తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Wash Tips: తలస్నానం ఎన్ని రోజులకోసారి చేస్తే మంచిది? రోజూ చేస్తే ఏమవుతుంది

Hair Wash tips: తలస్నానం ఎన్ని రోజులకోసారి చేస్తే మంచిది? రోజూ చేస్తే ఏమవుతుంది

10 October 2023, 17:00 IST

google News
  • Hair Wash tips: తలస్నానం రోజూ చేయాలా, వారానికోసారి చేయాలా అనే సందేహం ఉందా. అయితే ఆ వివరాలేంటో, ఎలా చేస్తే మంచిదో తెలుసుకోండి.

తలస్నానం
తలస్నానం (unsplash)

తలస్నానం

తలస్నానం చేయడం వల్ల తలపై పేరుకు పోయిన మలినాలు, మురికి, జిడ్డు అంతా తొలగిపోయి మాడు శుభ్ర పడుతుంది. అయితే ఎన్ని రోజులకు ఒకసారి స్నానం చేయడం మంచిది అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. కొందరు వారం పది రోజులకు ఒకసారి తల స్నానం చేస్తుంటారు. మరి కొందరేమో ప్రతి రోజూ తల స్నానం చేసేస్తుంటారు. ఇలా ఎక్కువ రోజులకు ఒకసారి చేయడం, అతిగా ప్రతి రోజూ చేయడం రెండూ మంచిది కాదని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.

రోజూ ఎవరు తల స్నానం చేయాలి?

సాధారణంగా కొందరు ఎప్పుడూ కాలుష్యంలో తిరుగుతూ ఉంటారు. బయటి వాతావరణంలో ఉద్యోగాలు చేసేవారు పని రీత్యా రోజు మొత్తం బండిపైన ఎండలో ఎప్పుడూ తిరుగుతారు. కాబట్టి వీరి తలకు ఎక్కువగా చమటలు పట్టేస్తుంటాయి. దానికి రోడ్డుపై ఎగిరే దుమ్ము తోడవుతుంది. కాలుష్య రేణువులూ జట్టుకు ఆకర్షితం అవుతాయి. ఇలాంటి వారు తప్పకుండా రోజూ తల స్నానం చేయడం మంచిది. లేకపోతే కలుషిత దుమ్ము తదితరాల వల్ల స్కాల్ప్‌, జుట్టు కుదుళ్లు బలహీనమై జుట్టు ఊడిపోయే సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వారు రసాయన పూరితమైన షాంపూలను కాకుండా సహజమైన క్లెన్సర్లను జుట్టుకు వాడుకోవాలి. లేదంటే ఈ రసాయనాలూ జుట్టుకు ఇబ్బందికరంగా తయారవుతాయి. జుట్టు పల్చగా ఉన్నవారు, కేశాలు బలహీనంగా ఉన్న వారు, పొడి జుట్టు ఉన్న వారు రోజూ తలస్నానం అస్సలు చేయకూడదు.

రోజూ ఎవరు తల స్నానం చేయకూడదు?

ఆఫీసుల్లో కూర్చుని ఉద్యోగాలు చేసుకునే వారు, ఇంట్లో ఉండే వారు, తక్కువ శారీరక శ్రమ చేసే వారు రోజూ తలస్నానం చేయాల్సిన అవసరం ఉండదు. వీరు వారానికి రెండు సార్లు వరకు తల స్నానం చేయడం వల్ల జుట్టు కుదుళ్లు శుభ్రపడతాయి. ఎలాంటి జుట్టు తీరు ఉన్న వారికైనా ఈ పద్ధతి చక్కగా సరిపోతుందని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.

తల స్నానం తర్వాత జాగ్రత్తలు అవసరమా?

తల స్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా ఆరకుండా బయటకు వెళ్లకూడదు. తడి జుట్టుపై ఎక్కువ దుమ్ము, ధూళి చేరిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే జుట్టును ఆరబెట్టుకోవడానికి ఎక్కువ వేడి వచ్చే బ్లోయర్లు, డ్రయ్యర్లు, స్ట్రైటనర్లను వాడకపోవడం ఉత్తమం. ఇవి కేశాలను నిశ్తేజంగా మారుస్తాయి. జుట్టు తడిగా ఉన్నప్పుడు అది ఎక్కువగా సాగే లక్షణాన్ని కలిగి ఉంటుంది. తొందరగా డ్యామేజ్‌ అయ్యే విధంగా ఉంటుంది. అందుకనే ఈ సమయంలో జుట్టులో దువ్వెనను కూడా పెట్టకూడదు. పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే బయటకు వెళ్లడం మంచి పద్ధతి.

టాపిక్

తదుపరి వ్యాసం