sarvapindi with jowar flour: జొన్నపిండితో సర్వపిండి
24 April 2023, 17:00 IST
sarvapindi with jowar flour: తెలంగాణ ప్రత్యేక వంటకాలలో సర్వపిండి ఒకటి. మామూలుగా దీన్ని బియ్యంపిండితో చేస్తారు. దానికి బదులుగా ఒకసారి జొన్నపిండితో చేసిచూడండి.
cooking
ఆరోగ్యం కోసం వివిధ ప్రత్యామ్నాయల కోసం చూస్తున్నారా? అయితే ఒకసారి బియ్యం పిండికి బదులుగా జొన్నపిండితో సర్వపిండి చేసి చూడండి. రుచితో పాటూ ఆరోగ్యం కూడా. ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
క్యారట్ తురుము - 1 కప్పు
సొరకాయ తురుము - 1 కప్పు
ఉల్లిపాయలు - 1, పెద్దది
జొన్న పిండి - 2 కప్పులు
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర - అరకట్ట
నువ్వులు - రెండు టేబుల్ స్పూన్లు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
కారం - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు- తగినంత
తయారీ విధానం:
పదార్థాలన్నీ కలుపుకోడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోండి. దాంట్లో ముందుగా జొన్నపిండి, క్యారట్ తురుము, సొరకాయ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీర వేయండి. కొత్తిమీర మీ ఇష్టానుసారం ఇంకాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి , అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా కలపండి.సొరకాయ నుంచీ వచ్చే నీళ్లతో పిండి ముద్దలా అయిపోతుంది. అవసరం ఉంటేనే నీళ్లు వాడండి. ముందే నీళ్లు పోస్తే పిండి పలచగా అయిపోతుంది.
ఇప్పుడు పెనం లేదా మూకుడులో సగం స్పూను నూనె వేసి అంచులదాకా పూయండి. పిండి ముద్దను తీసుకుని కాస్త మందంగా పెనం అంతటా వచ్చేలా ఒత్తుకోండి. మధ్యలో అక్కడక్కడా చేతి వేలి సాయంతో రంధ్రాలు చేసి వాటిలో నూనె వేయండి. స్టవ్ వెలిగించి సర్వపిండి ఒత్తుకున్న పెనం పెట్టేయండి. మీద సరిగ్గా సరిపోయే మూత మూయండి. మధ్య మధ్యలో మాడిపోకుండా చూస్తూ ఉండండి. 5 నిమిషాల్లో పిండి మొత్తం ఉడికినట్లు అవుతుంది. దీన్ని ఒకవైపు మాత్రమే కాల్చాలి. మరోవైపు పెనం మీద వేయాల్సిన అవసరం లేదు. కాస్త చల్లబడగానే పెనం నుంచి సులభంగా వచ్చేస్తుంది.ఇంకేం సర్వపిండి సిద్ధ మైనట్లే.
టాపిక్