తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast For Kids: బడికెళ్లే పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమేం ఉండాలో.. ఎలా ఉండాలో తెల్సా?

Breakfast For Kids: బడికెళ్లే పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమేం ఉండాలో.. ఎలా ఉండాలో తెల్సా?

HT Telugu Desk HT Telugu

05 December 2023, 6:30 IST

google News
  • Breakfast For Kids: బడికెళ్లే పిల్లలకు అల్పాహారం సమతులంగా ఉండేలా చూసుకోవాలి. దానికోసం మనం ఎప్పుడూ చేసే సింపుల్ వంటకాల్లోనే కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. అదెలాగో చూసేయండి.

పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్
పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ (pexels)

పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్

పిల్లలు ఉదయాన్నే బడికి తయారవుతారు. ఆ హడావిడిలో సమయం సరిపోక ఉదయాన్నే సరిగ్గా తినడం మానేసి పాఠశాలకు బయలుదేరుతూ ఉంటారు. ఉదయాన్నే శరీరానికి మంచి పోషకాహారాన్ని అందించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే వారు ఆ రోజంతా హుషారుగా చదువులు చదువుకోగలుగుతారు. అలా కాకుండా ఏదో చిన్న బ్రెడ్డు ముక్కో, టోస్టో పెట్టి పంపించేశారంటే వారు రోజంతా శక్తివంతంగా ఉండలేరు. మరి వారు రోజంతా హుషారుగా, ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ పెట్టాలి అనేదాన్ని తప్పకుండా అందరు తల్లిదండ్రులూ తెలుసుకోవాల్సిందే.

సమతుల ఆహారం:

ఉదయాన్నే మీరిచ్చే టిఫిన్‌లో ప్రొటీన్‌లు, కార్బోహైడ్రేట్‌లు, పీచు పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర విటమిన్లు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. అందుకు మంచి బ్రేక్‌ఫాస్ట్‌ ఆప్షన్‌లు ఏమున్నాయో ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు ఇక్కడ రెండు రెసిపీలు ఉన్నాయి.

  1. ప్రొటీన్ రిచ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ కోసం మంచి ఎంపిక ఏమిటంటే ఉడికించిన గుడ్ల కంటే కూడా ఆమ్లెట్‌ చాలా మంచిది. చక్కగా కాసిన్ని కూరగాయల ముక్కలు, కొత్తిమీర, అల్లం తరిగి, ఉప్పూ కారాలు వేసి అందులో రెండు గుడ్లను వేసి బాగా కలపండి. నూనెకు బదులుగా నెయ్యిని వాడండి. రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత పైన కాస్త చీజ్‌ని తురిము వేయండి. దీని వల్ల ప్రొటీన్‌లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు దొరికేస్తాయి. కూరగాయల ముక్కల వల్ల పీచు పదార్థమూ ఉంటుంది. దీన్ని చెప్పాలంటే పర్ఫెక్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
  2. మన దగ్గర ఉదయాన్నే ఉప్మా చేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఇది చేసే విధానంలో కాస్త మార్పులు చేస్తే ఆరోగ్యకరంగా పిల్లలకు టిఫిన్‌ని అందివ్వవచ్చు. ఉప్మా చేసేటప్పుడు తీసుకునే రవ్వ పాలిష్‌ చేసింది కాకుండా పొట్టు రవ్వ తీసుకోండి. అందులో పిండి పదార్థంతో పాటుగా పీచు పదార్థం కూడా ఉంటుంది. సగం పరిమాణంలో ఈ రవ్వ ఉంటే మరో సగం పరిమాణంలో ప్రొటీన్‌, పోషకాలను యాడ్‌ చేయాల్సి ఉంటుంది. అంటే మిల్‌మేకర్‌, పనీర్‌, క్యాబేజ్‌, క్యారెట్‌, బీట్‌ రూట్‌, బీన్స్‌ లాంటి వాటిని తరిగి వేయండి. వీటితో పాటుగా కొత్తిమీర లాంటి ఆకు కూర ఉండేలా చూసుకోండి. అందులో తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్‌ లను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. ముందు వీటన్నింటినీ తాలింపులో బాగా వేయించి తర్వాత నీరు పోసి మరగనివ్వండి. అప్పుడు కాస్త రవ్వ వేసి ఉప్మాను తయారు చేయండి. ఇలా ఉప్మాను తయారు చేయడం వల్ల పిల్లలకు ఉదయాన్నే కావాల్సిన పోషకాలన్నీ సమృద్ధిగా లభిస్తాయి. వారు రోజంతా హుషారుగా ఉంటారు. ఇలాంటి రెసిపీలను మీరూ ఆలోచించి చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం