తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation: మహాభారతం నుండి ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవిగో

Thursday Motivation: మహాభారతం నుండి ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవిగో

Haritha Chappa HT Telugu

03 October 2024, 5:00 IST

google News
    • Thursday Motivation: మహాభారతంలో లేనిది ఏదీ లేదు, ఆనందం నుంచి అసూయ వరకు అన్ని ఇందులోనే ఇమిడి ఉన్నాయి. అలాగే విద్యార్థులకు ప్రేరణ ఇచ్చే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి.
మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు
మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు (Pixabay)

మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు

Thursday Motivation: మహాభారతం నీతి పాఠాలను బోధించే కథల పుస్తకం కాదు. ఇది జీవితంలో నైతికత, అనైతికత మధ్య ఉన్న సన్నని గీతను ప్రజలకు చెప్పే ఒక మహా గ్రంథం. మహాభారతంలోని ప్రతి కథ మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని అందిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి.

విద్య అనేది ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమైన దశ. ఇక్కడే వారి వ్యక్తిత్వం నిర్మితమవుతుంది. మహాభారతం వంటి ఇతిహాసాల నుండి విద్యార్థులు నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి.

ఏకాగ్రత - లక్ష్యం

అర్జునుడు గొప్ప విలుకాడు. మహాభారతంలోని ప్రధాన పాత్రల్లో ఆయన ఒకరు. అతని నుండి నేర్చుకోవాల్సింది లక్ష్యానికి సరిగ్గా గురిపెట్టడం. ఒకసారి ద్రోణాచార్యుడు తన శిష్యులైన పాండవులు, కౌరవుల్ని పరీక్షించాలనుకుంటాడు. చెట్టుపై ఉన్న పక్షి కన్నుని కొట్టాలని పరీక్ష పెడతాడు. తన శిష్యులందరినీ మీకు ఏం కనిపిస్తోంది అని అడుగుతాడు. వారంతా... కొందరు పక్షి అని, కొందరు చెట్టు అని, కొందరు ఆకులు అని రకరకాల సమాధానాలు ఇస్తారు. కానీ అర్జునుడు మాత్రం తనకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది చెబుతాడు. అలాగే పక్షి కన్నుని గురి చూసి కొడతాడు. పని పట్ల ఏకాగ్రత, లక్ష్యం నిర్దేశించుకోవడం అనేది అర్జున్ ని చూసి నేర్చుకోవాలి.

జ్ఞాన సముపార్జన

సగం జ్ఞానం ఎప్పుడైనా వినాశకరమే. మహాభారత యుద్ధ సమయంలో కౌరవులు చక్రవ్యూహాన్ని పన్నారు. అది దుర్భేధ్యమైన సైనిక నిర్మాణం. దాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలో అర్జునుడికి మాత్రమే తెలుసు. కానీ అతడిని ఇతరులు ఆపడంతో, అర్జునుడి కొడుకు అభిమన్యుడు చక్ర వ్యూహంలోకి వెళతాడు. కానీ చక్ర వ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో మాత్రమే అతనికి తెలుసు, దాని నుండి బయటపడటం తెలియదు. ఈ పాక్షిక జ్ఞానం వల్ల అతడు ప్రాణాలని పోగొట్టుకుంటాడు. కాబట్టి ఏదైనా అంశం గురించి పూర్తి జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నించాలని అభిమన్యుడి కథ చెబుతోంది.

కష్టేఫలి

పుట్టినప్పుడే కుంతీ మాత కర్ణుడిని వదిలేసింది. కర్ణుడు జీవితంలో అడుగడుగునా ద్రోహాన్ని, అన్యాయాన్ని, తిరస్కారాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. అర్జునుడితో సమానమైన అత్యుత్తమ విలుకాడు. అయినప్పటికీ అతడికి జీవితంలో అదృష్టం కలిసి రాలేదు. కేవలం కష్టపడి పని చేయడం మాత్రమే కర్ణుడికి మిగిలింది. అదే అతడిని మహాభారతంలో ముఖ్యమైన వ్యక్తిగా మార్చింది. ప్రతి విద్యార్థి కష్టపడడం పైనే దృష్టి పెట్టాలి.

స్నేహబంధం

మీ స్నేహబంధాలు కూడా ఎంతో ముఖ్యమని చెబుతోంది మహాభారతం. కృష్ణుడు పాండవులను ధర్మమార్గంలో నడిపించాడు. కానీ శకుని కౌరవులను నాశనమయ్యేలా చేశాడు. కాబట్టి మీరు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో మీ జీవితం కూడా అలానే తయారవుతుంది.

అహంకారం

అహంకారం అనేది ప్రతి విద్యార్థి వదిలేయాలి. మహాభారతంలో దుర్యోధనుడి అహంకారమే కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. కౌరవ వంశం పతనమైంది. పాండవులు ఆనందంగా ఉండడాన్ని, విజయం సాధించడాన్ని భరించలేకపోయాడు దుర్యోధనుడు. విపరీతమైన అహంకారంతో విర్రవీగాడు. చివరికి అతను పతనమయ్యాడు. అతనితోపాటు కౌరవ సోదరులంతా నాశనమయ్యారు.

మహాభారతాన్ని మించిన గొప్ప జీవిత గ్రంథం లేదు, మహాభారతంలో ఉన్న ప్రతి పాత్రను అర్థం చేసుకుంటే జీవితంలో ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు.

తదుపరి వ్యాసం