Cocoa Butter in Winter: కొకొవా బటర్ ఉన్న మాయిశ్చరైజర్ ఎంచుకోండి.. ఎందుకంటే..
04 December 2023, 13:00 IST
Cocoa Butter in Winter: చలికాలంలో నిర్జీవంగా, పొడిగా మారిన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది కొకొవా బటర్. ఈ బటర్ ముఖ్య పదార్థంగా ఉన్న మాయిశ్చరైజర్ ఎంచుకుంటే బోలెడు లాభాలు. అవేంటో చూసేయండి.
కొకొవా బటర్
చర్మం ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉండేందుకు అంతా రకరకాల క్రీములు, మాయిశ్చరైజర్లను వాడుతూ ఉంటారు. మార్కెట్లో వచ్చే ఖరీదైనా బ్రాండ్ల ఉత్పత్తులనన్నింటినీ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో కొన్ని మాయిశ్చరైజర్లు, బాడీ లోషన్లలో కొకొవా బటర్ పేరు కనిపిస్తూ ఉంటోంది. కొకొవా బీన్స్ నుంచి కొకొవా బటర్‌ని తయారు చేస్తారు. చర్మ సంరక్షణ విషయంలో దీన్ని ఇటీవల ఎక్కువగా వాడుతూ వస్తున్నారు. అయితే దీని వల్ల ప్రయోజనాలేంటో తెల్సుకుందాం.
మంచి మాయిశ్చరైజర్ :
కొకొవా బటర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ లాంటివి సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇది మనకు మంచి మాయిశ్చరైజర్లా పని చేస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. స్ట్రెచ్ మార్క్స్‌ని రానీయదు. ఒక్కసారిగా లావు కావడం వల్ల, స్త్రీలు గర్భం దాల్చినప్పుడు పొట్ట మీద చర్మం ఒక్క సారిగా సాగినట్లు అవుతుంది. అలాంటప్పుడు ఈ కొకొవా బటర్ ఉన్న క్రీంలను రాసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలా సాగిన చర్మం దగ్గర మచ్చలు ఏర్పడకుండా ఇది సంరక్షిస్తుంది.
వృద్ధాప్య ఛాయల్ని రానీయదు :
చాలా మంది తమ స్కిన్ రొటీన్‌లో భాగంగా రక రకాల బ్రాండ్లకు సంబంధించిన సన్ స్క్రీన్ లోషన్లు, మాయిశ్చరైజర్లు, లిప్ బామ్‌లు తదితరాలను వాడుతుంటారు. అలాంటి వాటిలో కొకొవా బటర్ ఉండేలా చూసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఇది చర్మానికి చక్కగా సాగే లక్షణాన్ని కలిగిస్తుంది. మృదువుగా చేస్తుంది. అందువల్ల గీతలు, మచ్చలు, ముడతల్లాంటివి రాకుండా చర్మం నిగారింపుతో ఆరోగ్యవంతంగా కనిపిస్తుంది. ఫలితంగా చర్మంపై వృద్ధాప్య ఛాయలు రావడం తగ్గుముఖం పడుతాయి.
చర్మం మెరిసేలా చేస్తుంది :
కొకొవా బటర్‌లో ఫైటో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మం కింది భాగంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అందువల్ల చర్మ కణాలు ఉత్తేజితం అవుతాయి. ఫలితంగా అది మరింత ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా మెరుస్తూ కనిపిస్తుంది. రంగు తగ్గకుండా ఉండేందుకు సహకరిస్తుంది.
పొడి చర్మం ఉన్న వారికి :
పొడి చర్మం ఉన్న వారు కచ్చితంగా కొకొవా బటర్ ఉన్న ఉత్పత్తులను వాడటం వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఇది వడలిపోయినట్లుగా ఉన్న చర్మ కణాల్లో ఉత్తేజాన్ని నింపుతుంది. అందువల్ల అది మళ్లీ జీవం పోసుకుని అందంగా కనిపిస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే కొకొవా బటర్ ఇప్పుడు ప్రముఖమైన చర్మ సౌందర్య పదార్థాల్లో ప్రముఖంగా ప్రాచుర్యం పొందుతోంది. చర్మ ఆరోగ్యం విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్న వారికైనా సరే ఇది పరిష్కారాన్ని చూపుతుంది.