తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Attack: మీ ముఖం, కళ్ళ చుట్టూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే గుండెపోటు వస్తుందేమోనని అనుమానించాల్సిందే

Heart Attack: మీ ముఖం, కళ్ళ చుట్టూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే గుండెపోటు వస్తుందేమోనని అనుమానించాల్సిందే

Haritha Chappa HT Telugu

05 November 2024, 9:30 IST

google News
    • Heart Attack: గుండెపోటు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వచ్చి పడుతోంది. ఎప్పుడు ఎవరికీ ఈ సమస్య వస్తుందో చెప్పడం కష్టం. అయితే కొన్ని రకాల లక్షణాలు ముందే కనిపిస్తే గుండెపోటును అంచనా వేయొచ్చని అంటున్నారు వైద్యులు.
ముఖంలో కనిపించే గుండె పోటు లక్షణాలు
ముఖంలో కనిపించే గుండె పోటు లక్షణాలు (Pixabay)

ముఖంలో కనిపించే గుండె పోటు లక్షణాలు

గుండెపోటు వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ప్రపంచంలో పెరిగిపోతోంది. ఎప్పుడు ఈ సమస్య వచ్చి పడుతుందో చెప్పడం కూడా కష్టమే. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తున్న అనారోగ్యాల్లో గుండెపోటు కూడా ఒకటి. మారిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తినడం వంటివి గుండెపోటు ఆకస్మికంగా వచ్చేలా చేస్తుంది. సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని అర్థం చేసుకుంటే ప్రాణాంతకంగా మారకుండా ముందే జాగ్రత్త పడవచ్చు. అలాంటి లక్షణాల్లో కొన్ని ముఖములో, కళ్ల చుట్టూ కూడా కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటో తెలుసుకోండి.

కళ్లలో కనిపించే లక్షణాలు

మీ కళ్ళ చుట్టూ చర్మం పసుపు రంగులో మారినట్టు అనిపిస్తే లేదా కంటి చుట్టూ వలయంలా ఏర్పడినట్టు అనిపించినా వెంటనే జాగ్రత్త పడండి. రక్తంలో లిపిడ్ స్థాయిలు అసాధారణంగా పెరిగిపోతే ఇలా కళ్ళ చుట్టూ పసుపు వలయం ఏర్పడుతుంది. ధమనుల గోడలపై కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోయిన కూడా ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే రక్తంలో లేదా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుందో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. కాబట్టి మీ కళ్ళ చుట్టూ వలయంలా ఏర్పడినా, చర్మం రంగు మారినా వెంటనే వైద్యులను సంప్రదించవలసిన అవసరం ఉంది.

అలాగే కంటిలోని నల్ల గుడ్డు చుట్టూ నీలం రంగు లేదా బూడిద రంగు వంటి రంగుల్లో కార్నియా కనిపించినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆ సమయంలో ముఖంలో కూడా తీవ్రమైన నీరసంగా ఉంటుంది. చర్మం సాధారణంగా ఉండదు. ఆరోగ్యం బాగోలేనట్టుగా తీవ్ర అలసటగా ఉన్నట్టు ముఖంలోనే తెలుస్తుంది. ఈ రెండు లక్షణాలు కలిపి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది.

గుండె నొప్పి లక్షణాలు

సాధారణంగా కూడా గుండె నొప్పిలో వచ్చే లక్షణాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఛాతీ మధ్యలో తీవ్రమైన పోటు వస్తున్న లేదా ఛాతీకి ఎడమ వైపున అసౌకర్యంగా అనిపిస్తున్నా వెంటనే జాగ్రత్తపడాలి. ఛాతీకి ఎడమ వైపున ఒత్తిడిగా అనిపించడం, గుండెను పిండేస్తున్నట్టు నొప్పి రావడం అనేది చాలా ప్రమాదకరం. ఈ నొప్పి చాలా చిన్నగా మొదలై ఎక్కువగా మారుతుంది. మీకు ఇలా అనిపిస్తే వెంటనే దగ్గరలోనే ఆసుపత్రికి వెళ్ళండి.

గుండెపోటు వచ్చేముందు పొట్టలో కూడా మంటగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాగే దవడ, మెడ, చేతులు, వీపు భాగంలో నొప్పిగా లాగేస్తున్నట్టుగా ఉంటాయి. ఈ లక్షణాలు కూడా గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలే. ఈ లక్షణాలతో పాటు శ్వాస ఆడనట్టు అనిపించడం, కాంతిని చూడాలంటే ఇబ్బంది పడడం వంటివి కలుగుతాయి. అలాగే ఏమీ తినకపోయినా కూడా వికారంగా అనిపించడం, వాంతులు వచ్చినట్టు జరుగుతాయి. ఇవన్నీ గుండెపోటు వచ్చే ముందు కనిపించే సర్వసాధారణ లక్షణాలు. శరీరమంతా చెమట పట్టడం కూడా గుండెపోటు లక్షణమే. పైన చెప్పిన లక్షణాలతో పాటు శరీరం విపరీతంగా చెమట పడుతున్నా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

తలనొప్పి కూడా డేంజరే

కొన్ని అధ్యయనాల ప్రకారం తీవ్రమైన తలనొప్పి కూడా గుండెపోటును సూచిస్తుంది. తలనొప్పితో పాటు మాటల్లో స్పష్టత లేకపోవడం, ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియక పోవడం, గందరగోళంగా ఉండడం, చేయి, కాలు, ముఖంపై తిమ్మిరిగా అనిపించడం వంటివి కూడా గుండెపోటునే సూచిస్తాయి. నడుస్తున్నప్పుడు ఇబ్బంది పడడం, మైకం కమ్మినట్టు అనిపించడం, దృష్టి మసకబారడం, కంటి చూపు శక్తివంతంగా లేకపోవడం కూడా గుండెకు రక్తప్రసరణ సరిగా జరగడం లేదని చెబుతాయి. అంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వివరించేవే. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెకు రక్తం సరిగా అందక నొప్పి తీవ్రంగా మారిపోతుంది. అలా వదిలేస్తే సమస్య ప్రాణాంతకంగా మారి ఏమైనా జరగొచ్చు.

కార్డియాక్ అరెస్టు

గుండెపోటు లాంటిదే కార్డియాక్ అరెస్టు కూడా. ఇది క్షణాల్లో వస్తుంది. కార్డియాక్ అరెస్టు విషయంలో మనుషుల్ని కాపాడడం కాస్త కష్టమే. గుండె కొట్టుకునే విద్యుత్ వ్యవస్థలో ఇబ్బంది కలిగితే కార్డియాక్ అరెస్టు వస్తుంది. ఇది వచ్చిన కొన్ని క్షణాల్లోనే లేదా కొన్ని నిమిషాల్లోనే వైద్యం అందాలి. సిపిఆర్ చేసిన కూడా ప్రాణాలు నిలబడే అవకాశం ఉంది. లేకుంటే ప్రాణాలను కాపాడడం కష్టంగా మారుతుంది. అందుకే ప్రతి ఒక్కరు సిపిఆర్ చేయడం నేర్చుకోవాలి. తమ కుటుంబ సభ్యులకు లేదా రోడ్డుమీద పోయే వారికి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే సిపిఆర్ చేయాల్సిన అవసరం ఉంది. ఛాతీ మధ్యలో రెండు చేతులను పెట్టి గట్టిగా అదమడమే సిపిఆర్. అలా ఎక్కువసార్లు నిమిషంలో నిమిషానికి 20 నుంచి 30 సార్లు ఛాతీని అదుముతూ ఉంటే గుండెకు మళ్లీ రక్తప్రసరణ జరగడం మొదలై ప్రాణాలను కాపాడినవారవుతారు.

తదుపరి వ్యాసం