తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  International Carrot Day | క్యారెట్ గురించి ఆసక్తికరమైన- ఆరోగ్యకరమైన విషయాలు..

International Carrot Day | క్యారెట్ గురించి ఆసక్తికరమైన- ఆరోగ్యకరమైన విషయాలు..

HT Telugu Desk HT Telugu

04 April 2022, 8:23 IST

    • ప్రతిరోజుకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఏప్రిల్ 4, అంటే ఈరోజు అంతర్జాతీయ క్యారెట్ దినోత్సవం అంట. క్యారెట్ తినడం వలన కలిగే ప్రయోజనాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడానికి ఇలా ఒక రోజును పాటిస్తున్నారు.
Carrot
Carrot (Pixabay)

Carrot

క్యారెట్ గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. అయినప్పటికీ ఈ రూట్ వెజిటెబుల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు, క్యారెట్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

వివిధ రూపాల్లో ఆహారంగా స్వీకరించే ఆహారం ఏదైనా ఉందా అంటే? అది క్యారెట్ అని చెప్పవచ్చు. క్యారెట్ ను పచ్చిగా తినొచ్చు, ఉడకబెట్టుకొని తినొచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, కూరగా అండుకోవచ్చు, స్వీట్లు..కేకుల్లో ఉపయోగించవచ్చు, జ్యూస్ గా చేసుకొని తాగవచ్చు, ఆహారాల అలంకరణగా కూడా ఉపయోగించవచ్చు.

క్యారెట్లు 88% నీటితో తయారవుతాయి. పోల్చి చూస్తే, సగటు మనిషి శరీరంలో కేవలం 60-70% నీరు మాత్రమే ఉంటుంది.

క్యారెట్లలో ఎన్నో రకాల క్యారెట్లు ఉన్నాయి. కొన్ని సోరకాయంత పొడవుగా, మరికొన్ని బెండకాయంత చిన్నవిగా, ఇంకొన్ని కొమ్ములుకొమ్ములుగా ఇలా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల రకాల క్యారెట్లు వివిధ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కుగా నారింజ రంగు క్యారెట్ వినియోగంలో ఉంది.

క్యారెట్ తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

క్యారెట్‌లలో బీటా-కెరోటిన్ అనే వర్ణద్రవ్యం పుష్కలంగా ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం కూరగాయలు, పండ్లకు పసుపు-నారింజ రంగును అందించే రసాయనం. ఇలాంటి బీటా-కెరోటిన్ కలిగిన ఆహారాలు తింటే అది మన శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. ఈ విటమిన్ ఎ మెరుగైన కంటి చూపుకి, రోగనిరోధక శక్తిని, ఆరోగ్యకరమైన చర్మానికి సహాయపడుతుంది.

ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక క్యారెట్ నమలడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి స్థాయిలు తగ్గుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళనల నుంచి ఊరట లభిస్తుంది. అలాగే మెదడు చురుకుగా పనిచేస్తుంది.

క్యారెట్ తినడం ద్వారా లభించే విటమిన్ ఎ తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్‌ను 25 శాతం వరకు తగ్గిస్తుందని, తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

భారత జనాభాలు సుమారు 30 శాతం ప్రజలు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది అధిక ఫ్రక్టోజ్ కలిగిన ఆహారం, జీవనశైలి అలవాట్లు, కొన్ని జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య తలెత్తుతుంది. క్యారెట్లను తగినంత పరిమాణంలో తీసుకోవడం వల్ల రక్తంలో అధిక ఫ్రక్టోజ్ ను నియంత్రిస్తుంది. కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుందని అధ్యయనాలు తెలిపాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఫైబర్ తీసుకోవడం కీలకం. క్యారెట్ లాంటి డైటరీ ఫైబర్ తీసుకోవడం ద్వారా టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 

టాపిక్