Cooking Tips: కర్రీలో పసుపు ఎక్కువగా పడిందా? రుచిని ఇలా బ్యాలెన్స్ చేయొచ్చు
04 November 2024, 16:30 IST
- Cooking Tips: ఏవైనా మసాలా దినుసులు.. వంటకంలో ఎక్కువగా పడితే రుచి మారిపోతుంది. పసుపు ఎక్కువైనా ఇలా జరుగుతుంది. అయితే, పొరపాటున కూరలో పసుపు ఎక్కువ పడితే.. ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
Cooking Tips: కర్రీలో పసుపు ఎక్కువగా పడిందా? రుచిని ఇలా బ్యాలెన్స్ చేయొచ్చు
వంట చేస్తున్నప్పుడు అప్పుడుప్పుడు కర్రీల్లో ఏవో తక్కువగానో.. ఎక్కువగానో పడుతుంటాయి. అలాంటి సమయాల్లో వంటకం అనుకున్నంత రుచి రాదు. టేస్ట్ తేడా కొట్టడంతో నిరాశగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఉప్పు, మసాల దినుసుల విషయంలో ఎక్కువగా ఇలా జరుగుతుంటుంది. ఇలాగే, కర్రీల్లో పసుపు ఎక్కువగా వేసినా టేస్ట్, రంగు, వాసన చెడిపోతాయి. అయితే, కూరలో పసుపు ఎక్కువగా పడినప్పుడు ఏం చేయాలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇలా చేస్తే కర్రీ టెస్ట్ బ్యాలెన్స్ అవుతుంది.
నిమ్మరసం - టమాటో
ఒకవేళ పొరపాటున వంటకంలో పసుపు అతిగా పడిపోతే రుచి మారుతుంది. అలాంటి సమయంలో ఆ కర్రీలో నిమ్మరసం లేకపోతే టమాటో గుజ్జు వేయాలి. వీటి బదులు వెనిగర్ కూడా వేయవచ్చు. నిమ్మరసం, టమాటోల్లోని పుల్లదనం పసుపు ప్రభావాన్ని, చేదును తగ్గిస్తాయి. కర్రీ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. మరింత రుచికరంగానూ మారుతుంది.
బంగాళదుంప వేయడం
కూరలో పసుపు ఎక్కువగా పడితే.. బంగాళదుంప కూడా ఉపయోగపడుతుంది. పసుపు అధికంగా ఉన్న కర్రీలో ఉడికించిన బంగాళదుంపను వేసి కలుపుకొని.. మొత్తాన్ని ఉడికించాలి. ఇలా చేస్తే అనదంగా ఉన్న పసుపు ఫ్లేవర్‌ను బంగాళదుంప పీల్చుకుంటుంది. రుచిని బ్యాలెన్స్ చేస్తుంది. ఉప్పు లేకపోతే ఏవైనా మసాలా దినుసులు ఎక్కువైనా ఈ చిట్కా పాటించవచ్చు.
పెరుగు - క్రీమ్
కూరలో పసుపు ప్రభావాన్ని పెరుగు, క్రీమ్ తగ్గించేస్తాయి. వీటిలో ఏదో ఒకటి పసుపు ఎక్కువగా ఉన్న కర్రీలో వేసి కలుపుకోవాలి. ఇవి రుచిని మార్చేస్తాయి. పసుపు వల్ల వచ్చిన కాస్త చేదుదనాన్ని పెరుగు, క్రీమ్ పోగొడతాయి. అలాగే, కర్రీలోని గ్రేవి మరింత చిక్కగా అయి, రుచి మరింత పెరుగుతుంది.
వీటిని వేసి కూడా..
కర్రీల్లో పసుపు ఎక్కువగా పడడం వల్ల రుచి అంత బాగోదు. ఘాటు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, ధనియాల పొడి, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర పొడిలో ఏవైనా వేస్తే రుచి బాగా మారుతుంది. పసుపు ఘాటు తగ్గుతుంది. కూర మరింత రుచిగా మారుతుంది. సీజనింగ్స్ కూడా వాడవచ్చు.