Under staircase space: మెట్ల కింద చోటును వాడుకోవడానికి అద్భుతమైన ఐదు ఐడియాలు..
15 October 2023, 10:15 IST
Under staircase space: ఇంట్లో, బయటా మెట్ల కింది ఉండే స్థలం అలాగే వదిలేస్తాం. దాన్ని కొన్ని ఐడియాలతో ఉపయోగకరంగా మార్చేయొచ్చు. అదెలాగో చూసేయండి.
మెట్లకింద స్థలం డెకార్
సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ మెట్ల కింద చోటు అలాగే ఉండిపోతూ ఉంటుంది. ఇంటి బయట మెట్లయితే అలా ఉంచేసుకున్నా ఏం ఫర్వాలేదు. కానీ ఇంట్లోపల మెట్లయితే ఆ చోటును మంచిగా వాడుకోవచ్చని ఇంటీరియర్ డిజైనర్లు సలహా ఇస్తున్నారు. సాధారణంగా ఈ చోట్లో స్టోరేజ్‌ని కొంత మంది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ చోటును మరింత సౌకర్యవంతంగా, మరింత అందాన్నిచ్చేలా చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన కొన్ని ఐడియాలు ఇక్కడున్నాయి. చూసేయండి.
1. బుక్ షెల్ప్:
మెట్ల కింద అందమైన డిజైన్‌తో బుక్ షెల్ఫులని ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడే చిన్న సీటింగ్ ఇచ్చి, చదువుకునేందుకు వీలుగా చేసుకోవచ్చు. అది మీ హాల్ అందాన్ని మరింత పెంచుతుంది. ఇంటీరియర్ డిజైనింగ్‌కి సరిపోయేలా ఆ షెల్ప్ డిజైన్ ఉండేలా జాగ్రత్త పడండి.
2. పిల్లల ప్లే ఏరియా:
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వారు మెట్ల కింద చోటును ప్లే ఏరియాగా మార్చుకోవచ్చు. పిల్లలు చిన్న చిన్న కోజీ ఏరియాల్లో ఆడుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకనే ఇలాంటి చోట్ల చిన్న టెంట్లు, బాల్ హౌసుల్లాంటివి ఏర్పాటు చేసి వారు ఆడుకోవడానికి తగినట్లుగా అమర్చండి. వారి ఆనందానికి అవధులు ఉండవు.
3. ఆఫీస్ టేబుల్:
ఇప్పుడు పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు, పెద్దలకు వర్క్ ఫ్రం హోంలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రశాంతంగా కూర్చుని పని చేసుకోవడానికి స్పేస్ కావాలనుకునే వారు మెట్ల కింద వాల్ మౌంటెడ్ డెస్క్, సౌకర్యంగా ఉండే ఆఫీస్ ఛైర్లను ఏర్పాటు చేసుకోండి. ఇంటీరియర్ డిజైనింగ్‌లో భాగంగా అక్కడ వస్తువుల రంగుల్ని ఎంచుకోండి. ఎంతో బాగుంటుంది.
4. పెట్ ఏరియా:
ఇంట్లో కుక్కలు, పిల్లుల్లాంటి వాటని పెంచుకునే వారు ఉంటారు. అలాంటి వారికి ఈ మెట్ల కింద చోటు పెట్ ఏరియాగా బాగా పనికి వస్తుంది. మరీ హాల్లో ఎదురుగా ఈ చోటు ఉండకుండా కాస్త పక్కగా ఉన్నట్లయితే దీన్ని మీరు సంతోషంగా వీటికి కేటాయించేయొచ్చు. వీటి బెడ్లు, బౌల్స్ లాంటి వాటిని ఇక్కడ చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు.
5. గ్రీన్ కార్నర్:
మెట్ల కింద ప్రాంతంలో మొక్కలను పెట్టుకోవడానికి అనువుగా అక్కడ చెక్కతోగాని, ఇనుముతోగాని ర్యాకుల్ని ఏర్పాటు చేయించుకోండి. వీటి కోసం చాలా డిజైన్లు అందుబాటులో ఉంటాయి. తర్వాత అందులో కొన్ని వేలాడే మొక్కలను, కొన్ని మామూలు మొక్కలను ఎంచుకుని పెట్టుకోండి. మంచి ఇండోర్ మొక్కలను మాత్రమే ఇక్కడ ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. ఇంటి మొత్తానికి ఈ చోటే హైలెట్ అయిపోతుంది. ఇక్కడ గడిపిన ప్రతిసారీ మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది.