Protein powder: పిలల్ల కోసం పాలలో కలిపేందుకు ప్రొటీన్ పొడి ఇంట్లోనే ఇలా తయారుచేసేయండి, ఇదెంతో ఆరోగ్యం
13 November 2024, 16:47 IST
Protein powder: పిల్లలకు పాలు చూడగానే అందులో ఏదైనా స్వీట్ పొడి వేయమని అడుగుతారు. బయటకొనే ఉత్పత్తులు మీకు నచ్చకపోతే ఇంట్లోనే ఆరోగ్యంగా ప్రొటీన్ పొడిని తయారు చేసేయండి. ఇది పాల రుచిని పెంచడమే కాకుండా, పాల ప్రయోజనాలు కూడా రెట్టింపు చేస్తుంది.
హార్లిక్స్ పొడి తయారీ
పాలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయి. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు పాలు చాలా అవసరం. అయితే పాలు చూడగానే పిల్లలు తాగేందుకు ఇష్టపడరు. పిల్లలకు నచ్చేలా ఏదైనా తీపిగా ఉండే పౌడర్ ను అందులో కలిపితేనే తాగుతారు. మార్కెట్లో ఎన్నో రకాల ఎనర్జీ పౌడర్లు ఉన్నాయి. అందులో ఒకటి ప్రొటీన్ పొడి. ఇది ఎక్కువ మంది పిల్లలకు నచ్చుతుంది. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా చేేసేయచ్చు.
ఈ ప్రొటీన్ పొడి పాల రుచిని పెంచడమే కాకుండా అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. అయితే బయట అమ్మే ఉత్పత్తుల కన్నా ఇంట్లోనే దీన్ని తయారు చేస్తే అన్ని రకాలుగా పిల్లలకు ఆరోగ్యమే. ఇందులో మనము ఆర్టిఫిషియల్ స్వీట్ నెర్ వాడకుండా తయారు చేయవచ్చు. మీరు ఇంట్లో పిల్లల కోసం రుచికరమైన ప్రోటీన్ పౌడర్ తయారు చేయడం మంచిది. దీన్ని తయారుచేయడం చాలా సులభం.
ఇంట్లో ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ప్రోటీన్ అధికంగా ఉండే పౌడర్ తయారు చేయడానికి కొన్ని ఉత్పత్తులు అవసరం. ఒక కప్పు గోధుమలు, యాభై గ్రాముల బాదం, యాభై గ్రాముల వేరుశెనగ పలుకులు, యాభై గ్రాముల పాల పొడి, ఒక టీస్పూన్ యాలకుల పొడి, ఒక టీస్పూన్ కోకో పౌడర్ తీసుకోవాలి. స
ప్రొటీన్ పొడిని ఇంట్లోనే తయారు చేయడం చాలా ముఖ్యం. ఇది రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ముందుగా గోధుమలను శుభ్రంగా కడిగి ఒకటి రెండు రాత్రులు నానబెట్టాలి. గోధుమలు మెత్తగా అయ్యే వరకు నానబెట్టాలి. గోధుమల రెండు రోజుల పాటూ నానబెడితే నీటిని మధ్యమధ్యలో మారుస్తూ ఉండండి.
ఆ తర్వాత గోధుమలు మెత్తగా అయ్యాక వాటిని మొలకెత్తించాలి. దీని కోసం గోధుమలను సన్నని వస్త్రంలో కట్టి ఉంచాలి. గోధుమలు ఒకటిన్నర రోజుల్లో మొలకెత్తడం ప్రారంభిస్తాయి. మొలకలు వచ్చాక, వాటిని బాగా ఆరనివ్వండి. మీరు వాటిని ఎండలో లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టవచ్చు. గోధుమలలో తేమ లేకుండా చూసుకోవాలి.
గోధుమలు బాగా ఎండిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి తక్కువ మంట మీద కాసేపు వేయించాలి. మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఈ వేయించిన గోధుమలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేస్తే పాలలో బాగా కరుగుతుంది. ఈ పొడిని బాగా జల్లించాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వేరుశెనగ పలుకులు, బాదం పప్పులను చిన్న మంట మీద వేయించాలి. వేరుశెనగలు వేయించిన తర్వాత పైన పొట్టును తీసేయాలి. ఇప్పుడు వాటిని బాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మిక్సీలో బాదం, పంచదార వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. దాన్ని కూడా చల్లించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒకగిన్నెలో గోధుమపిండి, వేరుశెనగ పొడి, పాలపొడి మిశ్రమం వేసి కలుపుకోవాలి. దాన్ని ఒక కంటైనర్లో వేసి భద్రపరుచుకోవాలి. అంటే ఇంట్లో హెల్తీ ప్రొటీన్ పొడి తయారైపోయింది. ఇప్పుడు పాలల్లో ఈ పొడిని వేసి బాగా కలుపుకోవాలి. రుచి కోసం యాలకుల పొడిని కూడా వేసుకుని కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. పిల్లలకు చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువగా నచ్చితే కోకో పౌడర్ ను ఇందులో కలపవచ్చు. దీని వల్ల హోమ్ మేడ్ హార్లిక్స్ పొడి రుచి పెరుగుతుంది.