Immunity Booster Tea । ఈ టీ తాగితే.. మీ శరీరంలో పెరుగుతుంది ఇమ్యూనిటీ!
28 June 2023, 17:51 IST
- Immunity Booster Tea Recipes: ఈ సీజన్ లో మీకు ఇమ్యూనిటీ చాలా అవసరం. ఆరోగ్యకరమైన టీలు మీ శరీరంలో యాంటీఆక్సిడెంట్ కౌంట్ ను పెంచుతాయి. అలాంటి కొన్ని టీ రెసిపీలు ఇక్కడ చూడండి.
Immunity Booster Tea Recipes
Immunity Booster Tea Recipes: మీరు ఈ చల్లని వర్షాకాలపు సాయంత్రాన ఒక కప్పు వేడివేడి చాయ్‌తో రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ చాయ్‌ని రోగనిరోధక శక్తిని పెంచే పానీయంగా ఎందుకు మార్చకూడదు? ఈ సీజన్ లో మీకు ఇమ్యూనిటీ చాలా అవసరం. మీరు తాగే ఈ ఆరోగ్యకరమైన టీలు మీ శరీరంలో యాంటీఆక్సిడెంట్ కౌంట్ ను పెంచుతాయి, వ్యాధులను దూరం చేస్తాయి. అంతేకాకుండా మీ జీర్ణక్రియ మెరుగుపడేందుకు, బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అదనంగా, జలుబు, ఫ్లూల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అలాంటి కొన్ని టీ రెసిపీలు ఇక్కడ చూడండి.
అల్లం చాయ్
అల్లం శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, బ్లడ్ షుగర్‌ని తగ్గిస్తాయి, ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతాయి. అల్లం చాయ్‌ను తులసి ఆకులతో కలిపి చేస్తే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. తులసి మన శరీరాన్ని వివిధ అంటువ్యాధులు, వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
అల్లం- తులసి చాయ్ తయారు చేసే విధానం:
- అల్లంను ముక్కలుగా చేయండి, తులసి ఆకులను శుభ్రంగా కడగి సిద్ధంగా పెట్టుకోండి.
- ఇప్పుడు బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి. అందులో తురిమిన అల్లం, తులసి ఆకులను వేయండి.
- ఆపైన టీ ఆకులు వేసి, నీరు మరిగించండి. మీరు కావాలనుకుంటే ఇందులోనే పాలు, చక్కెరను కూడా కలుపుకోవచ్చు.
- బాగా మరిగించిన తర్వాత అల్లం- తులసి చాయ్ రెడీ అవుతుంది, వడకట్టి సర్వ్ చేయండి.
బెల్లం చాయ్
బెల్లంలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది, శక్తిని పెంచుతుంది. బెల్లం టీ జీర్ణక్రియకు కూడా అద్భుతాలు చేయగలదు. ఈ రెసిపీని సిద్ధం చేయడానికి, ముందుగా ఏలకులు, నల్ల మిరియాలు, ఫెన్నెల్ గింజలను చూర్ణం చేయండి.
బెల్లం చాయ్ ఎలా చేయాలి?
- ఒక పాన్ తీసుకుని అందులో పాలు మరిగించాలి.
- ఆపైన అందులో కొద్దిగా తురిమిన అల్లం, టీ ఆకులు, సిద్ధం చేసిన మసాలా మిశ్రమాన్ని వేసి కలపండి.
- టీ మరిగిన తర్వాత ఒక కప్పులోకి వడకట్టి తీసుకోండి.
- అందులో ఒక టీస్పూన్ బెల్లం పొడి లేదా చిన్న బెల్లం ముక్క వేసి, బాగా కలపండి బెల్లం టీ రెడీ.
మసాలా టీ
మసాలా టీలో వాడే పదార్థాలలో పొటాషియం, విటమిన్ బి, కెరోటిన్, విటమిన్ సి, మెగ్నీషియం వంటి మూలకాలు లభిస్తాయి. మసాలా టీ తాగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి , ఒళ్లు నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది ఇన్ఫెక్షన్లు, వాపులను నివారించటానికి, మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
మసాలా టీ రెసిపీ:
- ముందుగా ఆకుపచ్చ ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, సోంపు గింజలను చూర్ణం చేసి పెట్టుకోండి.
- కొద్దిగా అల్లంను కూడా విడిగా చూర్ణం చేసి ఉంచండి.
- ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో నీళ్ళు మరిగించాలి. ఆపైన టీ ఆకులు జోడించండి.
- తర్వాత తరిగిన సుగంధ ద్రవ్యాలు, అల్లం వేయండి, మరిగించండి.
ఆపైన పాలు, చక్కెర కలిపి మరికొద్దిసేపు ఉడికిస్తే మసాలా టీ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకోండి.