Ragi Uttapam Recipe । రాగి ఉతప్పం.. రోజూ తింటే ఎంతో ఆరోగ్యం!
21 December 2022, 7:15 IST
- ఉత్తప్పంను మిల్లెట్లతో చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరం. అద్భుతమైన Ragi Uttapam Recipe ఇక్కడ ఉంది ట్రై చేయండి.
Ragi Uttapam Recipe
పూర్వ కాలం నుంచే మన సాంప్రదాయక ఆహారంలో మిల్లెట్‌లు కచ్చితంగా ఉంటాయి. వీటిలో ఉండే అసాధారణమైన పోషకాల కారణంగా, మిల్లెట్లు ఇటీవలి సంవత్సరాలలో విపరీతమైన ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. రాగులు, జొన్నలు, సజ్జలు వంటివి మనకు విరివిగా లభించే మిల్లెట్ రకాలు. వీటిల్లో ఫైబర్, ప్రోటీన్, ఇనుము, రాగి వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే వీటిని 'న్యూట్రి సెరియల్స్' అని పిలుస్తారు. మిల్లెట్లతో వండిన ప్రతీ ఆహారం ఎంతో శక్తివంతమైనది. చలికాలంలోనే కాదు, అన్ని కాలాల్లో మిల్లెట్ ఆహారం తీసుకోవాలి.
పిల్లల ఎదుగుదల, అభివృద్ధికి మిల్లెట్లు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. వీటిని పిల్లలకు అద్భుతమైన భోజనంగా పరిగణిస్తారు. మిల్లెట్‌లో ఎముకల ఆరోగ్యానికి కాల్షియం, ఐరన్, రోగనిరోధక శక్తి కోసం జింక్ సహా అనేక ముఖ్యమైన అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. పిల్లలలో పోషకాహార లోపానికి మిల్లెట్లతో వండిన భోజనం అందించవచ్చు.
మీరు ఉదయం అల్పాహారం కోసం రాగి ఉతప్పం చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన రాగి ఉతప్పం రెసిపీ ఇక్కడ ఉంది. మీరూ కూడా ఇలా చేసుకోండి.
Ragi Uttapam Recipe కోసం కావలసినవి
- రాగి పిండి 1/4 కప్పు
- క్యారెట్ తురుము 25 గ్రా
- సోయాకూర ఆకులు 1 టీస్పూన్
- టొమాటో 1/4 కప్పు
- ఉల్లిపాయ 1
- నెయ్యి 1 టీస్పూన్
- 1/4 టీస్పూన్ బేకింగ్ పౌడర్
- ఉప్పు రుచికోసం
రాగి ఉతప్పం తయారీ విధానం
1. ముందుగా రాగి పిండిని నీటితో కలపండి, మందపాటి బ్యాటర్ తయారు చేయండి. ఆపై ఉప్పు, 1/4 టీస్పూన్ బేకింగ్ పౌడర్ కలపండి.
2. ఒక తావాను వేడి చేసి, మందపాటి సెట్ దోశ వేయండి, కింది వైపు బంగారు రంగు వచ్చేవరకు కాల్చండి.
3. ఉతప్పం పైభాగంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, టొమాటో, క్యారెట్ ముక్కలు వేయండి, సోయాకూర ఆకులను వేసి ఉడికించాలి.
4. కూరగాయలపై నెయ్యి చల్లి, ఉతప్పంను సమానంగా ఉడికించాలి.
5. అనంతరం తిప్పి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి,.
అంతే రాగి ఉతప్పం రెడీ. కొబ్బరి లేదా వేరుశెనగ చట్నీతో వేడిగా సర్వ్ చేసుకోండి.