Exam season: ఎగ్జామ్స్ టైమ్‌లో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
12 January 2023, 13:07 IST
- Exam season: పరీక్షల సమయంలో పిల్లలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటారు. పేరెంట్స్ ఈ సమయంలో వారికి చేదోడుగా ఉండాలి. అందుకు నిపుణులు చేస్తున్న సూచనలు ఇవే..
పిల్లలకు పరీక్షల సమయంలో చేదోడుగా ఉండేందుకు పేరెంట్స్‌కు టిప్స్
పరీక్షలు పిల్లలకు ఒత్తిడిని తెచ్చిపెడతాయి. వారు ఆ ఒత్తిడిని ఎదుర్కోవడంలో తల్లిదండ్రులుగా పిల్లలకు చేయూత ఇవ్వడం చాలా ముఖ్యం. పెరుగుతున్న పోటీ ప్రపంచంలో పరీక్షల ఒత్తిడి సహజమే. కొన్నిసార్లు ఒత్తిడి సహాయకరంగా ఉంటుంది. విద్యార్థులకు ప్రేరణగా పనిచేస్తుంది. అయితే అధిక ఒత్తిడి ఆందోళన, భయానికి దారితీయవచ్చు. తరచుగా ఈ పరిస్థితి పిల్లలను అయోమయంలో పడేస్తుంది. వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని సృష్టిస్తుంది. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లల ఆసక్తులను దృష్టిలో ఉంచుకోవాలి. అయితే కొన్ని ఒత్తిడి తగ్గించే వ్యూహాలు మంచి కంటే ఎక్కువ హానిని కలిగిస్తాయని గుర్తించడం ముఖ్యం.
ది మూడ్ స్పేస్‌లోని సైకాలజిస్ట్ యేషా మెహతా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం మాట్లాడారు. పరీక్షల సమయంలో పిల్లలను ఒత్తిడి లేకుండా ఉంచడానికి తల్లిదండ్రులకు కొన్ని ఆరోగ్యకరమైన మార్గాలను సూచించారు.
1) ఒత్తిడి లేకుండా చూడండి
పరీక్షలకు హాజరయ్యే పిల్లలకే కాదు వారి తల్లిదండ్రులకు కూడా పరీక్షలు ఒత్తిడిని కలిగిస్తాయి. పిల్లలు తరచుగా వారి తల్లిదండ్రులను అనుకరిస్తారు. తల్లిదండ్రుల నుండే సంక్షోభ పరిస్థితిని ఎలా పరిష్కరించాలో నేర్చుకుంటారు. అలాంటి సమయాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో సంభాషించేటప్పుడు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.
2. వారి ఒత్తిడి, ఆందోళనను కొట్టి పడేయకండి
మీ పిల్లల ఒత్తిడి, ఆందోళనను గుర్తించకపోతే అది మరింత తీవ్రమవుతుంది. ఇది వారిని తప్పుగా అర్థం చేసుకున్నట్లు పిల్లలు భావిస్తారు. ఒత్తిడి, ఆందోళన నిజమైనవని, వారు అలా భావించడం సరైందేనని మీ పిల్లలకు తెలియజేయండి. వారి భావోద్వేగాలను కించపరచకుండా వారితో దాని గురించి మాట్లాడండి. బదులుగా ప్రతికూల ఆలోచనలను ఎలా అధిగమించాలో తెలుసుకోవడానికి వారికి సహాయపడండి.
3) శ్వాస పద్ధతులను నేర్చుకోవడంలో వారికి సహాయపడండి
పరీక్ష రాసేటప్పుడు ఉపయోగించగల శ్వాస పద్ధతులను వివరించండి. ఇది వారికి మరింత స్థిరంగా ఉండడంలో సహాయపడుతుంది. ఒక పువ్వు నుంచి వాసన పీల్చుతున్నట్టుగా చేయడం, ఒక కొవ్వొత్తిని ఊదుతున్నట్టు చేయడం వల్ల వారికి రిలాక్స్‌గా అనిపించవచ్చు. ప్రత్యేకించి వారు ఆత్రుతగా ఉన్నప్పుడు ఈ టెక్నిక్స్ ఉపయోగపడుతాయి. బాక్స్‌డ్ బ్రీతింగ్ టెక్నిక్ వంటి ప్రాథమిక శ్వాస పద్ధతులు రిలీఫ్ ఇస్తాయి.
4) పౌష్టికాహారం ఇవ్వండి
సమతుల్య ఆహారం వల్ల శక్తి, ఏకాగ్రత స్థాయి ఎక్కువగా ఉంటాయి. జంక్ ఫుడ్ కొద్దిసేపటికే మానసిక స్థితిని పెంచడంలో సహాయపడుతుంది కానీ వెంటనే అలసట, బద్ధకం ఏర్పడుతుంది.
5) ఫలితానికి బదులుగా ప్రక్రియపై దృష్టి పెట్టండి
మంచి స్కోర్ కోసం తరచుగా ఒత్తిడి ఎదురవుతుంది. ఇది అవసరమే అయినప్పటికీ నేర్చుకోవడంపై, అధ్యయనంపై దృష్టి పెట్టడం చాలా కీలకం. ఈ సమయంలో ప్రతి విద్యార్థి ప్రత్యేకతను, వారి సొంత శైలిని కలిగి ఉంటారన్న విషయాన్ని గుర్తించాలి.
6) తగ్గేదేలా అన్నట్టుండాలి
పరీక్షల సమయం పిల్లల్లో అసమర్థ భావనలకు దారి తీస్తుంది. వారు తరచుగా తమను తాము తక్కువగా చూసుకుంటారు. తమ సహవిద్యార్థులతో తమను తాము పోల్చుకుంటారు. తల్లిదండ్రులుగా సానుకూల ఆలోచనలను ప్రోత్సహించడం చేయాలి. వారి గ్రేడ్‌లు వారిని నిర్వచించలేవని పిల్లలకు గుర్తు చేయడం అవసరం.
7) పోలిక నుండి దూరంగా ఉండండి
సమాజంలో జీవిస్తున్నప్పుడు పోల్చి చూడడం సహజం. సోషల్ మీడియా ప్రభావం తల్లిదండ్రులపై పడుతుంది. పలానా వారు 'పరిపూర్ణ వ్యక్తులు' అని ప్రభావితం చేస్తుంటారు. ప్రతి బిడ్డ తన సొంత వేగంతో కదులుతుందని తల్లిదండ్రులు గుర్తించాలి. మీ బిడ్డను మరొకరితో పోల్చడం మానేయండి.