Appam Pan: గుంతపొంగణాల పెనం ఉందా? దాంతో ఎన్ని రకాల వంటలు వండొచ్చో చూడండి
14 August 2024, 6:00 IST
Appam Pan: ఇంట్లో అప్పం లేదా గుంత పొంగణాలు చేసుకునే ప్యాన్ ఉందా? అయితే దాంతో రకరకాల వంటకాలు తక్కువ నూనె వాడి ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.
గుంతపొంగణాల పెనంతో వంటలు
దాదాపు అందరి ఇళ్లలో గుంత పొంగణాలు చేసుకునే పెనం తప్పకుండా ఉంటుంది. అయితే దాన్ని కేవలం పనియారం లేదా గుంత పొంగణాల కోసమే వాడి పక్కన పెట్టేస్తాం. కానీ దాన్ని చక్కగా వాడితే చాలా మంచి వంటకాలు చేసుకోవచ్చు. ఆ పెనాన్ని రకరకాలుగా ఎలా వాడుకోవచ్చో చూసేయండి.
1. ఎగ్ ఆమ్లెట్:
గుడ్డు సొనలో ఉల్లిపాయలు, ఇంకేవైనా కూరగాయల ముక్కలు, మసాలాలు, ఉప్పు, కారం అన్నీ కలిపి ఆ మిశ్రమాన్ని గుంత పొంగడాల పెనంలో పోసుకోవాలి. నూనె వేసుకుని కాల్చుకుంటే కొత్త రుచితో గుడ్డు పొంగడాలు రెడీ అయిపోతాయి. ఆమ్లెట్ ఎప్పుడూ వేసేలా కాకుండా కాస్త కొత్తగా ప్రయత్నించాలంటే ఇలా చేయొచ్చు.
2. ఆలూ బోండా:
ఆలూ బోండాలు మనం నూనెలో డీప్ ఫ్రై చేసి చేస్తాం. వాటి రుచి నచ్చినా కూడా నూనె ఎక్కువ తినేస్తామని వాటిని ఎక్కువగా చేసుకోం. బదులుగా ఈ గుంతపొంగడాల పెనంలో చేసుకోవచ్చు. మసాలాలు కలిపి ఉండగా చేసుకున్న బంగాళదుంప ముద్దను గుండ్రంగా చేసి, ఉప్పు కారం, నీళ్లు కలిపిన శనగపిండిలో ముంచాలి. వాటిని గుంతపొంగడాల పెనంలో వేసుకోవాలి. గుంతల్లో ముందుగానే కొద్దిగా నూనె వేసి వేడెక్కాక బోండాలు వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. హెల్దీగా బోండా రెడీ అయినట్లే.
3. పొంగడాలు:
మిగిలి పోయిన దోశపిండిలో కొద్దిగా బియ్యం పిండి కలిపి, అలాగే మిగిలిపోయిన మినప వడల పిండితో కూడా గుంత పొంగడాలు చేస్తారు. ఆ పిండిలో నానబెట్టిన శనగపప్పు కలిపి, లేదా క్యారట్ తురుము, బీట్ రూట్ తరుము, ఉల్లిపాయ ముక్కలు కలిపి, కొత్తిమీర కలిపి.. ఇలా మీ ఇష్టాన్ని బట్టి వివిధ రకాలుగా పొంగడాలు చేయొచ్చు.
4. ఉన్నియప్పం:
ఇది కేరళ వంటకం. ఒక పెద్ద గిన్నెలో బియ్యం పిండి, యాలకుల పొడి, బెల్లం పానకం, సోడా, బాగా మెదిపిన అరటిపండ్ల గుజ్జు, డ్రై ఫ్రూట్స్ కలుపుకోవాలి. నీళ్లు పోసుకుంటూ జారుగా పిండి కలుపుకోవాలి. ఈ పిండిని ముందుగా నెయ్యి రాసుకున్న అప్పం పెనంలో పోసుకోవాలి. నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. అంతే తియ్యగా ఉండే ఉన్నియప్పం రెడీ అయినట్లే.
5. వడలు:
మినప్పప్పు నానబెట్టి చేసుకునే వడలు మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. అవి నూనె చాలా ఎక్కువగా పీల్చుకుంటాయి. బదులుగా ఈ పనియారం పెనంలో ఒకసారి ప్రయత్నించండి. నూనె రాసి వేడెక్కాక గుంతల్లో చాలా కొద్దిగా వడ పిండి పోయాలి. ఎక్కువ పోస్తే మధ్యలో ఉడకవు. కాబట్టి చుట్టూ నూనె కాల్చుకుంటే సరిపోతుంది. మామూలుగా డీప్ ఫ్రై చేసిన వడల్లా వీటి రుచి ఉండకపోయినా నూనె వద్దనుకుంటే మాత్రం మంచి ఆప్షన్.
6. ఎగ్ బోండా:
ఉడికించిన గుడ్డును శనగపిండిలో ముంచి చేసుకునే ఎగ్ బోండా చాలా మందికి ఇష్టమే. దాన్ని కూడా ఈ అప్పం పెనంలో చక్కగా చేసుకోవచ్చు. చాలా తక్కువ నూనెలో ఎగ్ బోండా రెడీ అయిపోతుంది. గుడ్డును శనగపిండిలో ముంచి నూనె వేసుకున్న గుంతల్లో వేయడమే. ఒకసారి ప్రయత్నించి చూడండి.
టాపిక్