తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Study Habits For Kids : మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదా? అయితే వీటిని ఫాలో అవ్వండి..

Study Habits for Kids : మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదా? అయితే వీటిని ఫాలో అవ్వండి..

31 January 2023, 8:09 IST

    • Study Habits for Kids : మా పిల్లలు సరిగా చదవట్లేదండీ.. అసలు చదువు అనేసరికే ఇంట్రెస్ట్ చూపించట్లేదని చాలామంది తల్లిదండ్రు ఫీల్ అవుతారు. అయితే వారు చదువు పట్ల ఆసక్తి కలిగి లేకపోయినా.. మీరు వారికి చదువుపై శ్రద్ధ పెరిగేలా కొన్ని చిట్కాలు పాటించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
ఈ టిప్స్ ఫాలో అయితే.. పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందట
ఈ టిప్స్ ఫాలో అయితే.. పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందట

ఈ టిప్స్ ఫాలో అయితే.. పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందట

Study Habits for Kids : పిల్లలను హ్యాండిల్ చేయడం అంత సులువైన పని కాదు. కొన్నిసార్లు మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే తల్లిదండ్రులుగా వారి పట్ల శ్రద్ధ తీసుకోవడానికి మీకు చాలా ఓపిక అవసరం ఉంటుంది. ముఖ్యంగా వారిని చదువుకునేలా చేయడం లేదా ఏదైనా నేర్చుకునేటప్పుడు దానిపై శ్రద్ధ చూపించేలా చేయాలి అంటే సాహసం అనే చెప్పాలి.

ఎందుకంటే పిల్లలు సాధారణంగా చంచల మనస్సులను కలిగి ఉంటారు. దానివల్ల దేనిపైనా ఎక్కువ శ్రద్ధ చూపించలేకపోవచ్చు. కొన్నిసార్లు ఆటలపై ఉండేంత ఇంట్రెస్ట్.. చదువుపై చూపించరు. మీ పిల్లలు కూడా చదువు పట్ల ఆసక్తి చూపించకపోతే.. కొన్ని చిట్కాలు పాటించండి. దీనివల్ల వారు చదవడంలో లేదా ఏదైనా కొత్తగా నేర్చుకోవడంలో మరింత ఆసక్తిని చూపిస్తారు. ఇంతకీ వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించే మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వారితో కూర్చుని ఫన్ చేయండి

స్టడీ టైమ్ అనగానే.. పిల్లల పట్ల సీరియస్​గా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. వారిని తిట్టి, కొట్టి చదివించడం అనేది తెలివితక్కువ పని. అలా చదివినా.. అది వారికి ఎక్కువ కాలం గుర్తుండకపోవచ్చు. పిల్లలు చదువుతున్నప్పుడు లేదా కొత్త విషయాలను నేర్చుకునేటప్పుడు మీరు కోపం తెచ్చుకుని.. వారిని తిట్టినట్లయితే.. వారు మీపట్ల భయాన్ని పెంచుకుంటారు. ఏడుస్తారు. దాని నుంచి తప్పించుకోవడానికి తమవంతు ప్రయత్నం చేస్తారు. చివరికి చదువుపై ఆసక్తిని కోల్పోతారు.

దీనికి బదులుగా.. మీరు వారితో కూర్చుని చదువుకోవడానికి వారిని ప్రేరేపించండి. కోపాన్ని ప్రదర్శించకుండా.. సెషన్‌ను సరదాగా, ఆకర్షణీయంగా చేయండి. కొన్ని ఫన్ యాక్టివిటీలతో వారికి చదువు నేర్పించండి. దీనివల్ల తెలియకుండానే వారికి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది.

రివార్డ్ ఇవ్వడానికి ప్రయత్నించండి

పిల్లలను బాగా చదివించాలి అనుకుంటే.. వారిని ప్రోత్సాహించడం నేర్చుకోవాలి. పిల్లలకు ఇష్టమైనవాటితో సమయం గడపడం చాలా సరదాగా ఉంటుంది. అలాంటప్పుడు.. నువ్వు ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తే నీకు కార్టూన్ చూసే సమయం ఎక్కువ ఇస్తాము. లేదంటే చాక్లెట్ ఇస్తాము వంటివి చేయొచ్చు. దీనివల్ల వారు మరింత సంతోషంగా చదువుతారు.

వారి చిన్న చిన్న విజయాలను గుర్తించి.. అభినందించండి. ప్రోగ్రసివ్​గా ఏది చేసినా.. వారికి చిన్న చిన్న గిఫ్ట్​లు ఇవ్వండి. ఇది వారిని చదువు పట్ల మరింత ఆసక్తి పెరిగేలా చేస్తుంది. వారికి ఏమి కావాలో తెలుసుకుని.. వారిని ఆవైపు ప్రోత్సాహించండి.

ఏమి డౌట్స్ ఉన్నా అడగమని చెప్పండి..

స్టడీ సెషన్‌ల సమయంలో.. మీ పిల్లలు ఆసక్తి ఉన్నా లేకున్నా.. వీలైనన్నీ ప్రశ్నలు అడగమని ప్రోత్సాహించండి. వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి కానీ.. మరో ప్రశ్నను రేకెత్తించే సమాధానాలు ఇస్తే.. వారికి మరింత ఆసక్తి పెరుగుతుంది.

అలాగే వారి స్టడీ గురించి.. వారినే అడిగి తెలుసుకోండి. ఈరోజు స్కూల్​లో ఏమి చెప్పారో వారిని అడగండి. ఇది పాఠశాలలో వారి చురుకుదనాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మీ పిల్లల అభిప్రాయాన్ని వినండి. వారి విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నించండి.

చదవమని ప్రోత్సహించండి

పఠనాన్ని ఇష్టపడే పిల్లలు తరచుగా చదువు పట్ల ఇష్టాన్ని పెంచుకుంటారు. కాబట్టి ప్రతిరోజూ మరింత చదవమని వారిని ప్రోత్సహించండి. కేవలం పాఠ్యాంశ పుస్తకాలే కాదు.. స్టోరీలు కూడా చదవమని చెప్పండి. దీనివల్ల వారికి చదవడం అలవాటుగా మారుతుంది.

పాఠ్యపుస్తకాలలోని అధ్యాయాలు లేదా పిల్లల పుస్తకాలలోని కథలు వారి ఊహలను మేల్కొల్పడానికి, చదవడం, నేర్చుకోవడంపై ఆసక్తిని కలిగిస్తాయి. అంతేకాకుండా మీరు కూడా చదివి.. వారికి దానిపై ఇంట్రెస్ట్ వచ్చేలా చెప్పవచ్చు.

ఆసక్తిని పెంచే వాతావరణం క్రియేట్ చేయండి..

పిల్లల శ్రద్ధ చాలా తక్కువగా ఉంటుంది. వారు తరచుగా పరధ్యానంలో ఉంటారు. కాబట్టి వారికి సరైన అధ్యయన వాతావరణం చాలా ముఖ్యం. ఇది ఎటువంటి అవాంఛనీయ భంగం లేకుండా మరింత దృష్టి కేంద్రీకరించడానికి, ఏకాగ్రతను పెంపొందించడంలో సహాయపడతుంది.

స్టడీ రూమ్‌లో మరొకరు గేమ్స్ ఆడుకోవడం, టీవీలు చూడడం చేస్తే.. వారి దృష్టి ఈజీగా మళ్లుతుంది. అలాంటివి ఇబ్బందులు వారికి కలగకుండా చూసుకోండి.

పిల్లలకు చదువు పట్ల ఆసక్తి లేకుంటే వారికి చదువును బలవంతంగా రుద్దకండి. వారికి దేనిపట్ల ఆసక్తి ఉందో తెలుసుకుని ఆ వైపు ప్రోత్సాహించండి. కనీసం డిగ్రీ అయినా ఉండాలని చెప్పండి. ఇలా చేయడం వల్ల వారు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు. చదువు కూడా ముందుకు సాగుతుంది.