Holi Culture | రింగు రింగు బిళ్ల రూపాయి దండ.. తెలంగాణలో హోళీ అంటే అట్లుంటది!
16 March 2022, 19:59 IST
- హోళీ/ హోలీ అనేది హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో ఒకటి. తెలంగాణలో ఈ పండుగను ప్రముఖంగా జరుపుకుంటారు. రాష్ట్రంలో హోలీ సంస్కృతి, సంప్రదాయాలు ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి.
Holi Celebrations in Telangana (Representative Image)
అన్ని పండుగల్లాగే తెలంగాణ రాష్ట్రంలో హోళీ పండుగను కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా కొన్నిరోజుల ముందుగానే సిద్ధం చేసుకుంటారు. తెలంగాణలో హోళీ పండుగ విశేషమైన చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని కలిగి ఉంది.
హోళీకి కొన్నిరోజుల ముందు గ్రామాలు, పట్టణాల్లో ఒక్కో వాడకు చెందిన పిల్లలు, యువకులు కలిసి ఒక బృందంగా ఏర్పడతారు. వీరు ఇంటింటికి వెళ్లి 'జాజిరి జాజిరి' కోలాటం ఆడుతూ చందాలు అడుగుతారు. కోలాటం సమయంలో పల్లెపదాల అల్లికతో పాడేపాటలు గమ్మత్తుగా ఉంటాయి.
"రింగు రింగు బిళ్ల.. రూపాయి దండ..
దండ కాదురా తామర మొగ్గ
మొగ్గ కాదురా మోదుగు నీడ
నీడ కాదురా నిమ్మలబాయి
బాయి కాదురా బచ్చల కూర
కూర కాదురా కుమ్మరి మెట్టు
మెట్టు కాదురా మిరియాల పొట్టు
పొట్టు కాదురా పోరని జుట్టు
పోరని జుట్టుకి దారం కట్టి గిరగిరా తిప్పి బండకు కొట్టు" అంటూ గుమ్మం ముందు నిల్చొని కోలాలు కొడుతూ చిత్రవిచిత్రంగా పాటలు పాడతారు. ఆ ఇంటి వారు చందా ఇచ్చేంత వరకు ఇలాంటి ఎన్నో పాటలు పాడుతూనే ఉంటారు.
కామదహనం
హోళీకి ఒకరోజు ముందు ఫాల్గుణ పౌర్ణమి గడియల్లో కామదహనం నిర్వహిస్తారు. సంక్రాంతికి వేసే భోగి మంటల తరహాలోనే ఈ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని ప్రధాన కూడళ్లు, చౌరస్తాలలో కర్రలు, పిడకలు, ఇతర కలప వస్తువులతో ఒక కాముడి ప్రతిరూపాన్ని ఏర్పాటు చేస్తారు. సాయంత్రం వేళల్లో చీకటి పడిన తర్వాత సరైన ఘడియలు చూసి వాడకట్టు అందరి సమక్షంలో ఈ కాముడ్ని కాల్చే కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం కూడా సరదాసరదా హోళీ నినాదాలతో నిర్వహిస్తారు. కాముడికి నమస్కరిస్తూ మంచి జరగాలని మొక్కుకుంటారు.
ఈ కాముడ్ని కాల్చే నిప్కలతో (నిప్పు రవ్వలతో) ప్రజలు శనగబుడ్డలు (నేరుగా పంటచేను నుంచి తీసుకొచ్చిన శనగ మొక్కలు) లను కాల్చుకుంటారు. శనగబుడ్డలు లేకపోతే ఎండు శనగలను కాలుస్తారు. వీటిని ప్రజలు ప్రసాదంగా స్వీకరిస్తారు.
అలాగే కాముడ్ని కాల్చగా మిగిలిన బూడిదను విభూదిగా భావించి నుదుటన బొట్టుగా పెట్టుకుంటారు. ఇలా చేస్తే ఎలాంటి చెడు దృష్టి మీద పడదని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ విభూదిని డబ్బాలో దాచుకొని దిష్టి తగిలిందని భావించిన సందర్భంలో తిలకంలా పెట్టుకుంటారు. చెడు మార్గం వీడి, మంచి మార్గంలో నడిచేందుకు కూడా ఈ విభూదిని పెట్టుకుంటారు. కాముడ్ని కాల్చిన మరుసటి రోజే హోళీ పండుగగా జరుపుకుంటారు.
హోళీ
హోళీ రోజూ ఉదయాన్నే ఒక సుహృద్భావ వాతావరణంలో వేడుకలు ప్రారంభమవుతాయి. హోళీ వేడుకల్లో ప్రధాననది ఒకరిపైఒకరు రంగులు చల్లుకోవడం. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఈ రంగులను అందరికీ పూయరు. ఎవరైతే వరస అవుతారో వారికి మాత్రమే. అంటే.. బావా మరదళ్లు, బామ్మర్దులు, భార్యాభర్తలు, స్నేహితులు, ఇతరులెవరికైనా పూయొచ్చు. అయితే కన్నవారిపై, తోబుట్టువులపై రంగు చల్లరు.
ఇక ఈ రంగు కోసం మోదుగుచెట్టు పువ్వులను తెంపి వేడినీటిలో ఉడికించగా వచ్చిన రంగు ద్రావణాన్ని రంగుగా వాడతారు. ఇప్పుడు మరీ అంతగా సంప్రదాయాలను పాటించడం లేదు కనుక మార్కెట్లో లభించే వివిధ రకాల రంగులను వాడుతున్నారు.
నీటిలో కలిపి ఒకరిపై ఒకరు పిచికారి చేయడం, రంగును చల్లడం చేస్తారు. ఇలా సంతృప్తి చెందనివారు ఇంకో అడుగు ముందుకేసి మొఖానికి మసిబొగ్గు పూయడం, తలపై కోడిగుడ్లను పగలగొట్టడం చేస్తారు.
ఉదయం నుంచి స్నేహితులు ఒకరొకరుగా జతకట్టి ఒక బృందంగా ఏర్పడి వాడవాడ, ఇంటింటికి వెళ్లి వారికి రంగు పూసి, హోళీ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆ తర్వాత వారిని వారి బృందంలో చేర్చుకొని ఇంకా ఎవరైనా ఉన్నారా? అని అణ్వేషించి, వెంటాడి వేటాడి మరీ రంగు చల్లేస్తారు. హోళీ రంగులు ఇష్టపడని వారు, భయపడేవారు, బద్ధకస్తులు ఇంట్లోనే దాగి ఉంటారు.
శక్కరి పేర్లు
హోలీ రోజున పిల్లలకు చక్కెర బిళ్లలు (Sugar Candy Garland), ఖర్జూరం, ఎండుకొబ్బరితో చేసిన దండ ఒకటి మెడలో వేస్తారు. ఇలా వేయడం ఒక అనవాయితీ. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు.
అర్బన్ ప్రాంతాల్లో హోళీ
తెలంగాణ నగరాల్లో కూడా హోళీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. కామదహనం తర్వాత హోళీ పండగ రోజు ఏదైనా అపార్టుమెంట్, కాలనీవాసులు, బంధువులు, స్నేహితులు ఎవరికి వారు బృందాలుగా ఏర్పడి తెల్లని జుబ్బా ధరించి రంగులు పూసుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ హోళీ జరుపుకుంటారు. కొందరు బ్యాండ్ మేళంతో ఊరేగింపుగా బైక్ ల మీద, కార్ల మీద షికారు వెళ్తారు. దావత్ లాంటివి చేసుకుంటారు.
కార్పోరేట్ కల్చర్ హోళీ
హైదరాబాద్ లాంటి నగరాల్లో హోళీ ఈవెంట్స్ జరుగుతాయి. సాధారణంగా ఈ వేడుకలు ఉదయం నుంచి సాయంత్ర వరకు సాగుతాయి. హోళీ స్ప్రేలు, రెయిన్ డాన్సులు, 'బలమ్ పిచ్ కారీ, రంగ్ బర్సే' అంటూ డీజే సౌండ్ల మధ్య కోలాహలంగా హోళీ వేడుకలు జరుగుతాయి.