Anjeer Halwa: అంజీరాతో హల్వా.. ఒక్కసారి తింటే ఫ్యాన్ అయిపోతారు
20 September 2024, 15:30 IST
Anjeera Halwa: అంజీరా రుచి అన్ని డ్రై ఫ్రూట్స్ కన్నా బిన్నం. దీనికి సహజ తీపి ఉంటుంది. దీంతో రుచికరమైన హల్వా చేసేయండి. అంజీర్ హల్వా తింటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది.
అంజీర్ హల్వా
అంజీరాతో హల్వా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంజీరాతో రుచితో పాటే ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఎప్పుడూ చేసుకునే హల్వాకు బదులు ఈసారి అంజీరాతో చేయండి. వీటికి ఎండబెట్టిన డ్రై అంజీరానే వాడాలి. తాజా అంజీరా పండ్లు వాడితే తయారీ పద్దతి వేరే ఉంటుందని గుర్తుంచుకోండి. రుచికరమైన అంజీరా హల్వా తయారీ ఎలాగో చూసేయండి.
అంజీర్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు:
పావు కప్పు నెయ్యి
2 కప్పుల డ్రై అంజీర్
సగం కప్పు కోవా
సగం కప్పు పంచదార
పావు కప్పు బాదాం
1 టీస్పూన్ కుంకుమ పువ్వు (ఆప్షనల్) లేదా ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్
1 టీస్పూన్ యాలకుల పొడి
అంజీర్ హల్వా తయారీ విధానం:
1. ముందుగా కాస్త గోరువెచ్చని నీళ్లలో కుంకుమ పువ్వు కలిపి పక్కన పెట్టుకోవాలి. దీంతో మంచి రంగు వస్తుంది. ఫుడ్ కలర్ వాడితే కుంకుమ పువ్వు అవసరం లేదు.
2. ఇప్పుడు వేడి నీళ్లు చేసి అందులో బాదాం నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత బాదాం చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
3. అలాగే అంజీరాను శుభ్రంగా కడిగి ఒక గంటసేపు అలా వదిలేస్తే కాస్త మెత్తబడతాయి. ఇప్పుడు నానబెట్టిన అంజీరాను ముక్కలుగా కోసుకుని మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తటి మిశ్రమం తయారవ్వాలి.
4. వెంటనే కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. కాస్త వేడెక్కాక స్టవ్ సన్నం మంట మీద పెట్టి మిక్సీ పట్టుకున్న అంజీరా ముద్దను వేసుకోవాలి. కనీసం పదినిమిషాల పాటూ నెయ్యిలో కలుపుతూ ఉండాలి. కాసేపటికి అంచులు వదిలేసి ముద్దలాగా అయిపోతుంది.
5. వెంటనే కోవా వేసుకుని కలియబెట్టాలి. మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మీరు తినే తీపిని బట్టి పంచదార వేసుకోవాలి. వెంటనే కుంకుమ పువ్వు కలిపి పెట్టుకున్న నీళ్లు కూడా పోసుకోవాలి. దీంతో మంచి రంగు వస్తుంది. లేదంటే ఫుడ్ కలర్ అయినా కలుపుకోండి.
6. అన్నీ కలిసి మిశ్రమం కాస్త గట్టి పడేదాకా కలుపుతూ ఉండాలి. గట్టిగా అయ్యాక కట్ చేసి పెట్టుకున్న బాదాం, యాలకుల పొడి వేసుకుని కలిపి స్టవ్ కట్టేయాలి. అంతే.. అంజీర్ హల్వా రెడీ అయినట్లే.
ఎండు అంజీర్ లో ప్రొటీన్, కార్బోహైడ్రేట్లుంటాయి. దాంతో పాటూ కొద్ది స్థాయిలో కొవ్వులుంటాయి. క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త పోటును నియంత్రణలో ఉంచడంలో పాత్ర వహిస్తాయి. దానివల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయి. గుండె ఆరోగ్యంగా ఉంచుతాయి.
టాపిక్