Calcium Rich Foods : కాల్షియం లోపంతో కనిపించే లక్షాలేంటి? కాల్షియం ఏ ఫుడ్‌లో లభిస్తుంది?
05 January 2023, 20:59 IST
- Calcium Rich Foods : మానవ శరీరం బాగుండాలంటే అవసరమైన అత్యంత ముఖ్యమైన ఖనిజ లవణం కాల్షియం. శరీరంలో అధిక మొత్తంలో ఉండే ఖనిజ లవణం కూడా ఇదే. అన్ని వయస్సుల వారికి కాల్షియం చాలా అవసరం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కాల్షియం అవసరం. ఎముక కాల్షియం రిజర్వ్‌లా పనిచేస్తుంది. ఎముక నిర్మాణంలో, రక్తం నుంచి ఎముకకు శోషణ కోసం కాల్షియం ఉపయోగపడుతుంది.
కాల్షియం
Calcium Rich Foods : కాల్షియం లోపించినప్పుడు బోన్ మాస్ తగ్గి ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. కాల్షియం లోపం వల్ల మెమొరీ లాస్ ఏర్పడుతుంది. కండరాలు పట్టేస్తాయి. చేతులు, కాళ్లు తిమ్మిర్లు పట్టడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. మానసిక వ్యాకులత ఏర్పడుతుంది. భ్రాంతులకు గురవుతారు. కండరాల నొప్పులు వేధిస్తుంటాయి. గోళ్లు చాలా బలహీనంగా కనిపిస్తాయి. ఎముకలు సులువుగా ఫ్రాక్చర్‌కు గురవుతాయి.
అందువల్ల ఎదుగుతున్న వయస్సులో అంటే 10 నుంచి 18 ఏళ్ల వయస్సులో కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా కాల్షియం అవసరం. గర్భం దాల్చి 10 వారాలు అయ్యాక డెలివరీ వరకు వైద్యులు కాల్షియం సిఫారసు చేస్తారు. కొన్నిసార్లు బిడ్డకు పాలు పట్టే కాలంలో కూడా తల్లికి కాల్షియం సప్లిమెంట్లు సిఫారసు చేస్తారు.
కాల్షియం ఎవరికి ఎంత మొత్తం అవసరం
కాల్షియం 10 నుంచి 18 ఏళ్ల చిన్నారులకు రోజుకు 1,300 మిల్లీగ్రాములు, 4 నుంచి 8 ఏళ్ల వారి 1000 ఎంజీ, 1 నుంచి 3 ఏళ్ల పిల్లలకు 700 ఎంజీ, 7 నుంచి 12 నెలల వయస్సు ఉన్న పిల్లలకు 260 ఎంజీ, 6 నెలలలోపు పిల్లలకు 200 ఎంజీ కాల్షియం అవసరం.
ఇక 19 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులకు 1000 ఎంజీ, 71 ఆపై వయస్సు ఉన్న పురుషులకు 1,200 ఎజీ కాల్షియం అవసరం. 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు రోజుకు 1000 ఎంజీ కాల్షియం అవసరం. 51 పైబడిన మహిళలకు రోజుకు 1200 ఎంజీ కాల్షియం అవసరం.
కాల్షియం లభించే ఆహార పదార్థాలు
కాల్షియం సజ్జలు, రాగులు, గోధుమ పిండి, కంది పప్పు, మినప పప్పు, పెసర పప్పు, ఉలవలు, అవిసి కూర(agathi leaves), మునగాకు, కరివేపాకు, తోటకూర, నువ్వులు, వేయించిన పల్లీలు, మాంసం, గుడ్డు, బర్రె పాలు, ఆవు పాలలో కాల్షియం లభిస్తుంది. నువ్వులు, అవిసి కూర, కరివేపాకు, రాగులు, ఉలవలు వంటి వాటిలో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. ఇక సార్డైన్స్, సాల్మన్ వంటి చేపలు, టోఫు, వైట్ బీన్స్, బ్రొకలీ, అత్తి పండ్లు వంటి వాటిలోనూ కాల్షియం లభిస్తుంది.
అయితే విటమిన్ డీ లోపం ఉంటే శరీరం కాల్షియంను శోషించుకోలేదు. అలాగే పాంక్రియాటైటిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా శరీరం కాల్షియాన్ని గ్రహించదు. విటమిన్ డీ స్థాయి పెరగాలంటే తగిన సప్లిమెంట్లు తీసుకోవడం, సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం, విటమిన్ డీ లభించే ఆహారం తీసుకోవడం చేయాలి.
టాపిక్