Diabetics to drink milk: డయాబెటిస్ ఉన్న వారు పాలు తాగొచ్చా?
22 February 2023, 18:00 IST
- Diabetics to drink milk: డయాబెటిస్ ఉన్న వారు పాలు తాగొచ్చా? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఆధారాలతో సహా డయాబెటిస్ నిపుణులు ఈ సందేహాన్ని నివృతి చేస్తున్నారు.
డయాబెటిస్ ఉన్న వారు పాలు తాగొచ్చా?
డయాబెటిస్ ఉన్న వారు తమ డైట్‌లో సరైన ఆహారం చేర్చుకుంటే మధుమేహం వల్ల కలిగే దుష్పరిణామాలను నివారించవచ్చు. సమతుల ఆహారం, ముఖ్యంగా తక్కువ కొవ్వు, అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగకుండా చూసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్న వారు తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవచ్చు. తృణ ధాన్యాలు, ఆకు కూరలు, తేలికపాటి ప్రోటీన్, గింజలు, విత్తనాలు వంటివాటిని డయాబెటిస్ పేషెంట్లకు మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్న వారు డెయిరీ ఉత్పత్తులు తీసుకోవచ్చా? లేదా అన్నది చాలా మందిలో మెదిలో ప్రశ్న.
పాలల్లో కొవ్వులు ఉంటాయని, అవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పెంచుతాయని చెబుతారు. అయితే పాలల్లో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డీ వంటి పోషకాలు డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి. తక్కువ కొవ్వు ఉండే పాలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ పేషెంట్లకు మేలు చేకూరుతుందని పలు అధ్యయనాలు సిఫారసు చేస్తున్నాయి. అయితే ప్రతి వ్యక్తీ వైవిధ్యంగా ఉంటారు. అందువల్ల పాలు తాగిన తరువాత బ్లడ్ షుగర్ లెవెల్స్ తనిఖీ చేసుకోవడం మంచిది. అందువల్ల అవి మీకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుస్తుంది.
‘పాల వల్ల డయాబెటిస్ వస్తుందని గానీ, పరిస్థితి మరింత దిగజారుతుందని గానీ ఆధారం లేదు. కానీ పాల వల్ల టైప్-2 డయాబెటిస్ పేషెంట్లకు మేలు జరుగుతుంది..’ అని డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషలిస్ట్ సెంటర్ ఛైర్మన్ డాక్టర్ వి.మోహన్ వివరించారు.
How much milk is ideal for people with diabetes: డయాబెటిస్ ఉన్న వారు పాలు ఎన్ని తాగాలి?
డయాబెటిస్ ఉన్న వారికి ఒక గ్లాసు పాలు సరిపోతాయని డాక్టర్ మోహన్ సూచించారు. అంతకు మించి పాలను తాగడం మానుకోవాలని సూచించారు.
‘ఎక్కువగా పాలు తాగడం కూడా అంత మంచిది కాదు. ఒక గ్లాసు పాలు తాగడం సరిపోతుంది. అంతకు మించి తాగడం వల్ల దుష్ప్రభావాలు ఎదురయ్యే ప్రభావం ఉంది. పైగా లాక్టోజ్ ఇంటాలెరెన్స్ ఉన్న వారు డయేరియా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు పాలను తాగడం ఆపేయడం మంచిది..’ అని వివరించారు.
చెన్నై అర్బన్ రూరల్ ఎపెడిమిలాజికల్ స్టడీ (క్యూర్) చేసిన అధ్యయనాన్ని డాక్టర్ మోహన్ ఉదహరించారు. పాలు, పాలు ఉత్పత్తులు తీసుకున్న వారిలో డయాబెటిస్ సంభావ్యత తక్కువగా ఉందని, పాలు, పాల ఉత్పత్తులు టైప్-2 డయాబెటిస్ నుంచి రక్షణగా నిలుస్తాయనడానికి ఇది ఆధారమని వివరించారు.
Drinking milk can actually be beneficial in diabetes: పాల వల్ల డయాబెటిస్ పేషెంట్లకు మేలు
పాలు డయాబెటిస్ ఉన్న వారికి ప్రయోజనం చేకూరుస్తాయని గట్టి ఆధారాలు ఉన్నాయి. అందువల్ల పాలు తాగడం వల్ల డయాబెటిస్ వస్తుందని, డయాబెటిస్ అదుపులో ఉండదని చెప్పడం అపోహ మాత్రమేనని డాక్టర్ వివరించారు.
‘తొలుత స్కాండినేవియాలో జరిగిన ఒక అధ్యయనం శిశువుకు తక్కువ వయస్సులోనే ఆవు పాలు తాగించడం వల్ల టైప్-1 డయాబెటిస్ ముప్పు ఉంటుందని సూచించింది. అయితే తరువాతి రోజుల్లో అది నిరూపణ కాలేదు. అది ఆవు పాలు తాగించడం వల్ల కాదని, తొలి ఆరు నెలలు బేబీకి తల్లిపాలు పట్టించకపోవడం వల్లే అయి ఉండొచ్చనని అధ్యయనం సూచించింది..’ అని వివరించారు.