తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Car Loan | సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలంటే లోన్‌ ఎలా? వడ్డీ రేటు ఎంత?

Car Loan | సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలంటే లోన్‌ ఎలా? వడ్డీ రేటు ఎంత?

Hari Prasad S HT Telugu

09 February 2022, 8:07 IST

    • ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో సెకండ్‌ హ్యాండ్‌ కారు లోన్‌ పొందే అవకాశం ఉంది. ఇక ఈ కార్లను అమ్మే షోరూమ్‌లు కూడా బ్యాంకుల నుంచి సులువుగా లోన్లు ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సెకండ్‌ హ్యాండ్‌ కారు లోను ఎలా వస్తుంది? వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం.
సెకండ్ హ్యాండ్ కారు లోనుతో మీకు నచ్చిన కారును కొనండి
సెకండ్ హ్యాండ్ కారు లోనుతో మీకు నచ్చిన కారును కొనండి (Pexels)

సెకండ్ హ్యాండ్ కారు లోనుతో మీకు నచ్చిన కారును కొనండి

Car Loan ఒకప్పుడు బ్యాంకులు ఏదైనా లోను ఇవ్వాలంటే సవాలక్ష కొర్రీలు పెట్టేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పది వేల లోపు మొబైల్స్‌ కొనాలన్నా సులువుగా లోన్లు ఇచ్చేస్తున్నాయి. ఇక కార్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొత్త కార్లకే కాదు.. సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు కూడా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు లోన్లు ఇస్తున్నాయి. ఈ కార్లు అమ్మే సైట్లలోకి వెళ్లి లోన్‌ గురించి ఎంక్వైరీ చేస్తే చాలు... మీ ఫోన్‌ మోగుతూనే ఉంటుంది. మీకు సెకండ్‌ హ్యాండ్‌ కారు లోన్‌ కావాలా? ఏ కారు కొంటున్నారు? మీరు ఉద్యోగం చేస్తారా? వ్యాపారమా? మా వడ్డీ రేటు ఇంత ఉంటుంది? అంటూ చెబుతూ వెళ్తారు. అంతేకాదు లోన్‌కు అప్లై చేయడం కూడా చాలా సులువుగా మారిపోయింది. 

ట్రెండింగ్ వార్తలు

Meaning of Moles: మీ ముఖంలో వివిధ చోట్ల ఉండే పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి

Soya Dosa: టేస్టీ సోయా దోశ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Acid Reflux At Night : రాత్రి గుండెల్లో మంట రావడానికి కారణాలు.. ఈ అసౌకర్యాన్ని ఎలా తొలగించాలి?

ఏంటీ సెకండ్‌ హ్యాండ్‌ కారు లోను?

కొత్త కారుకు లోన్‌ ఎలా తీసుకుంటారో అలాగే సెకండ్‌ హ్యాండ్‌ కారుకు కూడా లోన్‌ తీసుకోవచ్చు. కొత్త కారుకైతే ఆయా కంపెనీలు అప్పటికే ఓ ధర చెప్పేస్తాయి. దానిని బట్టి బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు ఎంత లోన్‌ ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటాయి. అదే పాత కారు విషయంలో అయితే.. అది ఎంతకాలం కిందటిది? ఎలాంటి కండిషన్‌లో ఉంది అన్న విషయాలు చూసి.. అవసరమైతే కారు వాల్యుయేషన్‌ చేసి లోన్‌ ఎంతివ్వాలో నిర్ణయిస్తాయి. 

ఒకటి నుంచి ఏడేళ్ల కాలానికిగాను ఈ సెకండ్‌ హ్యాండ్‌ కారు లోన్లు ఇస్తారు. కాకపోతే కొత్త కార్ల కంటే ఈ కార్లకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అది కూడా మీ క్రెడిట్‌ స్కోరు, కారు కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్‌ స్కోరు బాగుంటే.. వడ్డీ రేటు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇక సెకండ్‌ హ్యాండ్‌ కారు కావడంతో.. మీరు చెల్లించాల్సిన మొత్తం తక్కువగానే ఉంటుంది. అంటే లోను తక్కువ.. ఈఎంఐలు కూడా తక్కువే. దీంతో వాడిన కార్లను కొనడానికి చాలామంది లోన్ల వైపే చూస్తున్నారు.

లోన్‌కు ఎలా అప్లై చేసుకోవాలి?

ఇప్పుడు సెకండ్‌ హ్యాండ్‌ కార్ల లోన్లు అప్లై చేసుకోవడం కూడా చాలా సులువుగా మారిపోయింది. మీరు ఉద్యోగం చేస్తున్నా.. వ్యాపారం చేస్తున్నా.. ప్రతి నెలా ఒక కచ్చితమైన ఆదాయం ఉంటే చాలు.. మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు లోను కోసం అప్లై చేసుకోవచ్చు. సంబంధిత బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీ అర్హతను పరిశీలిస్తాయి. మీకు నెలవారీ ఆదాయంతోపాటు వయసు 21 ఏళ్ల నుంచి 65 మధ్య ఉండాలి. మంచి క్రెడిట్‌ స్కోరు ఉంటే.. ఎక్కువ మొత్తంలో లోన్‌.. తక్కువ వడ్డీ రేటుతో వస్తుంది. ఎలాగూ సెకండ్‌ హ్యాండ్‌ కారు కండిషన్‌ను చూసే లోన్లు ఇస్తారు కాబట్టి.. ఆ కారునే వాళ్లు సెక్యూరిటీగా పరిగణిస్తారు.

సెకండ్‌ హ్యాండ్‌ కారు లోన్‌తో లాభమేంటి?

కొత్త కారుతో పోలిస్తే.. సెకండ్‌ హ్యాండ్‌ కారు ధర చాలా తక్కువగానే ఉన్నా.. ఒకేసారి అంత మొత్తం కట్టాలంటే.. చాలా మందికి తలకు మించిన భారమే అవుతుంది. అలాంటి సమయంలో సులువుగా లోన్లు ఇస్తామంటే ఎవరు మాత్రం వద్దంటారు. పైగా కొన్ని సంస్థలు కారు విలువలో 100 శాతం కూడా లోన్ల రూపంలో ఇస్తున్నాయి. చాలా తక్కువ డాక్యుమెంట్లే అవసరం అవుతాయి. ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. అప్రూవల్‌ కూడా త్వరగానే అయిపోతుంది. ఇక ఏడాది నుంచి ఏడేళ్ల వరకూ ఈ లోనును తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది కాబట్టి.. మీ ఆదాయాన్ని బట్టి ఎంతకాలంలో చెల్లించాలన్నది నిర్ణయించుకోవచ్చు.

లోన్‌ కోసం ఏం కావాలి?

లోన్‌ కోసం అప్లై చేసుకునే ముందు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇస్తున్న సెకండ్ హ్యాండ్‌ కారు లోన్లను పరిశీలించండి. ఏ సంస్థ ఎంత మొత్తం ఇస్తోంది? వడ్డీ రేటు ఎంత అన్న విషయాలు తెలుసుకోండి. అవసరమైతే దగ్గరలోని బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకుంటే మంచిది. ఆ తర్వాత మీకు నచ్చిన చోట అవసరమైన లోన్‌ అప్లికేషన్‌ నింపాల్సి ఉంటుంది. మీ పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, కారు వాల్యుయేషన్ రిపోర్ట్‌, ఆధార్‌ లేదా పాస్‌పోర్ట్ లేదా ఓటర్‌ఐడీ, పాన్‌కార్డు వంటివి ఇవ్వాలి. ఇక ఇన్‌కమ్‌ ప్రూఫ్‌ కోసం పేస్లిప్‌, ఫామ్‌ 16, బ్యాంకు స్టేట్‌మెంట్లు, బ్యాలెన్స్‌ షీట్‌ వంటివి అడుగుతారు.

ఆ కనిపించని ఛార్జీలను చూసుకోండి..

కొన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు లోనుకు సంబంధించిన అన్ని విషయాలను ఓపెన్‌గా చెప్పేస్తాయి. కానీ కొన్ని మాత్రం హిడెన్‌ ఛార్జీల పేరుతో బాదుతుంటాయి. అందుకే ఈ కనిపించని ఛార్జీల గురించి ముందే తెలుసుకోవడం మంచిది. చాలా వరకూ సంస్థలు ప్రాసెసింగ్‌ ఫీజు, డాక్యుమెంటేషన్‌ ఛార్జీలు, ఆర్సీ కలెక్షన్‌, స్టాంప్‌ డ్యూటీ వంటివి వసూలు చేస్తాయి. ముందే లోన్‌ క్లోజ్‌ చేసినా ఛార్జీలు ఉంటాయని గమనించండి. ఈఎంఐలు ఆలస్యమైతే ఫైన్‌ పడుతుంది. కొన్ని సంస్థలు ప్రతి ఏటా ప్రత్యేక ఛార్జీలు విధిస్తాయి. అందుకే బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థకు నేరుగా వెళ్లి అన్ని వివరాలు అడిగి లోన్‌కు అప్లై చేస్తే మంచిది.

వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి?

సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను బట్టి ఇవి 6.5 శాతం నుంచి 16 శాతం వరకూ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లాంటి బ్యాంకులు గరిష్ఠంగా 7 ఏళ్లకు ఈ సెకండ్‌ హ్యాండ్‌ కారు లోన్లు ఇస్తుంటే.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వంటివి గరిష్ఠంగా మూడేళ్ల పరిమితితో ఇస్తున్నాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ అతి తక్కువగా 6.5 శాతం వడ్డీరేటుతో సెకండ్‌ హ్యాండ్‌ కారు లోన్లు ఇస్తోంది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కారు మార్కెట్ విలువలో 100 శాతం వరకూ లోను రూపంలో ఇస్తుండగా.. మరికొన్ని బ్యాంకులు 90, 85, 70, 60 శాతం వరకూ ఇస్తున్నాయి. మీరు తీసుకోబోయే కారు.. అందుకు సరైన విలువ ఇచ్చే బ్యాంకు, దాని వడ్డీరేటు, అదనపు ఛార్జీల గురించి కచ్చితంగా తెలుసుకుంటే చాలు.. ఓ మంచి సెకండ్ హ్యాండ్‌ కారు ఎలాంటి రిస్క్‌ లేకుండా మీ ఇంటి ముందు వాలిపోతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం