్వులు కరుగుతాయి. పొట్ట దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి. ఈ వ్యాయామం చేయడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గడమే కాకుండా మొత్తం శరీర ఆకృతి మెరుగుపడుతుంది.