తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Acidity Remedies । ఆసిడిటీని కలగటానికి కారణాలు అవే.. నివారణ మార్గాలు చూడండి!

Acidity Remedies । ఆసిడిటీని కలగటానికి కారణాలు అవే.. నివారణ మార్గాలు చూడండి!

HT Telugu Desk HT Telugu

03 August 2024, 22:11 IST

google News
    • Acidity Remedies: ఆసిడిటీ, అజీర్ణం ఇతర జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే దానిని ఇంటి చిట్కాలతో సరిచేసుకోవచ్చు, ఆసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
Acidity Remedies
Acidity Remedies (istock)

Acidity Remedies

Acidity Remedies: ఆసిడిటీని మనలో చాలా మంది ఒక్కసారైనా అనుభవించే ఉంటారు. గ్యాస్ట్రిక్ గ్రంథుల ద్వారా కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఈ ఆసిడిటీ వస్తుంది. ఇది పండుగలు, వేడుకలు ఎక్కువగా జరుగుతున్న సీజన్, ఈ సమయంలో మనం విందులు, వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటాం. ఈ సందర్భంగా అధిక కొవ్వు పదార్థాలు, అధిక కేలరీలు కలిగిన పదార్థాలు భారీగా తినేస్తాం. కానీ అది మీ కడుపులో సమస్యను సృష్టిస్తుంది. నూనెలో వేయించిన వేపుడు పదార్థాలు, కొవ్వు పదార్థాలు, కారంగా ఉన్న పదార్థాలు మీ జీర్ణవ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తాయి, దీనివల్ల కడుపులో మంటగా ఉంటుంది. దీనినే మనం సాధారణంగా ఆసిడిటీ అంటాము. దీని కారణంగా ఛాతీలో మంట, అజీర్ణం ఇతర లక్షణాలను కలిగిస్తుంది.

అయితే ఆసిడిటీ, అజీర్ణం ఇతర జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే దానిని ఇంటి చిట్కాలతో సరిచేసుకోవచ్చు, ఆసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

ఆసిడిటీ నుంచి ఉపశమనం కలిగించే చిట్కాలు

  1. జీలకర్రను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. కాసేపయ్యాక అందులో మరికొన్ని నీళ్లు పోసి, ఆపై దీనిని వేడి మీద చిక్కగా మరిగించాలి. అనంతరం కొద్దిగా చల్లబరిచి, గోరువెచ్చగా ఈ జీలకర్ర నీరు త్రాగాలి. ఇది ఆసిడిటీ , అజీర్ణం మొదలైన సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
  2. అజీర్తికి మెంతులు చాలా మంచివి. ఒక కప్పు నీటిలో మెంతులు వేసి, ఆపైన నీటిని మరిగించి, అనంతరం గోరువెచ్చని మెంతుల నీటిని తాగాలి. మీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.
  3. కడుపు సమస్యలను తగ్గించడంలో అల్లం టీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆహారం ఎక్కువగా తిన్నప్పుడు వికారం, వాంతులు వంటి సమస్యలు ఉంటే, 1 టీస్పూన్ అల్లం పొడిని 1 కప్పు నీటిలో వేసి మరిగించి టీలాగా చేసుకొని త్రాగాలి. ఇంకా, కడుపు నొప్పి, తిమ్మిర్లు, గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం మొదలైన వాటి నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు అల్లం మ్యాజిక్‌లా పనిచేస్తుంది.
  4. వాము విత్తనాలను ఒక పాన్‌లో వేయించి, అనంతరం దానిని పొడిగా గ్రైండ్ చేయండి. ఈ పొడికి కొద్దిగా నల్ల ఉప్పు కలపండి. భోజనం తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక టీస్పూన్ గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే ఆసిడిటీ ఉండదు. భోజనం చేసిన 10 నిమిషాల తర్వాత ఒక చిన్న చెంచాడు వాము, చిటికెడు నలుపు ఉప్పు, లేదా రాళ్ల ఉప్పును అర గ్లాసు నీటిలో కలిపి త్రాగాలి.
  5. పాలలోని కాల్షియం కడుపులో యాసిడ్ ఏర్పడకుండా చేస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా గుండెల్లో మంట అనిపిస్తే, ఒక గ్లాసు చల్లని పాలు తాగండి.

ఆసిడిటీ నివారణ మార్గాలు

- మీరు ఆసిడిటీ, గ్యాస్‌తో ఇబ్బంది పడుతుంటే మీరు రోజూ తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. నూనెలో వేయించిన స్పైసీ ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి. ఎప్పుడైనా ఇలాంటి మసాలా ఆహారాలు తిన్నప్పుడు ఆ రోజు కచ్చితంగా ఆకుకూరలను తినండి. ఇది పొట్టలో పేరుకున్న హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది. అలాగే ప్రతిరోజూ ఆహారంలో కారం తక్కువగా ఉండేలా చూసుకోంది, ఉడికించిన కూరగాయలు ఎక్కువ ఉండేలా చూడండి.

- అతిగా ధూమపానం చేయడం వలన గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, ఈ పరిస్థితిలో అధిక కేలరీల ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఆసిడిటీని కలిగిస్తుంది. కాబట్టి వివిధ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ధూమపానం చేయడం మానేయాలి.

- భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం సరికాదు. తిన్న వెంటనే నిద్రపోతే అది యాసిడ్ రిఫ్లక్స్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది, ఎందుకంటే భోజనం తర్వాత అడ్డంగా పడుకోవడం అనేది జీర్ణక్రియను మరింత కష్టతరం చేస్తుంది. తిన్న తర్వాత కనీసం 3 గంటలు వేచి ఉండి, ఆ తర్వాత నిద్రపోవడం ఉత్తమం.

- రాత్రికి తగినంత నిద్ర లేకపోవడం వలన కూడా కడుపులో ఆమ్లం పెరుగుతుంది, ఇది అన్నవాహికను చికాకుపెడుతుంది, యాసిడ్ అన్నవాహికలోకి ప్రవహించేలా చేస్తుంది. తద్వారా గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్/GERD లక్షణాలను కలిగిస్తుంది.

ఆసిడిటీ వంటి జీర్ణ సమస్యలకు మీ జీవనశైలి ప్రధాన కారణం. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు, ఆరోగ్యంగా ఉంటారు.

తదుపరి వ్యాసం