Arthritis: చేతి వేళ్లు ఎక్కువగా విరిస్తే ఆర్థరైటిస్ వస్తుందా?
03 November 2024, 18:30 IST
- Arthritis Myth: చేతి వేళ్లను విరవడం చాలా మందికి అలవాటు ఉంటుంది. మొటికలు విరిచి శబ్దం చేస్తుంటారు. అయితే, చేతి వేళ్లను విరువడం వల్ల ఆర్థరైటిస్ వస్తుందని కొందరు నమ్ముతారు. నిజం ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
Arthritis: చేతి వేళ్లు ఎక్కువగా విరిస్తే ఆర్థరైటిస్ వస్తుందా?
వివిధ సందర్భాల్లో చాలా మంది చేతి వేళ్లు విరుస్తుంటారు. ఎప్పుడైనా అలసగా అనిపించినప్పుడు చేతి వేళ్లు విరుస్తారు. పిల్లలకు దిష్టితీసే సమయంలోనూ ఇలా చేస్తారు. కాలక్షేపం కానప్పుడు కూడా కొందరు వేళ్ల పటపటలాడిస్తుంటారు చేస్తుంటారు. వేళ్లు వేరవడాన్ని మొటికలు అని కూడా అంటారు. అయితే, వేళ్లు తరచూ విరవడం ప్రమాదమని, దీనివల్ల ఆర్థరైటిస్ (కీళ్లవాతం, కీళ్ల నొప్పులు) వస్తాయని కొందరు చెబుతుంటారు. అయితే, అందులో వాస్తవమెంతో ఇక్కడ తెలుసుకోండి.
అసలు శబ్దం ఎందుకు వస్తుంది?
చేతి వేళ్లు విరిస్తే శబ్దం ఎందుకు వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? చేతివేళ్ల కీళ్లను మనం వెనక్కి లాగినప్పుడు.. కీళ్ల మధ్యలో ఉండే గుజ్జులో పీడనం తగ్గి.. వాయువు కరిగి బడగలు ఏర్పడతాయి. మనం చేతివేళ్లు విరిచేందుకు ఒత్తిడి పెట్టినప్పుడు బుడగలు పగిలి శబ్దం వస్తుంది. సైన్స్‌లో దీన్ని కేవియేషన్ అని అంటారు. కీళ్ల మధ్య ఉండే వాయువులు తిరిగి కరగడానికి మోస్తరుగా అరగంట సమయం పడుతుంది. అందుకే వెంటవెంటనే వేళ్లు విరచలేరు. సుమారు అరగంట అయ్యాకే సాధ్యమవుతుంది.
ఆర్థరైటిస్ వస్తుందా?
చేతి వేళ్లు విరవడం వల్ల ఆర్థరైటిస్ వస్తుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. ఇప్పటికీ ఎవరైనా చేతి వేళ్లు విరుస్తుంటే కొందరు ఈ మాటే చెబుతారు. కీళ్ల నొప్పులు వస్తాయని అంటుంటారు. అయితే, అది వాస్తవం కాదు. ఆర్థరైటిస్‍కు, చేతి వేళ్లు విరవడానికి ఎలాంటి సంబంధం ఉండదు. మొటికలు విరువడం వల్ల కీళ్ల నొప్పులు రావు. ఇవి ఇప్పటికే కొన్ని అధ్యయానాలు తేల్చిచెప్పాయి.
చేతి వేళ్లను విరవడం వల్ల ఆర్థరైటిస్ వస్తుందని అనుకుంటే అది పూర్తిగా అవాస్తవం. ఆ రెండింటికీ ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయాన్ని గతంలోనే ఓ అధ్యయనం తేల్చింది. 215 మందిపై చేసిన ఓ స్టడీ రిపోర్ట్ 2011లో మెడికల్ న్యూస్ టుడేలో పబ్లిష్ అయింది. ఇందులో కొందరు వేళ్లు విరిచారు.. మరికొందరు వేళ్లు విరవకుండా ఉన్నారు. అయితే, ఆర్థరైటిస్‍కు వేళ్లు విరిచేందుకు సంబంధం లేదని ఈ అధ్యయనంలో తేలింది. వేళ్లు విరవడం వల్ల ఆర్థరైటిస్ రాదని డోనాల్డ్ ఆన్జర్ అనే వైద్యుడు కూడా గతంలోనే తేల్చారు. చాలా అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని తేల్చాయి.
అయితే, మరీ పదేపదే అతిగా విరిస్తే ఒత్తిడి వల్ల చేతి వేళ్లకు నొప్పిగా అనిపించవచ్చు. అందుకే అతిగా చేతి వేళ్లను నొక్కొద్దు. దీనివల్ల నొప్పితో పాటు చేతి గ్రిప్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఆర్థరైటిస్‍కు మాత్రం చేతిని విరవడం కారణం కాదు.
టాపిక్