Homemade Toothpaste : ఇంట్లోనే టూత్ పేస్ట్ తయారు చేయడం ఎలా? చాలా ఈజీ
17 October 2023, 17:15 IST
- Homemade Toothpaste : పంటి ఆరోగ్యాన్ని సరిగా చూసుకోవాలి. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. ఏదో ఒక టూత్ పేస్ట్ వాడి.. పంటి సమస్యలు తెచ్చుకునే బదులు.. ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు.
టూత్ పేస్ట్
దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. కానీ దుకాణంలో టూత్‌పేస్ట్ కొనడానికి వెళ్లినప్పుడు గందరగోళం అవుతుంది. ఏ టూత్‌పేస్ట్ కొనాలిరా బాబు అని ఆలోచనల్లో పడతారు. సరైన టూత్ పేస్ట్ ఎంచుకోలేరు. దీని కోసం చాలా సమయం పడుతుంది. అంతేగాక ఇప్పుడు దాదాపు ప్రతిదీ వివిధ రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తున్నారు. దీంతో దంత సమస్యలు ఇంకా పెరిగిపోతాయి.
రసాయనాలు కలిపిన పేస్టులను దీర్ఘకాలం వాడడం వల్ల దంతాలు, చిగుళ్లు దెబ్బతింటాయని వైద్యులు చెబుతున్నారు. నోటి పుండ్లు, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వస్తాయి. అలా కాకుండా ఇంట్లోనే రసాయనాలు లేని టూత్‌పేస్ట్‌ను తయారు చేసుకుంటే మేలు జరుగుతుంది. కొన్ని ఇంట్లోని వాటితోనే టూత్ పేస్టును తయారు చేసుకోవచ్చు. మీరు టూత్‌పేస్ట్‌ను ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం.
ఇంట్లో టూత్ పేస్ట్ తయారు చేసేందుకు 4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 10 నుండి 15 చుక్కల పుదీనా నూనె, చిటికెడు ఉప్పు తీసుకోవాలి. ఆశ్చర్యపోకండి.. ఈ నాలుగు వస్తువులతో టూత్ పేస్టు తయారవుతుంది. పంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తయారీ విధానం ఏంటో చూద్దాం..
ముందుగా ఒక గిన్నెలో బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి. దానికి కొబ్బరి నూనె కలపండి. తర్వాత కొన్ని చుక్కల పుదీనా నూనె కలపాలి. టూత్‌పేస్ట్ లాగా చిక్కబడే వరకు పదార్థాలను చిలకాలి. టూత్‌పేస్ట్ సిద్ధమైన తర్వాత, శుభ్రమైన గాజు సీసాలో నిల్వ చేయండి. ఇంట్లో తయారుచేసిన ఈ పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోండి.
బేకింగ్ సోడా దంతాలను శుభ్రంగా ఉంచుతుంది. ఇది విషపూరితం కాదు, దంత క్షయం కలిగించదు. ఉప్పు దంతాల నుండి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. దంతాలు పసుపు రంగులోకి మారడాన్ని నివారిస్తుంది. దంతాలు, చిగుళ్ళ నుండి ఫలకం, బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. పుదీనా నూనె వాసన, రుచితో ఉంటుంది. ఈ ఆయిల్ నోటిలోని బ్యాక్టీరియాను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.