Cucumber Curry Recipe : మంగళూరు స్టైల్ దోసకాయ కర్రీ.. ఆరోగ్య ప్రయోజనాలు చాలా
10 June 2024, 11:00 IST
- Cucumber Curry Recipe In Telugu : మంగళూరు స్టైల్ దోసకాయ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? అక్కడ దాదాపు ప్రతీ పెళ్లిలో ఈ వంటకం పెడతారు. మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీ తయారు చేయండి.
దోసకాయ రెసిపీ
దక్షిణాది వంటకాలు తినేందుకు చాలా రుచిగా ఉంటాయి. అందులో కర్ణాటకలోని మంగళూరు రెసిపీలు కూడా కొన్ని ప్రత్యేకం. ఇక్కడ కొబ్బరిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే కొన్ని రకాల రెసిపీలను పెళ్లిల్లో ఎక్కువగా పెడుతుంటారు. ఇవి తినేందుకు చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం అందిస్తాయి. మీరు ఎప్పుడైనా దోసకాయ కర్రీని తిన్నారా? లేదంటే మంగళూరు స్టైల్ దోసకాయ రెసిపీని ట్రై చేయండి. తినేందుకు బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు అందిస్తుంది.
మంగళూరు స్టైల్ దోసకాయ రెసిపీని చేయడం చాలా ఈజీనే. దీనిని చేసేందుకు పెద్దగా సమయం ఎక్కువగా పట్టదు. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. దోసకాయ కర్రీని ఎలా చేస్తారో తెలుసుకుందాం..
దోసకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు
1 కప్పు తరిగిన దోసకాయ, 1 తరిగిన టొమాటో, 1/2 కప్పు పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, కొద్దిగా బెల్లం, ఆవాలు 1 చిటికెడు, కొత్తిమీర 1 పెద్ద చెంచా, జీలకర్ర 1/2 చెంచా, ధనియాలు కొన్ని, మెంతి గింజలు 1/4 చెంచా, ఎండుమిర్చి 5, పచ్చిమిర్చి 1, శనగలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర తరుగు 1/4 కప్పు, పసుపు 1 చిటికెడు, వంట నూనె 1 చెంచా, వెల్లుల్లి 2, లవంగాలు నాలుగైదు, రుచికి ఉప్పు
దోసకాయ కర్రీ తయారు చేసే విధానం
ముందుగా కుక్కర్ తీసుకుని అందులో దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి, ఉప్పు, బెల్లం వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. కొద్దిగా బెల్లం వేస్తే సరిపోతుంది.
ఇప్పుడు బాణలి తీసుకుని అందులో నూనె వేసి ధనియాలు, జీలకర్ర, శెనగలు, ఆవాలు వేసి వేయించాలి. తర్వాత అదే బాణలిలో ఎండు మిరపకాయలను వేయించాలి. సుగంధ ద్రవ్యాలు అన్ని వేయించి చల్లబడిన తర్వాత మిక్సర్‌లో వేయాలి. తర్వాత జాజికాయ తురుము, వెల్లుల్లి, పసుపు వేసి మసాలా గ్రైండ్ చేయాలి.
ఇప్పుడు ఉడికించిన కూరగాయలను ఒక గిన్నెలో వేయండి. దీనికి రుబ్బిన మసాలా దినుసులు వేసి, అవసరమైతే నీరు వేసి మీడియం మంట మీద ఉడకనివ్వండి. చివర్లో కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేసుకుంటే మంగళూరు స్టైల్ దోసకాయ కర్రీ రెడీ. ఇది వేడి వేడి అన్నంతో రుచి చూడటానికి బాగుంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
దోసకాయలో మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ దోసకాయను తినాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దోసకాయలో నీటి శాతం చాలా ఎక్కువ. దోసకాయ తినడం మంచిది. పొడి చర్మంతో బాధపడేవారు కూడా ఈ వంటకాన్ని తీసుకోవచ్చు.