Friday Motivation: అసాధ్యం అనుకుంటే ఏదీ సాధించలేరు, ప్రయత్నించి చూడండి.. ఇతనిలా కొండలు కూడా తవ్వేయగలరు
01 March 2024, 5:00 IST
- Friday Motivation: సమస్య పెద్దగా ఉంటే దాన్ని చూసి భయపడే వారే ఎక్కువమంది. ప్రయత్నమే చేయకుండా ఆగిపోతే విజయం సొంతం అవ్వదు. ప్రయత్నం మొదలుపెడితేనే విజయానికి చేరువ అవుతారు.
కొండను తవ్వి రోడ్డును వేసిన ఒకే ఒక వ్యక్తి దశరథ్ మాంజీ
Friday Motivation: దశరథ్ మాంజీ... ఇతను ఒక సామాన్యుడు. బీహార్ రాష్ట్రంలోని గెహ్లార్ అనే గ్రామంలో నివసించేవాడు. చిన్న వయసులోనే బొగ్గు గనుల్లో పనికి చేరాడు. తన ఊరికే చెందిన ఫల్గుని దేవిని పెళ్లి చేసుకున్నాడు. గెహ్లార్ గ్రామం బీహార్ రాజధాని పాట్నాకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు పాట్నా చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందాయి, కానీ 50 ఏళ్ల క్రితం అదంతా ఓ అడవిలా ఉండేది. గ్రామం నుంచి బయటి ప్రపంచానికి రావాలంటే ఒక పెద్ద కొండ అడ్డంగా ఉండేది.
గ్రామస్తులకు ఏది అవసరమైనా ఆ కొండ చుట్టూ 32 కిలోమీటర్లు నడుచుకొని వెళ్లి కొనుక్కుని తెచ్చుకునేవారు. 1960లో కొండకు ఒకవైపు మాంజీ పనిచేసేవాడు. కొండకి అవతల వైపు మాంజీ ఇల్లు ఉండేది. ఆయన భార్య ఫల్గుణి దేవి ప్రతిరోజూ భర్తకు భోజనం తీసుకొచ్చేది. ఆ కొండను ఎక్కి దిగి భర్తకు అన్నం తినిపించేది. అలా కొండ ఎక్కి రావడానికి మూడు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. అదే కొండ చుట్టూ తిరిగితే 32 కిలోమీటర్లు... అందుకని ఆమె కొండెక్కి వచ్చేది. ఓ రోజు కొండమీద నుంచి పడి ఆమెకు గాయాలయ్యాయి. అప్పుడే మాంజీ ఆ కొండను తొలిచి రోడ్డు వేయాలనుకున్నాడు. అదే సమయంలో అతని భార్య ఫల్గుణి దేవి అనారోగ్యం పాలయ్యింది. ఈ కొండ కారణంగా సకాలంలో వైద్యుని వద్దకు తీసుకెళ్లలేక పోయారు. దీంతో ఆమె చనిపోయింది.
భార్య మరణించడం దశరథ్ మాంజీలో పట్టుదల పెంచింది. ఎలాగైనా ఆ కొండను చీల్చి దగ్గర దారి గ్రామానికి కల్పించాలని అనుకున్నాడు. అప్పటినుంచి ఒక గునపం, ఉలి, సుత్తి పట్టుకొని కొండని పిండి చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు రెండు రోజులు కాదు దాదాపు 22 ఏళ్ల పాటు ఇదే పని చేశాడు. కొండను చీల్చుకుంటూ దారి ఏర్పాటు చేశాడు. దీనివల్ల ఆ గ్రామస్తులు కేవలం 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు బయట ప్రపంచంలోకి వచ్చేయొచ్చు.
ఇలా కొండను చీల్చి రోడ్డును వేశాడు కాబట్టే దశరథ్ మాంజీని ‘మౌంటెన్ మ్యాన్’, ‘పహాడీ ఆద్మీ’ అని పిలుస్తారు. ఇలా మాంజీ ఒక్కడే కష్టపడుతున్నా తోడుగా ఏ ఒక్కరోజూ... ఒక్కరు కూడా రాలేదు. అయినా అతను పట్టు వదలకుండా తన పని తాను చేస్తూనే ఉన్నాడు. చివరకు ఎంతోమంది ప్రజలకు సకాలంలో విద్య, వైద్యం అందేలా చేశాడు. ఎంతోమంది చదువుకొని గొప్పవారయ్యారు. ఇప్పటికీ ఆ గ్రామంలో ఇతడిని తలుచుకుంటూ ఉంటారు. కొండను తొలచడం అంటే అది సామాన్యమైన పని కాదు. మొదట్లో ఇతడిని పిచ్చోడని ప్రచారం చేశారు. అయినా వాటిని మాంజీ పట్టించుకోలేదు. చివరికి అనుకున్నది సాధించాడు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు మాంజీ. ఎవరైనా సరే కష్టం అనుకొని పని మొదలు పెట్టకపోతే విజయం ఎలా చేరువవుతుంది? విజయం దక్కుతుందో లేదో తర్వాత ఆలోచించండి... మొదట ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. అసాధ్యం అనుకుని ఇంట్లోనే కూర్చుంటే మీరు జీవితంలో ఏదీ సాధించలేరు.