Fungal Infections: వర్షాకాలంలో చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణకు హోమ్ రెమెడీలు!
15 July 2023, 16:41 IST
- Fungal Infections- Remedies: వర్షాకాలంలో చర్మ వ్యాధులు సహజంగా వస్తాయి, అయితే కొన్ని ఇంటి చిట్కాలతో నివారణ సాధ్యపడుతుంది. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
Fungal Infections in monsoon
Fungal Infections - Remedies: వర్షాకాలంలో ఉండే వెచ్చని, తేమ వాతావరణం కారంగా బ్యాక్టీరియా, ఫంగస్ వంటి పరాన్నజీవులు వేగంగా వృద్ధి చెందుతాయి. అందుకే వ్యాధులు కూడా వైరల్ కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ సీజన్ లో తడిగా ఉన్న ఉపరితలాలపై శిలీంధ్రాలు పెరగడం మీరు గమనించే ఉంటారు. మీ చర్మం కూడా ఎల్లప్పుడూ తడిగా ఉండటం, గాలి ప్రసరణ సరిగా జరగనపుడు అది ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. దీంతో గజ్జి, తామర, డైపర్ రాషెస్, అథ్లెట్స్ ఫుట్ మొదలైన చర్మ వ్యాధులు తరచుగా అభివృద్ధి చెందుతాయి. ఇవి అంటువ్యాధులు కావున ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఇవి చర్మంపై దద్దుర్లు, దురదను కలిగిస్తాయి.
వర్షాకాలంలో సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించని సందర్భంలో ఇలాంటి చర్మ వ్యాధులు సహజంగా వస్తాయి, అయితే కొన్ని ఇంటి చిట్కాలతో నివారణ సాధ్యపడుతుంది. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
వర్షాకాలంలో చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణకు హోమ్ రెమెడీలు
- ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే, ముందుగా ఆ స్థలాన్ని శుభ్రం చేయండి. ప్రభావిత ప్రాంతంపై తేలికపాటి సబ్బును ఉపయోగించి నీటితో శుభ్రం చేయండి. సెంట్ వాసన గల సబ్బులను ఉపయోగించవద్దు, ఇవి ఇన్ఫెక్షన్ మరింత పెంచే అవకాశం ఉంటుంది.
- ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించండి. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల వెనిగర్ మిక్స్ చేసి, ఒక కాటన్ బాల్ సహాయంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగవచ్చు కూడా.
- కొబ్బరి నూనెను వేడి చేసి, రోజుకు రెండు మూడు సార్లు ఫంగల్ ఉన్న ప్రదేశంలో రాయండి. దీని ప్రభావం ఇన్ఫెక్షన్ మీద కనిపిస్తుంది.
- వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి, ఆలివ్ నూనెతో కలిపి, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో రాయండి. సుమారు 30 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.
- తాజాగా సేకరించిన పచ్చి పసుపును నీటిలో గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేయండి. ఆ పేస్టును ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి ఆరనివ్వాలి, తర్వాత నీటితో కడగాలి. పసుపులో కుర్కుమిన్ సమ్మేళనం ఉంటుంది. దానిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అదనంగా మీరు పసుపు టీని కూడా తాగవచ్చు. ఇది మీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే ఈ సీజన్‌లో అల్లం టీని కూడా తప్పనిసరిగా తాగుతుండాలి.
- వేప ఆకుల నీటిని మరిగించి, ఈ నీటితో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న శరీర భాగాన్ని శుభ్రం చేయండి. వేపలోని యాంటీ ఫంగల్ లక్షణాల కారణంగా, ఇది చర్మంపై బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది.
ఇవి ఇలా ఉంచితే, ఈ మాన్‌సూన్ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధులను ఎదుర్కోవడానికి మంచి పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం చాలా అవసరం.