Hair conditioner: జుట్టుకు షాంపూ చేశాక కండిషనర్ చేయడం ముఖ్యమా? కండిషనర్ రాయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి?
17 February 2024, 10:11 IST
- Hair conditioner: చాలామంది తలకు స్నానం చేశాక కండిషనర్ రాసుకుంటారు. షాంపూ చేశాక కండిషనింగ్ చేసుకోవడం ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు బ్యూటీషియన్లు.
జుట్టుకు కండిషనింగ్ చేయాలా?
Hair conditioner: గాలి కాలుష్యం, సంరక్షణ తీసుకోకపోవడం వల్ల జుట్టు అధికంగా ఊడిపోతుంది. జుట్టు సంరక్షణలో షాంపూ చేసుకోవడం ఎంత ముఖ్యమో, కండిషనర్ పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. షాంపూ చేయడం వల్ల జుట్టు శుభ్రపడుతుంది. కానీ కండిషనర్ పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందనేది ఎక్కువ మందికి తెలియదు. కండిషనింగ్ ఎందుకు పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మీ జుట్టును షాంపూ చేసిన తర్వాత కండిషనర్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఇక్కడ మేము వివరిస్తున్నాము.
కండిషనింగ్ అవసరం
షాంపూ చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోతాయి. అప్పుడు జుట్టు పొడిగా, పెళుసుగా మారిపోతుంది. త్వరగా జుట్టు విరిగిపోయే అవకాశం ఉంది. మళ్లీ తిరిగి ఆ జుట్టును తేమవంతం చేసేందుకు కండిషనర్ రాసుకోవడం చాలా ముఖ్యం. కండిషనర్ వెంట్రుకలను హైడ్రేట్ చేస్తుంది. తేమను తిరిగి పునరుద్ధరిస్తుంది. దీనివల్ల జుట్టు మృదువుగా మారుతుంది.
కండిషనర్ లో ఎమోలియంట్లు, సిలికాన్లు వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి జుట్టు వెంట్రుకలను ఒకదాని నుంచి మరొకటి విడిగా ఉంటూ... రాపిడి కాకుండా సహాయపడతాయి. అలాగే చివర్లు విరిగిపోయే ప్రమాదాన్ని కూడా తగ్గుతుంది.
కండిషనింగ్ చేయడం వల్ల జుట్టు ఆకృతి కూడా అందంగా ఉంటుంది. కొందరు జుట్టు పిచ్చుక గూడులా కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా జుట్టుకు ఒక అందమైన ఆకృతి ఇవ్వడానికి కండిషనింగ్ చేసుకోవడం అవసరం. అలాగే జుట్టు నుండి ప్రోటీన్ నష్టాన్ని తగ్గించడానికి ఈ కండిషనర్ ఉపయోగపడుతుంది. వెంట్రుకలకు జీవశక్తిని అందించేందుకు సహాయపడుతుంది.
కండిషనింగ్ చేయడం వల్ల జుట్టు చుట్టూ ఒక రక్షిత వలయం ఏర్పడుతుంది. ఇది సూర్యరశ్మి నుండి వచ్చే యూవీ కిరణాలను అడ్డుకుంటుంది. అలాగే కాలుష్యం బారిన పడకుండా కాపాడుతుంది. పర్యావరణ ఒత్తిడి నుంచి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
కండిషనింగ్ చేయడం వల్ల జుట్టు మీకు నచ్చినట్టు వంగుతుంది. మెత్తగా, మృదువుగా ఉంటుంది. స్ట్రెయిటనింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
షాంపూ చేయడం వల్ల స్కాల్ప్ పై ఉన్న మురికి పోతుంది. మాడును శుభ్రపరచడమే షాంపూ పని. కండిషనింగ్ చేయడం వల్ల స్కాల్ప్ పై దురద వేయడం, పొడిబారడం, చికాకుగా అనిపించడం వంటి లక్షణాలు తగ్గుతాయి. అలాగే ఆరోగ్యకరమైన పీహెచ్ బ్యాలెన్స్ ను ఇది కాపాడుతుంది.
కాబట్టి షాంపు చేసుకున్నాక కచ్చితంగా కండిషనర్ వాడడం చాలా అవసరం. ఇది మీకు అన్ని విధాలుగా మేలే చేస్తుంది. జుట్టును సంరక్షిస్తుంది. మీ అందాన్ని కూడా పెంచుతుంది.
జుట్టు సంరక్షణ ఎంత ముఖ్యమో... వాటికి హెయర్ డ్రయర్లు వాడడం, హెయిర్ కర్లింగ్, హెయిర్ స్ట్రెయిటనింగ్ వంటివి చేయడం మానేయడము అంతే ముఖ్యం. వెంట్రుకలను అధిక వేడికి గురి చేయడం వల్ల అందులో ఉన్న తేమ మొత్తం పోతుంది. దీనికి వెంట్రుకలు సులువుగా విరిగిపోతాయి. జుట్టు పెరగడానికి కొన్ని రకాల ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిని ఎంపిక చేసుకుని రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. ఉడకబెట్టిన గుడ్డును ప్రతిరోజూ తింటే ఎంతో మంచిది. ఉసిరి కాయలను రోజుకు ఒకటి తింటూ ఉండాలి. ఉసిరి జ్యూస్ తాగినా మంచిదే. మజ్జిగ తాగడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయం తింటే ఎంతో మంచిది.