Varalakshmi Vratham Recipes: వరలక్ష్మీ వ్రతానికి కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం జౌట్లు, పాకం గారెలు, వీటి రెసిపీలు ఇదిగో
24 August 2024, 11:23 IST
- Varalakshmi Vratham Recipes: వరలక్ష్మి వ్రతానికి కొన్ని ప్రాంతాల్లో కచ్చితంగా పెట్టే నైవేద్యాలు జౌట్లు లేదా పొంగనాలు, పాకం గారెలు. వీటిని చేయడం చాలా సులువు. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి.
వరలక్ష్మీ వ్రతం రెసిపీలు
Varalakshmi Vratham Recipes: వరలక్ష్మీ వ్రతం వచ్చిందంటే నైవేద్యాలుగా ఏం చేయాలో ఆడపడుచులు ముందే ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మేము కొన్ని రెసిపీలు ఇచ్చాము. వరలక్ష్మి అమ్మవారికి కచ్చితంగా తీపి నైవేద్యం ఉండాల్సిందే. ఇక్కడ జౌట్లు (పొంగనాలు), పాకం గారెలు రెసిపీలను అందించాము. ఈ రెండింటినీ చేయడం చాలా సులువు. వీటితో పాటు మరికొన్ని నైవేద్యాలను వరలక్ష్మీ అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో పొంగనాలను వరలక్ష్మి అమ్మవారికి కచ్చితంగా నివేదిస్తారు. మీకు ఆ ఆచారం ఉంటే జౌట్లు, పాకం గారెలు ఎలా చేయాలో తెలుసుకోండి. వీటి రుచి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రెండింటినీ బెల్లంతోనే తయారు చేస్తాం. కాబట్టి ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.
జౌట్లు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి - ఒక కప్పు
వరి పిండి - అర కప్పు
బెల్లం తురుము - ముప్పావు కప్పు
ఉప్పు - చిటికెడు
నీళ్లు - సరిపడినన్ని
నూనె - డీప్ ఫ్రై వేయించడానికి సరిపడా
జౌట్లు రెసిపీ
1. ఒక గిన్నెలో గోధుమపిండి, వరి పిండి, చిటికెడు ఉప్పు, బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి.
2. ఈ మొత్తం మిశ్రమంలో నీటిని వేసి కాస్త మందంగా వచ్చేలా ఉండల్లేకుండా కలుపుకోవాలి.
3. ఇడ్లీకి ఎంత మందంగా పిండిని కలుపుకుంటామో అంతే మందంగా పొంగనాలు లేదా ఈ జౌట్లకు పిండిని కలుపుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి బాగా వేడి చేయాలి.
6. అవి వేడెక్కాక గరిటెతో మిశ్రమాన్ని నూనెలో వేయాలి.
7. ఒక గరిట పిండిని వేయడం వల్ల ఒక పొంగనం తయారవుతుంది,
8. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. లోపల డొల్ల డొల్లగా వస్తాయి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలల ఇవి ఒకటి.
.....................……………………………………………………..
పాకం గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు
మినప్పప్పు - ఒక కప్పు
బెల్లం - ఒకటిన్నర కప్పు
నీళ్లు - సరిపడినన్ని
నిమ్మరసం - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఆయిల్ - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
పాకం గారెలు రెసిపీ
1. మినప్పప్పును ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టుకోవాలి.
2. మరుసటి రోజు ఉదయం ఆ మినప్పప్పును మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
3. నీళ్లు ఎక్కువగా చేర్చి రుబ్బకూడదు. పిండి గట్టిగా ఉంటేనే వడ చక్కగా వస్తుంది.
4. ఆ పప్పులో రుచికి అర స్పూను ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒకవైపు నూనెను వేసి వేడి చేయాలి.
6. మరొక బర్నర్ మీద బెల్లం తురుము నీళ్లు వేసి పాకంలో కాచుకోవాలి.
7. ముందుగా రుబ్బుకున్న గారెల పిండిని తీసి చేత్తోనే వడల్లా ఒత్తుకొని నూనెలో వేయాలి.
8. రెండు వైపులా ఎర్రగా కాలాక ఆ గారెలను పక్కనే ఉన్న బెల్లం పాకంలో వేయాలి.
9. ఆ బెల్లం పాకంలో ముందుగానే ఒక స్పూను నిమ్మరసం కలుపుకుంటే బాగుంటుంది.
10. యాలకుల పొడి మీకు కావాలంటే వేసుకోవచ్చు.
11. బెల్లం పాకంలో చేర్చిన గారెలను బాగా నానిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి.
12. ఇలా చేయడం వల్ల గారెలు మొత్తంగా పాకాన్ని పీల్చుకొని పాకం గారెలుగా మారిపోతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తిన్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.