Pooja Room Tips: పూజ గదిలో ఈ మార్పులతో మరింత అందంగా.. ట్రెండీగా..
22 November 2023, 17:00 IST
Pooja Room Tips: పూజ గదిని ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్లుగా, కొత్తగా అలంకరించాలి అనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.
పూజ రూం డెకొరేషన్
మనింట్లో అన్నింటి కంటే చాలా పవిత్రంగా భావించే గది పూజ గది. మన ఇల్లు అంతటికీ పాజిటివ్ వైబ్రేషన్లను వెదజల్లే గదిగా దీన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకనే మిగిలి వాటితో పోలిస్తే దీని విషయంలో మరింత శ్రద్ధ వహిస్తాం. మరింత శుభ్రంగా ఉంచుతాం. కొత్తగా ఇల్లు కట్టుకునే వారైనా, పాత ఇల్లు ఉన్న వారైనా దీన్ని ఎలా సర్దుకున్నారు అన్నదాన్ని బట్టి వారి టేస్ట్ ఏంటి అనేది తెలిసిపోతుంది. మరి ఎవరెవరు ఎలా దీన్ని సర్దుకోవచ్చో తెలుసుకుందాం రండి.
కొత్త ఇల్లు కట్టుకునే వారు :
ఎన్ని ఇంటీరియర్ డిజైన్లు వచ్చినా సరే మనం పూజ గది విషయంలో తప్పకుండా వాస్తును చూసుకుంటాం. ఏ పటాలు పెట్టుకోవాలి? ఏ దిశలో విగ్రహాలు ఉండాలి? లాంటి వాటిలో చాలా లెక్కలు ఉంటాయి. ఎవరి నమ్మకాలను బట్టి వారు సర్దుకుంటూ ఉంటారు. అయితే కొత్త ట్రెండ్‌లను చూసుకున్నట్లయితే ఓపెన్ పూజ గదులు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అంటే చిన్న అరను దేవుడికి కేటాయించడం కాకుండా.. గుడిలో దేవుడిని పెట్టినట్లుగా గది గోడకు మధ్యలో దేవుడి విగ్రహాలను ఉంచి అలంకరించుకుంటున్నారు. గదంతా ఖాళీగా ఉంటే చక్కగా కుటుంబం అంతా కూర్చుని పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.
ఉన్న పూజ గదికి మోడ్రన్ లుక్ తేవొచ్చిలా :
- పాత దేవుడి గది ఉన్నా సరే.. చిన్న చిన్న మార్పులతో దాన్ని కొత్తగా ట్రెండీగా మార్చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో పీవీసీ షీట్లను రకరకాల డిజైన్లలో కత్తిరించి పూజ గదుల్లో వేసుకుంటున్నారు. అలాంటి షీట్‌ని మీ గది కొలతల ఆధారంగా ఒకటి డిజైన్ చేయించి పెట్టి చూడండి. వెనకాల చిన్న వార్మ్ లైటింగ్ కూడా ఇస్తే సరిపోతుంది. గదిలోకి వెళ్లగానే ఆధ్యాత్మిక భావాలతో మనసు నిండిపోతుంది.
- ఇక పూజ గది ఇంటీరియర్‌లో ఇత్తడి వస్తువులు చక్కగా నప్పుతాయి. వేలాడే గంటలు, వేలాడే ఇత్తడి కుందుల్లాంటివి మీ పూజ గదికి మంచి లుక్‌ని తీసుకొస్తాయి. పాతవి ఉంటే వాడిని మంచి యాంటిక్ లుక్ వచ్చేస్తుంది.
- ఇక పూజ సామాన్లను ఆర్గనైజ్ చేసుకోవడానికి రెండు అరలను కేటాయించుకోండి. ఒక అరలో ఎప్పుడో ఒకసారి వాడే వాటిని పెట్టుకోండి. మరో అరలో రోజూ దీపారాధన, ధూపం ఇవ్వడం లాంటి వాటికి వాడే సామగ్రిని పెట్టుకోండి. అప్పుడు గందరగోళం లేకుండా ఏ వస్తువులైనా కావాల్సినప్పుడు దొరుకుతాయి.
- ఈ గదిలో ఎక్కువగా వార్మ్ లైటింగ్ ఉండేలా చూసుకోండి. అందువల్ల గది వాతావరణం మరింత భక్తిగా మారుతుంది.
- ఆయిల్ డిఫ్యూజర్‌లో కర్పూరం, ఎసెన్సియల్ ఆయిల్‌లను వేసి వేడి చేయండి. ఈ పరిమళం ఇల్లంతా పరుచుకుని ఆహ్లాదాన్ని పంచుతుంది.