Smart kids: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే భవిష్యత్తులో వారు మేధావులయ్యే అవకాశం
03 January 2024, 14:30 IST
- Smart kids: పిల్లలు కొందరు అసాధారణమైన ప్రతిభను చూపిస్తారు. ఆ ప్రతిభ వారు పెద్దయ్యాక మేధావులయ్యే అవకాశం ఉందని చెప్పే సంకేతంగా భావించాలి.
పిల్లల్లో ఉండాల్సిన లక్షణాలు
Smart kids: పిల్లలందరూ ఒకేలా ఉండరు. ప్రతి పిల్లవాడు ప్రత్యేకంగానే ఉంటాడు. ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాడు. ప్రతి పిల్లవాడికి ఎదుగుదల సామర్థ్యం వేరువేరుగా ఉంటుంది. కొంతమంది పిల్లల్లో అసాధారణ సామర్ధ్యాలు ఉంటాయి. ఇలాంటి సామర్థ్యాలు ఉన్న పిల్లలు పెద్దయ్యాక మేధావులయ్యే అవకాశాలు ఉంటాయి. పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు వారు భవిష్యత్తులో మేధావులుగా మారే అవకాశం ఉందని సూచిస్తాయి. అలాంటి లక్షణాలు మీ పిల్లల్లో ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుకోండి.
1. చంటి పిల్లలు మాటలు నేర్చుకోవడం, నడవడం, ఏదైనా చెబితే అర్థం చేసుకోవడం లాంటివి చాలా వేగంగా చేస్తున్నారంటే వారిలో అభిజ్ఞా సామర్థ్యం ఎక్కువ ఉందని అర్థం. తోటి వారితో పోలిస్తే భవిష్యత్తులో మేధావులు అయ్యే పిల్లలు చిన్నప్పటినుంచి నడక, మాటలు త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు చెప్పే విషయాలను త్వరగా గ్రహిస్తారు. వారిలో ఈ సామర్థ్యం చిన్న వయసు నుంచి కనిపిస్తుంది.
2. ప్రతిభావంతులైన పిల్లల్లో అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. మేధావులకు ఇది సాధారణంగా ఉండే లక్షణమే. వారు ఎక్కువ విషయాలను గుర్తు పెట్టుకోవడం, ఒక్కసారి ఏదైనా చెప్పగానే మళ్లీ తిరిగి చెప్పేందుకు ప్రయత్నించడం, ఏ సమాచారాన్ని అయినా వివరంగా గుర్తు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
3. ప్రతిభావంతులైన పిల్లలు తరచూ ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఎందుకు? ఎలా? అని పదేపదే ప్రశ్నిస్తారు. లోతుగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. వారి ప్రశ్నలను కొట్టి పడేయకండి, వారి ఉత్సుకతను తేలిగ్గా తీసుకోకండి. వారు అడిగినంతవరకు సమాధానాలు చెప్పేందుకు ప్రయత్నించండి. సాధారణ పిల్లలతో పోలిస్తే మేధావులు అయ్యే అవకాశం ఉన్న పిల్లలు ఏ విషయాన్నయినా త్వరగా నేర్చుకుంటారు. చదువులో కూడా ముందుంటారు. వేగవంతమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. చదువులో అసాధారణ ఆసక్తిని కలిగి ఉంటారు. వారికి ఏదైనా ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా సైన్స్, గణితశాస్త్రంలో వారు చురుగ్గా ఉంటారు.
4. మేధావులయ్యే అవకాశం ఉన్న పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వారికి స్పష్టమైన ఊహా శక్తి ఉంటుంది. ఆలోచన పరిధి ఎక్కువగా ఉంటుంది. చిత్రలేఖనం, సంగీతం, రచన వంటి కళాత్మక పనుల్లో రాణించే అవకాశం ఎక్కువే.
మీ పిల్లవాడిలో పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వారికి చదువు, ఇతర కళల విషయంలో వారిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించండి. వారు కచ్చితంగా మేధావులుగా మారుతారు.
టాపిక్