Car Care in Monsoon | వర్షంలో కార్ తడవకుండా కవర్ ఉపయోగించటం మంచిదేనా?
14 July 2022, 16:54 IST
- వర్షాకాలంలో మీ వాహనాలకు సరైన నిర్వహణ అనేది చాలా ముఖ్యం. ఈ సీజన్ లో మీ కార్ కోసం ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇక్కడ కొన్ని టీప్స్ ఉన్నాయి. ఇవి మీకు ఎప్పటికైనా ఉపయోగపడవచ్చు.
Car care in monsoon
మారుతున్న కాలాలకు తగినట్లుగా మన కోసం, మన ఆరోగ్యం కోసం ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటామో అదేవిధంగా మనం ఉపయోగించే వాహనాలకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అవి ఎక్కువకాలం పాటు సర్వీస్ ఇస్తాయి. అలాగే మధ్యలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మన ప్రయాణం సాఫీగా సాగుతుంది.
ఈ మాన్‌సూన్ సీజన్‌లో మనం ఉల్లాసవంతమైన యాత్రలను, లాంగ్ డ్రైవ్‌లను కోరుకుంటాం. వర్షంలో కారు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. అదే సమయంలో ఈ వర్షాకాలంలో సరైన నిర్వహణ లేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ సీజన్‌లో ప్రయాణాలు చేసే ముందు మీ కార్ కోసం ఎలాంటి ప్రత్యేకమైన కేర్ తీసుకోవాల్సి ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.
టైర్లను తనిఖీ చేయండి
వర్షాకాలంలో నేలలు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. మీ టైర్లకు సరైన గ్రిప్ లభించదు. దీనికి తోడు మీ టైర్లు బాగా అరిగిపోయి ఉంటే ఏదైనా ఏటవాలు తలం వచ్చినప్పుడు మీ ఇంజన్ ఆఫ్ చేసినా, బ్రేకులేసినా ఎలాంటి ఫలితం ఉండదు. మీ కార్ ముందుకు సర్రున దూసుకెళ్తుంది. కాబట్టి టైర్లు మార్చాల్సి వస్తుందేమో చూసుకోండి. ఒక నాణేం ఉపయోగించి కూడా టైర్ల నాణ్యత చెక్ చేయవచ్చు. ఒక నాణెం తీసుకొని కార్ టైరుకు ఉండే గ్రిప్పింగ్ సంధుల్లో ఉంచండి. నాణెం మునిగిపోయినట్లు ఉంటే ఓకే. అలాకాకుండా నాణెం ఎక్కువ భాగం కనిపించి పట్టుకోల్పోయినట్లు ఉంటే టైర్ మార్చాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ట్రెడ్-వేర్ ఇండికేటర్ ద్వారా కూడా టైర్ నాణ్యతను తనిఖీ చేయవచ్చు.
బ్రేక్‌లను బిగించండి, లైట్లను సరిచేయండి
వర్షాకాలంలో బ్రేకులు, లైట్లు మంచి స్థితిలో ఉండటం చాలా ముఖ్యం. వేసవిలో బ్రేకులు ఈజీగా పడతాయి కానీ వర్షాకాలంలో పరిస్థితి అలా ఉండదు. కాబట్టి మీ కారు బ్రేకింగ్ సిస్టమ్‌ను నిపుణులచే సరిగ్గా తనిఖీ చేయించుకోండి. అలాగే వర్షంలో హెడ్ లైట్స్, ఫాగ్ లైట్స్, టెయిల్ లైట్స్, ఇండికేటర్ల అవసరం చాలా ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోండి. వర్షాకాలంలో పగటి సమయాల్లో కూడా లైట్స్ ఆన్ చేసుకొని వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇంజన్ ఆఫ్ చేసేటపుడు లైట్స్ కూడా ఆఫ్ చేశారని నిర్ధారించుకోండి. లేకపోతే బ్యాటరీ పూర్తిగా డ్రై అయిపోతుంది.
కవర్ తొడగాలా.. వద్దా?
చాలామంది తమ కారును ఎప్పుడూ బాడీ కవర్ తో కప్పి ఉంచుతారు. అయితే వర్షాకాలంలో వర్షంలో నిలిపి ఉంచినపుడు మాత్రం ఈ పని చేయకండి. ఎందుకంటే వర్షంలో మీ కారును కవర్ చేసినప్పుడు కారు బాడీకి కవర్ మధ్య కొంత తేమ చిక్కుకుపోతుంది. ఆ తరవాత ఎండవచ్చినపుడు నీరు ఆవిరైపోతుంది. అప్పుడు ఈ కవర్ అనేది కారు బాడీకి అంటుకునేలా చేస్తుంది. మీరు దానిని తీసివేయడానికి ప్రయత్నించినప్పుడు కారుకు ఉన్న పెయింట్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. అంతేకాదు వర్షాకాలంలో ఎక్కువకాలం పాటు కవర్ కప్పి ఉంచితే కొన్ని భాగాలలో తుప్పుపట్టవచ్చు కూడా. కాబట్టి కారును కవర్ తో కప్పేయకండి. వీలైతే వర్షం పడని చోట, ఏదైనా షెల్టర్ కింద ఉంచడం ఉత్తమం. నీరు నిలిచిపోయే అవకాశం ఉన్న చోట మీ కారును ఎప్పుడూ పార్క్ చేయవద్దు
ఇవే కాకుండా వైపర్స్ సరిచేసుకోవడం, బురద కాళ్లతో కారులోని మ్యాట్ చెడిపోకుండా పేపర్లతో కప్పివేయడం, బ్యాటరీ, వైర్స్ చెక్ చేయడం వంటివి చేయాలి.