తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chick Pea Salad: ఫటాఫట్ తాజా శనగల సలాడ్

chick pea salad: ఫటాఫట్ తాజా శనగల సలాడ్

25 May 2023, 6:30 IST

  • chick pea salad: శనగలతో ఉదయాన్నే తినదగ్గ తాజా కూరగాయలతో సలాడ్ రుచిగా ఎలా చేసుకోవాలో చూసేయండి.

శనగల సలాడ్
శనగల సలాడ్ (freepik)

శనగల సలాడ్

ఉదయాన్నే నూనెలో వేయించిన అల్పాహారం తినడం, దోసెలు ఇడ్లీలకు బదులుగా ఒకసారి తాజా కూరగాయలు, శనగలతో చేసిన సలాడ్ చేసుకుని తినండి. వేసవిలో ఇంకాస్త తాజాదనం కోసం కీరదోస ముక్కలతో ఇంకాస్త ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు. సీజన్ కి తగ్గట్లు ఇంకొన్ని మార్పులు చేసుకుంటే రుచిగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు ఉడికించిన శనగలు

1 కప్పు కీరదోస ముక్కలు

సగం కప్పు ఉల్లిపాయ ముక్కలు (సలాడ్లలో తెల్ల ఉల్లిపాయ కన్నా గులాబీ రంగువి మంచి రుచిస్తాయి)

సగం కప్పు టమాటా ముక్కలు( చెర్రీ టమాటాలు కూడా వాడొచ్చు)

కొద్దిగా కొత్తిమీర

తగినంత ఉప్పు

కొద్దిగా మిరియాల పొడి

సగం చెంచా నిమ్మరసం

1 చెంచా ఆలివ్ నూనె

సగం స్పూన్ వెల్లుల్లి ముద్ద

50 గ్రాముల చీజ్ (ఆప్షనల్)

50 గ్రాముల పనీర్ (ఆప్షనల్)

తయారీ విధానం:

1. రాత్రంతా నానబెట్టిన శనగలను కొద్దిగా ఉప్పు వేసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.

2. ఆలోపు చిన్న గిన్నెలో నూనె, ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం కలుపుకోవాలి.

3. ఉడికించిన శనగలను నీళ్లు లేకుండా వంపేసుకుని పెద్ద గిన్నెలో వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, కీరదోస ముక్కలు, టమాటాలు, కొత్తిమీర, పనీర్ ముక్కలు, చీజ్ ముక్కలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

4.దీంట్లో మసాలాలన్నీ కలుపుకున్న నిమ్మరసం కూడా వేసుకుని అన్ని ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.

5. అంతే.. వెంటనే దీన్ని తినేయొచ్చు. లేదా కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకుని తినొచ్చు.

ఇంకొన్ని సలహాలు:

వీటితో పాటే మీకిష్టం ఉన్న కూరగాయలేవైనా వేసుకోవచ్చు. క్యాప్సికం, అవకాడో, ఉడికించిన స్వీట్ పొటాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు.

మొజరెల్లా చీజ్ కూడా ముక్కలుగా చేసి వేసుకోవచ్చు.

నూనె కలపకుండా పెరుగులో పుదీనా, ఉప్పు, మిరియాలు, నిమ్మరసం, వెల్లుల్లి, ఆరిగానో.. ఇలా ఏవైనా హర్బ్స్ కూడా వేసుకుని చేసుకోవచ్చు.