తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  How To Order Coffee: ఎస్ప్రెస్సో, క్యాపుచీనో, అమెరికానో.. ఈ కాఫీల్లో తేడాలేంటి? బెస్ట్ కాఫీ ఎలా ఆర్డర్ చేయాలి?

How to order Coffee: ఎస్ప్రెస్సో, క్యాపుచీనో, అమెరికానో.. ఈ కాఫీల్లో తేడాలేంటి? బెస్ట్ కాఫీ ఎలా ఆర్డర్ చేయాలి?

09 October 2024, 10:30 IST

google News
  • How to order Coffee: కాఫీ షాపుల్లోకి వెళ్లి కూర్చోగానే అక్కడున్న పేర్లు అర్థం కావట్లేదా? ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే వాటి పేర్ల అర్థాలు తెల్సుకోండి. బెస్ట్ కాఫీ ఆర్డర్ చేసుకోవచ్చు.

కాఫీ ఎలా ఆర్డర్ చేయాలి?
కాఫీ ఎలా ఆర్డర్ చేయాలి? (freepik)

కాఫీ ఎలా ఆర్డర్ చేయాలి?

క్యాపుచీనో, లాటే, అమెరికానో, మోకా.. ఇవన్నీ కాఫీల పేర్లు. ఒక్కో రకం కాఫీకి ఒక్కో పేరుంది. దాంట్లో ఉండే పాల నిష్పత్తి, కాఫీ డికాక్షన్ నిష్పత్తి, చాకోలేట్ లాంటి వాటి మోతాదు బట్టి ఒక్కోదానికి ఒక్కో పేరు ఉంటుంది. మీకు ఎలాంటి కాఫీ నచ్చుతుంది, కాఫీ షాపులకు, కెఫెలకు వెళ్లినప్పుడు ఎలాంటి కాఫీ ఎంచుకోవాలో స్పష్టత రావాలంటే ఒకసారి ఇది చదివేయండి.

చాయ్ లాగే కాఫీ కూడా కొంత మందికి స్ట్రాంగ్‌గా ఉంటే నచ్చుతుంది. మరికొందరికి తక్కువ గాఢత ఉండాలి. చేదు తక్కువ ఉండాలి అనిపిస్తుంది. అందుకే ఒక్కొక్కరి రుచికి తగ్గట్లు ఆ మోతాదులు మారుస్తూ చాలా రకాల కాఫీలు, వాటికి వేరు వేరు పేర్లు ఉన్నాయి.

1. ఎస్ప్రెస్సో (Espresso):

చాలా రకాల కాఫీలకు ఇది బేసిక్ డ్రింక్ లేదా డికాక్షన్ అనుకోవచ్చు. దీని మోతాదు మారుస్తూ కాఫీలుంటాయి. ఎక్కువ గాఢత ఉన్న కాఫీ సిరప్‌నే ఎస్ప్రెస్సో అంటారు. మామూలుగా తయారు చేసే కాఫీ డికాక్షన్ కన్నా ఈ ఎస్ప్రెస్సో స్ట్రాంగ్ గా ఉంటుంది. కాస్త చిక్కగా ఉంటుంది. పైన మళ్లీ నీళ్లు కలపకుండా దీన్ని అలాగే సర్వ్ చేస్తారు. కాబట్టి స్ట్రాంగ్‌గా కాఫీ తాగాలనుకునే వారు ఎస్ప్రెస్సో తాగొచ్చు.

2. డోపియో (Doppio):

డోపియో అర్థం డబుల్ అని. మామూలుగా ఎస్ప్రెస్సో అంటే ఎంత కాఫీ సర్వ్ చేస్తారో దానికి రెండింతల కాఫీ కావాలనుకుంటే డోపియో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే కాఫీ ఎక్కువగా తాగాలనుకునే వాళ్లకి ఇది సరిపోతుంది.

3. లాటే (Latte):

ఎస్ప్రెస్సో లో వేడి పాలు కలిపి ఇది సర్వ్ చేస్తారు. కాఫీ డికాక్షన్ నేరుగా కాకుండా పాలు కలిపి తక్కువ గాఢతతో కాఫీ తాగాలి అనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. అలాగే ఐస్డ్ లాటే కూడా ఉంటుంది. అంటే కాఫీ చల్లగా ఉంటుందన్నమాట. ఐస్ ముక్కల మీద ఎస్ప్రెస్సో, పాలు కలిపి ఇస్తే ఐస్డ్ లాటే అవుతుంది.

4. క్యాపుచీనో ( Cappuccino):

క్యాపుచీనోలో ఎస్ప్రెస్సో, వేడిపాలు, పాల క్రీం సమాన భాగాలుగా ఉంటుంది. అలాగే మీదుండే పాల క్రీం మీద చాకోలేట్ పౌడర్ చల్లి ఇస్తారు. మనలో చాలా మంది విన్న కాఫీ రకం ఇదే. కాస్త చిక్కగా కావాలనుకుని, మరీ ఎక్కువ గాఢత లేని కాఫీ ఇష్టపడే వాళ్లు దీన్న ఎక్కువగా ఇష్టపడతారు.

5. ఫ్లాట్ వైట్ (Flat White):

ఫ్లాట్ వైట్ కూడా లాటే లాంటి కాఫీనే. దీంట్లో కూడా వేవలం ఎస్ప్రెస్సో, వేడి పాలు ఉంటాయి. కాకపోతే ఇందులో లాటే కన్నా ఎస్ప్రెస్సో శాతం ఎక్కువ, పాలు తక్కువగా ఉంటాయి.

6. అమెరికానో (Americano):

ఎస్ప్రెస్సో గాఢత ఇష్టపడని వాళ్లు, కాఫీలో పాలు నచ్చని వాళ్లు దీన్ని తాగొచ్చు. ఎస్ప్రెస్సోలో వేడి నీళ్లు కలిపితే అమెరికానో. అంటే కాఫీ గాఢత తగ్గి అంత స్ట్రాంగ్‌గా ఉండదు.

7. మోకా (Mocha):

మీరు చాకోలేట్, కాఫీ.. రెండింటినీ ఇష్టపడితే మోకా ఎంచుకోవచ్చు. ఎస్ప్రెస్సోలో చాకోలేట్ కలిపి దాంట్లో వేడి పాలు పోసి మోకా చేస్తారు. దీంట్లో పాల క్రీం కూడా ఉంటుంది. కాఫీ ఫ్లేవర్‌తో పాటూ, చాకోలేట్ ఫ్లేవర్ ఉండి తాగుతుంటే క్రీమీగా ఉంటుందిది.

వీటితో పాటే బోలెడు కాఫీ రకాలుంటాయి. మన అలవాట్లకు తగ్గట్లు మనం ఎక్కువగా ఇష్టపడే రకాలు ఇవే. వీటిని గుర్తుంచుకుంటే మీకు నచ్చే బెస్ట్ కాఫీ ఆర్డర్ చేసుకోవచ్చు. కాస్త ఓపిక ఉంటే ఇంట్లోనూ చేసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం