HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fenugreek Oil: మెంతుల సారమంతా దిగేలా నూనె ఇలా చేసి వాడారంటే.. జుట్టు సమస్యలన్నీ మాయమైనట్లే

Fenugreek oil: మెంతుల సారమంతా దిగేలా నూనె ఇలా చేసి వాడారంటే.. జుట్టు సమస్యలన్నీ మాయమైనట్లే

07 July 2024, 10:50 IST

  • Fenugreek oil: మెంతులను జుట్టుకు ప్యాక్ లాగా వేసుకుంటాం కానీ వాటితో చేసిన నూనెను ప్రయత్నించం. ఒకసారి ఈ నూనె తయారీ, దాని లాభాలు చూసేయండి. 

మెంతుల నూనె
మెంతుల నూనె (freepik)

మెంతుల నూనె

మెంతులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని తెల్సిందే. అనేక సౌందర్య సమస్యలకు కూడా మెంతులతో పరిష్కారం దొరుకుతుంది. డెలివరీ తర్వాత, ఇంకేదైనా సమస్యలతో జుట్టు ఎక్కువగా ఊడుతుంటే ఒకసారి మెంతుల నూనె వాడి చూడొచ్చు. చాలా అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. దాన్నెలా తయారు చేయాలో, ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెల్సుకుందాం.

మెంతి నూనె తయారీ:

1. ముందుగా ఒక గాజు సీసాలో సగం కప్పు దాకా మెంతులను వేయాలి.

2. ఈ మెంతుల్లోనే మీకు నచ్చిన ఏదైనా నూనె పోసుకోవాలి. నూనె పోశాక మెంతులు మునిగి, మీద మరో ఇంచు లేదా ఇంచున్నర దాకా నూనె ఉండాలి. గాఢత ఎక్కువున్న నూనె తయారు కావాలంటే మెంతులను ముందుగానే కాస్త కచ్చాపచ్చాగ దంచుకుని సీసాలో పోసుకోవాలి. మిక్సీ మాత్రం పట్టకూడదు.

3. మీ ఇష్టం, అలవాటు బట్టి మెంతి నూనె తయారీ కోసం కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, బాదాం నూనె వాడుకోవచ్చు. ఇంకా ఏ నూనె అయినా ఎంచుకోవచ్చు.

4. ఇప్పుడు సీసా మూత గట్టిగా పెట్టేసి కనీసం నాలుగు నుంచి ఆరు వారాలు అలాగే ఉంచాలి. నూనె వేడి చేయాల్సిన అవసరం లేదు. చల్లటి నూనె మాత్రమే మెంతుల్లో పోయాలని గుర్తుంచుకోండి. గది ఉష్టోగ్రత దగ్గర నూనె సీసాను అలా వదిలేయండి. రోజుకు ఒకసారైనా సీసాను మెంతులు, నూనె కలిసేలా ఊపండి చాలు.

5. ఆరు వారాల తర్వాత మెంతులతో సహా ఏదైనా కాటన్ వస్త్రం లేదా జాలితో నూనెను వడపోయండి. నూనె రంగు కాస్త మారుతుంది. ఎన్ని ఎక్కువ రోజులు ఉంచితే నూనె రంగులో అంత మార్పు వస్తుంది. మెంతులను పడేయండి.

6. వడకట్టిన నూనెను ఒక సీసాలో భద్రపర్చుకుంటే కనీసం నెల రోజుల పాటైనా వాడుకోవచ్చు. మంచి ఫలితం రావాలంటే కనీసం రెండు నుంచి మూడు వారాలైనా క్రమం తప్పకుండా ఈ నూనె రాసుకోండి.

మెంతి నూనె వల్ల లాభాలు:

1. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషణ అవసరం. మెంతినూనె జుట్టుకు కావాల్సిన ఎసెన్షియల్ పోషకాలను అందిస్తుంది. దాంతో జుట్టు దృఢంగా మారడమే కాక, కొత్త జుట్టు వచ్చేలా చేస్తుంది.

2. చాలా మందిని ఇబ్బంది పెట్టే మరో సమస్య చుండ్రు. మెంతి నూనె కనీసం నాలుగు వారాలైనా వాడితే చుండ్రు తగ్గుముఖం పడుతుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలున్నాయి.

3. జుట్టు స్టైలింగ్ కోసం జుట్టును వేడి చేయడం, వివిధ రకాల రంగులు, కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు వాడటం వల్ల జుట్టు రాలడం ఎక్కువవుతుంది. బలహీనంగా మారుతుంది. అలాంటప్పుడు ఈ మెంతి నూనె వాడటం వల్ల దెబ్బతిన్న జుట్టును ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. జుట్టుకు కొత్త మెరుపు వచ్చేలా ఈ నూనె చేస్తుంది.

4. డెలివరీ తర్వాత పోస్ట్‌పార్టం సమయంలో జుట్టు బాగా రాలుతుంది. ఆ సమయంలో కూడా ఈ నూనె వాడటం వల్ల మంచి ఫలితాలుంటాయి. నూనె వాడినప్పుడు శ్వాసలో సమస్య, ఏదైనా వాపు రావడం, దురద లాంటివి అనిపిస్తే నూనె వాడటం ఆపేయండి.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్