Horse Grams: కిడ్నీలో రాళ్లు, కొలెస్ట్రాల్, మధుమేహం.. సమస్యలకోసం ఉలవలను ఎలా వాడాలంటే..
04 November 2023, 19:30 IST
Horse Grams: ఉలవలకు ఒంట్లో రకరకాల అనారోగ్య సమస్యల్ని తరిమికొట్టే శక్తి ఉంది. అయితే ఏ సమస్యకోసం దాన్నెలా వాడాలో తెల్సుకుంటే పూర్తి ప్రయోజనాలు పొందొచ్చు. అదెలాగో చూడండి.
ఉలవలతో ప్రయోజనాలు
మన పాత కాలం వంటలైన ఉలవచారు లాంటివి ఇటీవల మళ్లీ ఎక్కువగా వాడుకలోకి వస్తున్నాయి. ఉలవచారు బిర్యానీ లాంటివి ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయాయి. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉలవల్ని ఎక్కువగా ఆహారంలో, పసువుల దానాగానూ ఉపయోగిస్తుంటారు. ఇవి వేడి చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అందుకనే వీటిని శీతాకాలంలో ఎక్కువగా వాడుతుంటారు. వీటిలో డైటరీ ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్, ఊబకాయాన్ని తగ్గిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు లాంటి సమస్యలను తగ్గిస్తాయి. ఏఏ ఆరోగ్య సమస్యలకు ఇవి ఎలా పని చేస్తాయో తెలుసుకుందాం రండి.
కిడ్నీల్లో రాళ్లు :
చాలా మంది కిడ్నీల్లో రాళ్ల వల్ల చాలా నొప్పిని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారు ఐదు గ్రాముల ఉలవల్ని తీసుకుని బాగా కడిగి పెట్టుకోవాలి. రాత్రి వంద మిల్లీ లీటర్ల నీటిలో వాటిని వేసి ఉదయం వరకు నాననివ్వాలి. ఉదయాన్నే వాటిని కాస్త పిసికి నీటిని వడగట్టుకోవాలి. పరగడుపున రోజూ ఈ నీటిని తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు దూరం అవుతాయి.
మధుమేహం :
శరీరంలో వాత, కఫ దోషాల అసమతుల్యత వల్ల అజీర్ణం సమస్య వస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. అజీర్ణం వల్ల విష పదార్థాలు ఎక్కువగా శరీరంలో పేరుకుపోతాయి. క్లోమంలోని కణాలపై ప్రభావం చూపించి ఇన్సులిన్ విడుదలను అస్తవ్యస్థం చేస్తాయి. ఫలితంగా మధుమేహం సమస్య తలెత్తుతూ ఉంటుంది. ఉలవలు వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. మూడు గ్రాముల ఉలవల్ని రోజుకు రెండు సార్లు చొప్పున భోజనం తర్వాత తింటూ ఉంటే అజీర్ణ సమ్యలు తగ్గుతాయి. ఇన్సులిన్ అసమతుల్యత రాకుండా ఉంటుంది. తద్వారా మధుమేహం దరి చేరదు.
కొలెస్ట్రాల్ :
మనలో కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం వల్ల ఊబకాయం, బరువు పెరగడం లాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఉలవలతో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. వంద గ్రాముల ఉలవల్ని తీసుకోండి. వాటిని లీటరు నీళ్లలో వేసి చిన్న మంట మీద కనీసం రెండు గంటలైనా మరగనివ్వండి. నీరు సగానికి వచ్చాక ఆ నీటిని వడగట్టి సూప్‌లా చేసుకుని తాగుతూ ఉండండి. ఇలా వారానికి రెండు సార్లయినా చేస్తూ ఉండటం వల్ల శరీరంలో చెడు కొలస్ట్రాల్ నిల్వలు తగ్గుతాయి. జీవ క్రియ మరింత మెరుగై క్యాలరీలు కరుగుతాయి. బరువు తగ్గుతారు. ఇవే కాకుండా ఎముకలు బలహీనంగా మారడం, అల్సర్లు, మహిళల్లో నెలసరి సమస్యలు, గుండె సమస్యల్లాంటివి వీటి వాడకం వల్ల తగ్గుముఖం పడతాయి.