Benefits of Lighting Diyas: దీపం పెట్టడం వల్ల ఇన్ని ప్రయోజనాలుంటాయా!
06 November 2023, 18:30 IST
Benefits of Lighting Diyas: దీపాలు వెలిగించడంతో కార్తీక మాసం, దీపావళి శోభ ఉట్టిపడుతుంది. ఈ సందర్భంలోనే కాకుండా అసలు దీపాలు వెలిగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం.
దీపం వెలిగించడం వల్ల లాభాలు
దీపావళి పండుగ సమయం వచ్చిందంటే అన్ని చోట్లా దీపాలు వెలుగుతాయి. మనకెంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అందుకనే ఈ పండుకంటే అందరికీ చెప్పలేనంత ఇష్టం. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ దీపాల పండగ ఇక్కడితో ఆగదు. తర్వాత వచ్చే కార్తీక మాసం అంతా కొనసాగుతూనే ఉంటుంది. ఈ మాసం అంతా చాలా మంది దీపాలు పెడుతుంటారు. మరి అసలు ఇంట్లో దీపం వెలిగించడం వల్ల సైన్స్‌పరంగా, ఆధ్యాత్మిక పరంగా కలిగే లాభాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దీపాలు వెలిగించడం వల్ల కలిగే భౌతిక ప్రయోజనాలు :
నెయ్యి, నువ్వుల నూనెలతో దీపాల్ని వెలిగించడం వల్ల అవి చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్ర పరుస్తాయి. బ్యాక్టీరియాలు, సూక్ష్మ జీవుల్ని నశింప చేస్తాయి. ఇన్‌ఫెక్షన్ల లాంటివి వ్యాపించకుండా ఉంటాయి. అందుకనే దీపాలు ఉన్న వాతావరణం ఆరోగ్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీలను దీపాలు దూరం చేస్తాయి. దీంతో ఇల్లు మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం ఒక్క దీపావళి పండుగ, కార్తీక మాసం అనే కాదు. చాలా మంది రోజూ ఇంట్లో పూజ చేసి దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
దీపాల వల్ల అంతః ప్రయోజనాలు :
యోగ శాస్త్ర గ్రంథాల ప్రకారం చూసుకున్నట్లయితే.. మానవ శరీరం పంచ భూతాల ఆధారంగా పని చేస్తుంది. అంటే మనలో భూమి, గాలి, నీరు, ఆకాశం, నిప్పు అనే ఐదూ వాటి గుణాల్ని ప్రదర్శిస్తాయి. వీటిలో అగ్ని తత్వం ఒకటి. దీని వల్లనే జఠర రసాలు విడుదలవుతాయి. మనం తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. ఇలాంటి అగ్ని తత్వాన్ని కూడా మనం శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే రోజూ దీపాన్ని ఇంట్లో వెలిగించి పూజ చేయమని చెబుతారు.
అగ్ని ముందు కాసేపు కూర్చోవడం వల్ల అగ్ని తత్వం, నీటితో స్నానం చేయడం వల్ల జల తత్వం, నేల మీద నడుస్తూ ఉండటం వల్ల పృధ్వీ తత్వం, మంచి గాలిని పీల్చడం వల్ల వాయు తత్వం శుద్ధి అవుతాయి. తద్వారా అప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్‌డ్‌గా పని చేస్తాయి. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. అందుకనే దీపాలు పెట్టడానికి ఆధ్యాత్మిక పరంగా అంతటి ప్రాముఖ్యతను ఇచ్చారు.
ఏ ఇంట్లో అయితే రోజూ దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోని వారు ఆరోగ్యంగా ఉంటారు. వారి ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారు హాయిగా, ప్రశాంతంగా జీవనం సాగించగలుగుతారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.