తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Flooring Guide: ఇంట్లో ఏం ఫ్లోరింగ్‌ వేయించాలా? అని ఆలోచిస్తున్నారా?

Flooring Guide: ఇంట్లో ఏం ఫ్లోరింగ్‌ వేయించాలా? అని ఆలోచిస్తున్నారా?

HT Telugu Desk HT Telugu

28 September 2023, 11:18 IST

google News
  • Flooring Guide: ఇంట్లో వేసే ఫ్లోరింగ్ వళ్లే దాని అందం రెట్టింపు అవుతుంది. అయితే దాన్ని ఎంచుకునేటపుడు ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకోవాలో చూసేయండి. 

ఫ్లోరింగ్
ఫ్లోరింగ్ (pexels)

ఫ్లోరింగ్

కొత్త ఇల్లు ప్రతి ఒక్కరి కల. అనుకున్నట్లుగా అందంగా, సౌకర్యవంతంగా ఇంటిని నిర్మించుకోవాలని అంతా అనుకుంటారు. అందుకోసం ఎన్నో ఆప్షన్‌లను వెతుక్కుంటారు. ఇలా కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునే వారు ఇంట్లో ఏం ఫ్లోరింగ్‌ చేయించుకోవాలి? అనే దానిపై తర్జనబర్జనలు పడుతుంటారు. మన దేశంలో ఫ్లోరింగుల విషయానికి వస్తే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవి.. గ్రానైట్‌, మార్బుల్‌, టైల్స్‌, వినైల్‌ లాంటివి. మనకున్న అవసరాలు, బడ్జెట్‌, మన్నిక లాంటివాటిని దృష్టిలో ఉంచుకుని దేన్ని వేసుకోవాలనే దానిపై నిర్ణయానికి రావాలి.

గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ :

మిగిలిన అన్ని ఫ్లోరింగ్‌ల కంటే గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ చేయించుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే ఈ రాళ్లు మీ జీవితకాలం చక్కగా మన్నుతాయి. ఇల్లు అద్దంలా మెరిసిపోతూ రిచ్‌ లుక్‌ కావాలనుకునే వారు వీటిని ఎంచుకోవచ్చు. ఈ రాళ్లు తెలుపు, నలుపు, బూడిదరంగు.. లాంటి రకరకాల రంగుల్లో, టెక్స్చర్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఇవి తేమను పీల్చుకోవు. మరకలు పడవు. స్క్రాచ్‌ రెసిస్టెంట్‌గానూ ఉంటాయి. ఇవి పరిచిన ఇంటికి రీసేల్‌ విలువ కూడా ఎక్కువగా ఉంటుంది.

మార్బుల్స్‌ :

మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా మార్బుల్స్‌ వేసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. ఇవి తెలుపు, నలుపు, పచ్చ.. లాంటి రకరకాల రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఈ సహజమైన రాళ్ల లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి వీటి ధర ఎక్కువగా ఉంటుంది. ఇవి ఏమైనా పదార్థాలు పడితే వాటిని పీల్చుకుని మరకలు పడతాయి. తేమనూ పీల్చుకుంటాయి. అయినా దీర్ఘకాలం పాటు మన్నుతాయి. ఒకవేళ పాతగా అనిపించినా మరోసారి పాలిష్‌ పెట్టించుకుంటే చాలు. మళ్లీ అవి కొత్తవాటిలా మెరిసిపోతాయి.

వినైల్‌ ఫ్లోరింగ్‌ :

ఈ వినైల్‌ షీట్లను నేలకు వేయించుకోవడం వల్ల మంచి లగ్జరీ లుక్‌ వస్తుంది. ఇవి పీవీసీ నుంచి తయారవుతాయి. ఇవి చూడ్డానికి టేక్‌ వుడ్‌ ఫీలింగ్‌ని ఇస్తాయి. ఇవి తడిసినా ఏమీ కాదు. శుభ్రం చేసుకోవడమూ తేలికే. అయితే కొన్ని రకాల రసాయనాలు తగిలినప్పుడు ఇవి ప్రతిస్పందిస్తాయి. మండే గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకనే వీటిని బయట వైపు, వంట గదుల్లో వేయించుకోకూడదు. గ్రానైట్‌, మార్బుల్‌ ఫ్లోరింగ్‌లతో పోలిస్తే వీటి మన్నిక అంత కాలం ఉండదనే చెప్పాలి.

టైల్స్‌ ఫ్లోరింగ్‌ :

టైల్స్‌ ఏ ధరల్లో కావాలంటే ఆ ధరల్లో అందుబాటులో ఉంటాయి. రకరకాల మందాలు, ఎన్నో సైజులు, మరెన్నో డిజైన్లు. అందుకనే మధ్యతరగతి వారందరూ ఎక్కువగా టైల్స్‌ ఫ్లోరింగ్‌లు చేయించుకునేందుకే ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీటి నాణ్యత తయారు చేసే కంపెనీలను బట్టి మారుతూ ఉంటుంది. బాత్రూమ్‌లకు, పార్కింగ్‌ ఏరియాలకు, పోర్టికోలకు, ఇంట్లోకి ఇలా అవసరానికి తగినట్లుగా వీటిలో రకాలు ఉంటాయి కాబట్టి ఎలా కావాలంటే అలా ఎంపిక చేసుకోవచ్చు. వీటి నాణ్యత, ఎలా పరిచారు అన్నదాని బట్టి వీటి మన్నిక ఉంటుంది. ఇంట్లో సరిసమానంగా పరవకపోతే ఇవి ముక్కలయ్యే అవకాశాలూ ఉంటాయి. కాబట్టి మనకున్న అవసరాలు, బడ్జెట్‌ను చూసుకుని దేన్ని ఎంచుకోవాలనేది నిశ్చయించుకోవాలి.

తదుపరి వ్యాసం