తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Curry Leaf Oil: కరివేపాకు నూనె ఇలా చేసుకోండి.. జుట్టు, చుండ్రు సమస్యలు ఖతం..

DIY curry leaf oil: కరివేపాకు నూనె ఇలా చేసుకోండి.. జుట్టు, చుండ్రు సమస్యలు ఖతం..

HT Telugu Desk HT Telugu

26 October 2023, 17:00 IST

google News
  • DIY curry leaf oil:  జుట్టు సమస్యలను తగ్గించే కరివేపాకు నూనె ఇంట్లోనే సరైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. దీనివల్ల జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలు దూరమైపోతాయి. 

కరివేపాకు నూనె
కరివేపాకు నూనె

కరివేపాకు నూనె

బయట కాలుష్యం తీవ్రంగా ఉంటోంది. అందుకే ఈ మధ్య కాలంలో జుట్టు సమస్యలు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. ఎవరిని చూసినా ‘నా జుట్టు ఊడిపోతోంది.’ ‘నా జుట్టు పల్చ బడిపోతోంది.’ లాంటి మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వాతావరణంలో కాలుష్య కారకాల వల్ల మొదటగా ప్రభావితం అయ్యేవి కేశాలే. బయటి కారణాలు ఒక ఎత్తయితే.. చుండ్రు, దురదలు, పౌష్టికాహారం తినకపోవడం, విటమిన్‌ లోపాలు.. తదితరాలన్నీ కలిసి ఈ సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. ఈ సమస్యలన్నింటికీ కరివేపాకు నూనె చెక్‌ పెడుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఆ కరివేపాకు నూనె రెసిపీని ఇప్పుడు స్టెప్‌ బై స్టెప్‌ చూసేద్దాం.

స్టెప్‌ 1 :

రెండు గుప్పెళ్ల కరివేపాకుల్ని తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి. తడి లేకుండా ఉండేలా చూసుకోండి. అవసరం అనుకుంటే కొంచెం సేపు ఎండలో పెట్టుకుని తీసి పక్కనుంచుకోండి.

స్టెప్‌ 2 :

రెండు కప్పుల స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తీసుకోండి. దాన్ని ఓ గిన్నెలో పోసి గ్యాస్‌ స్టౌ పైన పెట్టండి. దాన్ని బాగా వేడి అవ్వనివ్వండి.

స్టెప్‌ 3 :

నూనె బాగా పొగలు వస్తోంది అనుకున్నప్పుడు కరివేపాకుల్ని తీసి అందులో వేయండి. ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆకులు చిటపటలాడతాయి. ఏమాత్రం తడి ఉన్నా పేలతాయి. కాబట్టి అవి కచ్చితంగా పొడిగా ఉండేలా జాగ్రత్త పడండి. ఆకులన్నీ మునిగేలా ఒకసారి కలిపి స్టౌ కట్టేయండి.

స్టెప్‌ 4 :

ఈ నూనెను పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత వడగట్టి గాజు సీసాలో పోసుకుని భద్రపరుచుకోండి. ఈ నూనె లేత పచ్చ రంగులోకి మారుతుంది. దీనిలోకి కరివేపాకులోని ఔషధ గుణాలన్నీ చేరి జుట్టుకు మేలు చేస్తాయి.

ఈ నూనె రాసుకునే విధానం:

జుట్టు కుదుళ్ల నుంచీ ఈ నూనెను బాగా మర్దనా చేయండి. వారానికి రెండు సార్లయినా దీన్ని వాడుకోవడం వల్ల జట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. కరివేపాకు నూనెను వాడుతూ ఉండటం వల్ల కుదుళ్లు బలంగా అయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కొందరికి మాడు పొడిబారిపోయినట్లు అయి.. పొట్టు వచ్చినట్లు అవుతూ ఉంటుంది. దీని వల్ల దురద బాగా ఎక్కువగా అనిపిస్తుంది. పదే పదే గోకే సరికి జుట్టు కుదుళ్లు బలహీనమై జట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్న వారు తప్పకుండా ఈ నూనెను వారానికి మూడు సార్లు అయినా రాసుకోవచ్చు. అలాగే తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు దీన్ని రాసుకుని తర్వాత స్నానం చేయవచ్చు. దీని వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.

తదుపరి వ్యాసం