హెయిర్ కట్ అప్పుడు చేయించుకోకూడదట.. తలస్నానం ఆరోజుల్లో చేస్తే మంచిదట-these days are not good for hair cut and head bath here is the reasons ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  హెయిర్ కట్ అప్పుడు చేయించుకోకూడదట.. తలస్నానం ఆరోజుల్లో చేస్తే మంచిదట

హెయిర్ కట్ అప్పుడు చేయించుకోకూడదట.. తలస్నానం ఆరోజుల్లో చేస్తే మంచిదట

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 28, 2022 06:51 PM IST

Good Days For Haircut : చెప్పి వెళ్లాలి.. చెప్పులేసుకెళ్లాలి అన్నట్లు కొన్ని విషయాలు కచ్చితంగా పాటిస్తూ ఉంటాము. బొట్టు పెట్టుకోవడం? హెయిర్ కట్ ఎప్పుడు చేయించుకోవాలి? తలస్నానం ఎప్పుడు చేయాలనే విషయాలపై కొందరు కొన్ని అంశాలు పాటిస్తారు. అవి ఎంతవరకు కరెక్ట్.. ఎప్పుడు వీటిని ఆచరించాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ కట్ ఎప్పుడు చేయించుకోవాలంటే..
హెయిర్ కట్ ఎప్పుడు చేయించుకోవాలంటే..

Good Days For Haircut : స్త్రీలు పాపిటిపై బొట్టు ఎందుకు ధరించాలి? మన సనాతన ధర్మంలో ప్రతీ పనికి నిగూఢమైన వివరణ ఉన్నదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మగారు తెలిపారు. మనకు పురాణాలలో లక్ష్మీదేవి అవతారము, లక్ష్మీదేవి ప్రాధాన్యత ప్రత్యేకమైనవి.

వాస్తవానికి లక్ష్మీదేవి ఐదు స్థానాలలో ఉంటుందని శాస్త్రము చెప్తుంది. లక్ష్మీదేవి నివసించే ఐదు స్థానాలలో మొట్టమొదటి స్థానము ఏనుగు ముఖము, ఏనుగు ముఖము నందు లక్ష్మీదేవి ఉండటం వలన పూర్వం చక్రవర్తులు అలాగే వేదవేదాంగములు పఠించినటువంటి విద్యావంతులు గజారోహణ చేసేవారు. ఇంటిలో వినాయక ముఖం ఉండటం.. గజముఖ రూపములు ఉండటం లక్ష్మీ కటాక్షం అని వాక్ శాస్త్రం తెలియచేస్తుంది. స్వప్నంలో గజము కాని, గజముఖము కాని కనిపించిన ఆ వ్యక్తికి దరిద్రం తొలగి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని స్వప్నశాస్త్రం చెప్తోంది.

తలపై కుంకుమ ఎందుకు పెట్టుకోవాలి..

లక్ష్మీ స్థానాల్లో రెండవ స్థానము గోవు వెనుకభాగము, లక్ష్మీ స్థానాలో మూడవ స్థానము మారేడు దళము వెనుక భాగము. అలాగే స్త్రీల పాపిటి ఉన్న స్థానము లక్ష్మీ స్థానమని ఆ స్థానమునందు కుంకుమ ధరించడం వలన సౌభాగ్య సిద్ధి, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని శాస్త్ర వచనము. అందుచేత ప్రతీ స్త్రీ వివాహమైనా.. స్త్రీలు సౌభాగ్య ప్రాప్తి కోసం, లక్ష్మీ కటాక్షం కోసం పాపిటిమీద కుంకుమతో బొట్టును పెట్టుకోవడం వంటివి ఆచారంగా వస్తూ ఉంది. ఇది సౌభాగ్య ప్రదం, లక్ష్మీప్రదంగా భావిస్తారు.

హెయిర్ కట్ ఎప్పుడు చేసుకోవాలి?

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వెంట్రుకలకు శనిగ్రహము, కుజ గ్రహ సంబంధములున్నాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మగారు తెలిపారు. క్షవర కర్మలకు సోమవారం, బుధవారం, గురువారం ఉత్తమమైనవిగా.. ఆదివారము, శుక్రవారము మధ్యస్తమైనవిగా.. మంగళవారం, శనివారం నిషేధమని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం, శనివారం క్షవర కర్మలు ఆచరించ కూడదని చెప్తున్నారు. చవితి, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య తిథులు పనికిరావని.. సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో ఆచరించుకోవడం శుభ ఫలితాలు ఇస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెప్తుంది.

తలస్నానం ఎప్పుడు చేయాలి?

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఆదివారం తలస్నానం ఆచరిస్తే పీడ అని సోమవారం తలస్నానం ఆచరిస్తే మనశ్శాంతి కలుగుతుందని మంగళవారం తలస్నానం ఆచరిస్తే ఆయుష్షు క్షీణమని.. బుధవారం తలస్నానం ఆచరిస్తే ధనాభివృద్ధి, గురువారం తలస్నానం ఆచరిస్తే శ్రమ, ఒత్తిడి.. శుక్రవారం తలస్నానం ఆచరిస్తే సౌఖ్యం.. శనివారం తలస్నానం ఆచరిస్తే సర్వ లాభం, లక్ష్మీ కటాక్షం అని తెలిపారు. అందువలన ఏ వ్యక్తి అయినా సరే సోమ, బుధ, శనివారాలు తలస్నానం ఆచరించడం ఉత్తమమని ఆది, శుక్రవారాలు మధ్యమమని మంగళ, గురువారాలు తలస్నానం ఆచరించకపోవడం మంచిదని తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం