తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kitchen Organizing Tips: ఈ చిట్కాలతో.. వంటిల్లు మరింత శుభ్రంగా.. వీలుగా!

Kitchen Organizing Tips: ఈ చిట్కాలతో.. వంటిల్లు మరింత శుభ్రంగా.. వీలుగా!

HT Telugu Desk HT Telugu

12 September 2023, 19:00 IST

  • Kitchen Organizing Tips: వంటగదిని కొన్ని చిట్కాలు పాటించి సర్దుకుంటే అన్ని వస్తువులు సులభంగా దొరుకుతాయి. వంట చేయడం కూడా ఈజీ అవుతుంది. అదెలాగో చూసేయండి.

కిచెన్ ఆర్గనైజింగ్
కిచెన్ ఆర్గనైజింగ్ (pexels)

కిచెన్ ఆర్గనైజింగ్

ఇంట్లో స్త్రీలు ఎక్కువగా ఇష్టపడే గది ఏమైనా ఉందా అంటే వంటిల్లు అని ఒకటే సమాధానం వినిపిస్తుంది. కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని వండి పెట్టేందుకు ఎక్కువగా ఇక్కడ సమయాన్ని గడపాల్సి వస్తుంటుంది. మరి ఈ చిన్న చిన్న టిప్స్‌ పాటిస్తే మీ కిచెన్ మరింత అందంగా, సౌకర్యవంతంగా తయారవుతుంది. తద్వారా మీ పనీ సులభతరం అవుతుంది. అవేంటంటే..

ట్రాన్స్‌పరెంట్‌ డబ్బాలు:

వంట చేసుకునేప్పుడు ఏ డబ్బాలో ఏముందా? అని వెతుక్కోవడానికే చాలా సమయం వృధా అయిపోతుంది. అలా కాకుండా వంట గది షెల్ఫుల్లో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే డబ్బాలను పెట్టుకునేందుకు ప్రయత్నించండి. మీ కిచెన్‌ని ప్లాస్టిక్‌ ఫ్రీగా ఉంచాలనుకుంటే గనుక ఇప్పుడు కొద్ది చోట ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే స్టీల్‌ డబ్బాలూ దొరుకుతున్నాయి. గాజు సీసాలూ అందుబాటులో ఉంటాయి. వాటిని ప్రయత్నించి చూడండి. పని సులభం అవుతుంది.

గట్టును ఖాళీగా ఉంచండి:

స్టౌ దగ్గర ఉండే కౌంటర్‌ టాప్‌ని ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచండి. అప్పుడు మీరు వంట చేసుకునే సమయంలో పని కాస్త సులభం అవుతుంది. అలా కాకుండా ఆ గట్టు అంతా సామాన్లతో నిండిపోయి ఉంటే వంట చేసుకునేప్పుడు గందరగోళంగా ఉంటుంది.

సరుకులనూ వేరు చేయండి:

వంట గదిలో షెల్ఫుల్ని అవసరాలకు అనుగుణంగా కేటాయించుకోండి. అన్ని సరుకుల్ని అన్ని షెల్ఫుల్లో సర్దేయకండి. బదులుగా ఎక్కువగా వంటకు వాడే సరుకుల్ని ఒక దగ్గర పెట్టుకోండి. తక్కువగా వాడే పదార్థాల్ని వేరే షెల్ఫులో పెట్టుకోండి. బేకింగ్‌ వస్తువులన్నింటినీ మరో దగ్గర పెట్టుకోండి. ఎక్కువ కాలం నిల్వ ఉంచాలి అనుకున్న వాటిని సింకుకు దూరంగా తేమ తగలని ప్రాంతంలో ఉంచండి.

సామాన్లను షింకులోనే ఉంచకండి:

వంట పూర్తయిన తర్వాత అంట్లను కొందరు వంటింటి షింకులోనే అలా ఉంచేస్తుంటారు. అలా చేయకండి. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడమో లేకపోతే బయట వేసుకోవడమో చేయండి. అవి ఉండటం వల్ల బ్యాక్టీరియాలు చేరి వంటింట్లో దుర్వాసన రావడం ప్రారంభం అవుతుంది.

ఆర్గనైజర్లు వాడండి:

వంటింట్లో ఉండే ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు లాంటి వాటికి ఆర్గనైజింగ్‌ షెల్పులు వస్తే సరేసరి. లేకపోతే వాటికి ప్రత్యేకమైన ఆర్గనైజర్లను ఏర్పాటు చేసుకోండి. అందువల్ల ఏది తీసుకోవాలన్నా వెతుక్కునే పని ఉండదు. కిచెన్ స్లాబ్ మీదే సులువుగా ఒదిగిపోయే రొటేటింగ్ ఆర్గనైజర్లు చాలా బాగా పనికొస్తాయి.

డస్ట్‌ బిన్‌ని దూరంగా:

సాధారణంగా చాలా మంది వంటింట్లోనే చెత్త డబ్బాను పెట్టుకుంటుంటారు. ఒకటి రెండు రోజులు గనుక అది అలాగే ఉండిపోతే సూక్ష్మ జీవులు చేరి కంపు రావడం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏ రోజుకారోజు చెత్తను తీసివేయండి. వెసులుబాటు ఉంటేగనుక అసలు దీన్ని వంటిటి బయట వైపు ఏర్పాటు చేసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం