తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Health Tests For Women: గుండె జబ్బు పరీక్షలు చేయించారా? మహిళలూ ఇవి తెలుసా?

Heart health tests for women: గుండె జబ్బు పరీక్షలు చేయించారా? మహిళలూ ఇవి తెలుసా?

HT Telugu Desk HT Telugu

14 March 2023, 14:34 IST

google News
    • Heart health tests for women: మహిళలు గుండె జబ్బు పరీక్షలపై అవగాహన పెంచుకుని తగిన వయస్సులో ఆ పరీక్షలు చేయించుకుని నివారణ చర్యలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గుండె జబ్బుల నిర్ధారణకు మహిళలు చేయించుకోవలసిన పరీక్షలు
గుండె జబ్బుల నిర్ధారణకు మహిళలు చేయించుకోవలసిన పరీక్షలు (Shutterstock)

గుండె జబ్బుల నిర్ధారణకు మహిళలు చేయించుకోవలసిన పరీక్షలు

మహిళల్లో గుండె జబ్బులు విభిన్నంగా ఉండొచ్చు. లక్షణాలు వేరుగా కనిపించొచ్చు. గుండె పోటు వచ్చిన ఏడాది కాలంలో మరణం సంభవించే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తం గడ్డకట్టకుండా ఉపయోగించే మందులకు పురుషులు స్పందించినంత సానుకూలంగా మహిళలు స్పందించకపోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల మందుల విషయంలో ఇలా జరుగుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నతనంలోనే గుండె జబ్బు ప్రారంభమై నిశబ్దంగా కాలక్రమంలో ముదిరి ఆకస్మిక గుండె పోటుకు గురైన కేసుల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడవచ్చని వైద్య నిపుణులు వివరించారు.

ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కార్డియాలజీ విభాగం హెడ్, సీనియర్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తిలక్ సువర్ణ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలు వివరించారు. మహిళల్లో గుండె సమస్యల గురించి తెలుసుకునే ముందు లక్షణాలు వ్యక్తమయ్యే వరకు వేచి ఉండటం అవివేకమని, తగిన వయస్సులో అవసరమైన గుండె పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని నొక్కి చెప్పారు. 20-40 సంవత్సరాల వయస్సు గల మహిళలకు పలు పరీక్షలను సూచించారు.

1. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ):

గుండెలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రికార్డ్ చేయడం ద్వారా ఇది గుండె సమస్యలను త్వరగా గుర్తించడంలో సహాయపడుతుంది. అరిథ్మియాస్ (గుండె చాలా నెమ్మదిగా, చాలా త్వరగా లేదా క్రమరహితంగా కొట్టుకోవడం), ఇరుకైన లేక బ్లాక్ అయిన ధమనులు వంటి సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది. మీ శరీరంతో పేస్‌మేకర్ సమన్వయం, కార్డియోమయోపతి (గుండె గోడలు మందంగా లేదా విశాలంగా మారతాయి) లేదా ఇదివరకు గుండెపోటు వచ్చి ఉంటే వాటిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

2. లిపిడ్ ప్రొఫైల్:

లిపిడ్ ప్రొఫైల్‌నే కొలెస్ట్రాల్ టెస్ట్, లిపిడ్ ప్యానెల్ అని పిలుస్తారు. ఇదొక రక్త పరీక్ష. రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లైజరిడ్స్ స్థాయిలను ఈ రక్తపరీక్షలో తెలుసుకోవచ్చు. ధమనుల్లో కొవ్వులు పేరుకుపోయేందుకు గల ముప్పును ఈ రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. కొవ్వు పేరుకుపోయినప్పుడు అంతిమంగా మీ శరీరంలోని ధమనులు బ్లాక్ అయిపోతాయి.

3. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్:

ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పరీక్ష పరిగడపున (అంటే 10 నుంచి 12 గంటలు ఏమీ తినకుండా ఉండడం) చేస్తారు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్ అని అర్థం. అంటే మీకు షుగర్ లేదన్నమాట. 100 నుంచి 125 ఎంజీ/డీఎల్ ఉంటే ప్రిడయాబెటిస్ అని, 126 ఎంజీ/డీఎల్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే మీకు షుగర్ ఉందని, డయాబెటిస్ అని అర్థం.

40 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేసే పరీక్షలు

  1. ట్రెడ్‌మిల్ ఎక్సర్‌సైజెస్ స్ట్రెస్ టెస్ట్: దీని ద్వారా చాతీలో నొప్పికి గల కారణాలను, శ్వాస ఆడకపోవడానికి గల కారణాలను గుర్తించవచ్చు. శారీరక చురుకుదనం ఉన్నప్పుడు మీ గుండె ఏ మేరకు తట్టుకోగలుగుతుందనే విషయం తెలుసుకోవచ్చు. గండె ధమనుల్లో ఇరుకు ఏర్పడితే పసిగట్టొచ్చు.
  2. ఇమేజింగ్ ఎక్సర్‌సైజ్ స్ట్రెస్ టెస్ట్: దీనినే న్యూక్లియర్ లేదా సెస్టెమిబి స్ట్రెస్ టెస్ట్ అని అంటారు. లేదా స్ట్రెస్ ఎకోకార్డియోగ్రఫీ అని కూడా అంటారు. చాతీలో నొప్పికి గల కారణాలను మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
  3. హార్ట్ సీటీ స్కాన్: కరోనరీ ఆర్టరీ కాల్షియం (సీఏసీ) స్కోర్ తెలుసుకోవడానికి ఈ హార్ట్ సీటీ స్కాన్ టెస్ట్ చేస్తారు. ధమనుల్లో ఉండే కాల్షియం పొరలు పేరుకుపోయి ఉంటే ఇందులో తెలుస్తుంది. అథెరోస్ల్కెరోటిక్ కార్డియోవాస్కులర్ వ్యాధులకు ఈ కాల్షిఫైడ్ ప్లేక్ ప్రధాన కారకంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు, గుండె పోట్లకు దారితీస్తుంది.
  4. సీటీ కరోనరీ యాంజియోగ్రఫీ: చాతీ నొప్పికి హార్ట్ బ్లాక్స్ ఏమైనా కారణమా అన్న విషయం తెలుసుకునేందుకు ఈ సీటీ కరోనరీ యాంజియోగ్రఫీ చేస్తారు. ఈసీజీ, 2డీ-ఎకో, స్ట్రెస్ టెస్ట్‌లలో స్పష్టత రానప్పుడు ఈ టెస్ట్ చేస్తారు.

గుండె జబ్బుల లక్షణాలు బయటపడకముందే తగిన వయస్సులో తగిన పరీక్షలు చేయించుకుని నివారణ చర్యలు చేపట్టడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

తదుపరి వ్యాసం