cauliflower kofta curry: చూడగానే నోరూరించే.. క్యాలీఫ్లవర్ కోఫ్తా కర్రీ..
20 December 2023, 11:08 IST
Cauliflower Kofta Curry: క్యాలీఫ్లవర్ తో కోఫ్తా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీని తయారీ పక్కా కొలతలతో సులభంగా ఎలా చేసుకోవాలో చూసేయండి.
క్యాలీఫ్లవర్ కోఫ్తా కర్రీ
కొంత మందికి మామూలుగా క్యాలీఫ్లవర్ కూర తినడం అంతగా ఇష్టముండదు. అలాంటి వాళ్లకోసమే ఈ క్యాలీఫ్లవర్ కోఫ్తా కర్రీ. క్యాలీఫ్లవర్ తో ఇలా కూర చేసుకుని తింటే ఎవరైనా ఫ్యాన్ అయిపోతారు. దాని తయారీ ఎలాగో చూసేయండి.
క్యాలీఫ్లవర్ కోఫ్తా కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు:
పావు కేజీ క్యాలీఫ్లర్
3 బంగాళదుంపలు, ఉడికించినవి
పావు కప్పు పన్నీర్
2 చెంచాల శనగపిండి
2 చెంచాల కార్న్ ఫ్లోర్
పావు చెంచా గరం మసాలా
తగినంత ఉప్పు
డీప్ ఫ్రై కి సరిపడా నూనె
1 కప్పు టమాటా గుజ్జు
అర చెంచా జీలకర్ర
అరచెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
అరచెంచా గరం మసాలా
అరచెంచా కారం
అరచెంచా ధనియాల పొడి
కొద్దిగా కొత్తిమీర తరుగు
ఇంచు దాల్చిన చెక్క ముక్క
3 లవంగాలు
2 యాలకులు
1 ఉల్లిపాయ, ముక్కలు
పావు చెంచా పసుపు
పావు చెంచా కసూరీ మేతీ
క్యాలీఫ్లవర్ కోఫ్తా కర్రీ కోసం తయారీవిధానం:
1. ముందుగా ఒక గిన్నెలో క్యాలీఫ్లవర్ తురుముకోవాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, పన్నీర్ తురుము, కొద్దిగా శనగపిండి, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, గరం మసాలా, కారం, ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ తీసుకుని నీళ్లు పోసుకుని కాస్త చిక్కటి మిశ్రమం లాగా చేసుకోవాలి. దీంట్లో క్యాలీఫ్లర్ కోఫ్తాలు ముంచుకోవాలి.
3. కడాయిలో నూనె వేసుకుని బాగా వేడెక్కాక ఈ కోఫ్తాలను రంగు మారేదాకా వేయించుకోవాలి. అవి కాస్త వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు గ్రేవీ కోసం ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి.
5. అవి వేగాక మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, టమాటా గుజ్జు కూడా వేసుకుని కలుపుతూ ఉండాలి.
6. నీరు ఇంకి నూనె తేలేదాకా ఈ మిశ్రమాన్ని ఉడకనివ్వాలి. ఉప్పు వేసుకుని ఒకసారి రుచి చూసుకుని ఒక కప్పు నీళ్లు పోసుకుని మరగనివ్వాలి.
7. గ్రేవీకి తగ్గట్లుగా చిక్కదనం అడ్జస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా చల్లుకుని ఒకసారి కలియబెట్టాలి.
8. చివరగా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కోఫ్తాల ఈ వేడి వేడి గ్రేవీలో వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. చివరగా కసూరీ మేతీ చల్లుకుని కలిపి, దించేసుకుంటే క్యాలీఫ్లవర్ కోఫ్తా కర్రీ రెడీ అయినట్లే.