Interior Design Ideas: ఇంటిని ట్రెండీగా మార్చేసే.. ఇంటీరియర్ డిజైనింగ్ టిప్స్..
04 December 2023, 17:32 IST
Interior Design Ideas: ఇంటిని అందంగా అలంకరించడానికి కొన్ని ఇంటీరియర్ డిజైనింగ్ టిప్స్ పాటించాల్సిందే. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఇంటీరియర్ ఐడియాలేంటో చూసేయండి.
ఇంటీరియర్ డిజైనింగ్ టిప్స్
ఇల్లు అందంగా ఉండాలి. దాని లుక్ మనకు ఆనందాన్ని పంచాలి. అంతకు మించి సౌకర్యవంతంగా ఉండాలి. అలా ఇంట్లోకి వచ్చిన వెంటనే ఒత్తిడి ఎగిరిపోవాలి. అది ఓ ప్రశాంతమైన చోటులా మనకు ఆహ్లాదాన్ని ఇవ్వాలి. అలా ఇంటిని డిజైన్ చేసుకోవడానికి ఇంటీరియర్ డిజైనర్లు కొన్ని ఐడియాలను ఇస్తున్నారు. అవి తెలుసుకుని నచ్చితే మన ఇళ్లలోనూ ప్రయత్నించేద్దాం. ఇంకెందుకు ఆలస్యం రండి మరి.
పాత కొత్తల కలయిక :
ఇల్లు మరీ ట్రెండీగానూ ఉండకూడదు. అలాగని మరీ పాత కాలం దానిలాగానూ ఉండకూడదు. కాస్త ట్రెండింగ్‌గా, కాస్త వింటేజ్ లుక్‌లో ఉండే ఇంటీరియర్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయని అంటున్నారు.. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్లు. ఇలా పాత కొత్తల మేలు కలయిక ఇంటికి కొత్త అందాన్ని తెచ్చి పెడుతుందని చెబుతున్నారు. అందుకనే అలంకరించుకునే వస్తువుల విషయంలో కొన్ని పాత వస్తువుల్నీ చేర్చమని సలహా ఇస్తున్నారు.
ప్రశాంతమైన లైటింగ్ :
ఇటీవల కాలంలో చాలా ఇళ్లు మిరుమిట్లు గొలిపే లైటింగ్‌లతో ఉంటున్నాయి. అవి మన జీవ గడియారాన్ని అస్తవ్యస్థం చేస్తాయి. ప్రతి గదిలోనూ ఒక సాధారణ లైట్‌ని ఒక లో లైట్‌ని అమర్చుకోండి. అవసరాన్ని బట్టి షాండ్లియర్లను ఏర్పాటు చేసుకోండి. రాత్రి పూట తక్కువ వెలుతురు ఉండే వార్మ్ లైట్లకు ప్రాధాన్యత ఇవ్వండి. కాంతి తగ్గే సరికి ఇక నిద్రపోయే సమయం ఆసన్నం అవుతోందని శరీరం అర్థం చేసుకుంటుంది. దీంతో ప్రశాంతమైన నిద్రకు ఆస్కారం ఉంటుంది.
యాంక్సెంట్ వాల్ :
కుటుంబం అంతా కూర్చుని సమయం గడిపే గదుల్లో.. అంటే హాల్ లాంటి చోట్ల ఒక గోడను యాక్సెంట్ వాల్‌గా మార్చండి. అది మీ ఇంటి లుక్‌ని ఇనుమడింప చేస్తుంది. మంచి లుక్‌ని ఇచ్చే వాల్ పేపర్, కాస్త ముదురు రంగు పెయింట్‌తో యాక్సెంట్ వాల్‌ని మీకు నచ్చినట్లుగా తయారు చేసుకోవచ్చు. అలాగే చెక్కలతోనూ రకరకాల ఆకారాలను తీసుకురావచ్చు.
సహజమైన కాంతి :
ఇంట్లో ఎన్ని అలంకరణలు చేసినా సరే సహజమైన కాంతి తగినంత రాకపోతే అందమే రాదు. అందుకనే కిటికీ అద్దాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే వాటినే ఎంపిక చేసుకోండి.
సౌకర్యవంతమైన ఫర్నిచర్ :
ఇంట్లో సోఫాలు, కుర్చీలు, మంచాల్లాంటి వాటిని ఎంపిక చేసుకునేప్పుడు లుక్ మీదే ఎక్కువగా ధ్యాస పెట్టకండి. అవి సౌకర్యవంతంగా, ఉపయోగకరంగా ఉండేలా చూడండి. అనవరంగా ఏ ఒక్క వస్తువునూ ఇంట్లో చేర్చకండి. సింప్లిసిటీతో మంచి లుక్ వచ్చే వాటిని ఎంపిక చేసుకోండి. ఎక్కువ హడావిడి ఉన్న వాటి జోలికి అస్సలు వెళ్లకండి.