Oil less Breakfasts: చుక్క నూనె లేకుండా చేసుకోగల ఉదయపు టిఫిన్లు ఇవే..!
21 September 2023, 6:30 IST
Oil less Breakfasts: ఉదయాన్నే నూనె లేకుండా అల్పాహారం తినాలనుకుంటున్నారా? అయితే సులువుగా చేసుకునేవి చాలానే ఉన్నాయి. అవేంటో చూసేయండి.
నూనె అవసరం లేని అల్పాహారాలు
ఈ మధ్య కాలంలో చాలా మంది ఊబకాయం, శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం లాంటి సమస్యలతో సతమతం అవతున్నారు. వీటి నుంచి బయటపడేందుకు రకరకాల డైటింగ్‌లు చేసేస్తున్నారు. కొందరైతే తాము రోజు వారీ తినే ఆహారాలనే ఆరోగ్యవంతంగా చేసుకుని తినేందుకు చూస్తున్నారు. నిజానికి ఇది మంచి ప్రయత్నమే. ఇలాంటి వారి కోసం బెస్ట్ ఆయిల్ లెస్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్‌లు ఇక్కడ కొన్ని ఉన్నాయి. రుచి చూసేయండి.
ఇడ్లీ:
నూనె లేకుండా చేసుకునే అత్యుత్తమమైన అల్పాహారంగా ఇడ్లీ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో దీన్ని ఉదయపు టిఫిన్‌గా ఎక్కువగా తింటారు. అయితే బరువు తగ్గేందుకు చూస్తున్న వారు దీని పిండి తయారీలో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. దీనిలో కొద్ది మొత్తంలో మినప పప్పును ఎక్కువ మొత్తంలో బియ్యం రవ్వను వేస్తుంటారు. అప్పుడు మన శరీరంలోకి అదనంగా ఎక్కువ కేలరీలు, పిండిపదార్థాలు వచ్చి చేరిపోతాయి. దీనిలో బియ్యం రవ్వకు బదులుగా క్యాలరీలు తక్కువగా ఉండి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే తృణ ధ్యాన్యాల రవ్వల్లాంటి వాటిని చేర్చుకోవడం వల్ల మేలు జరుగుతుంది.
చపాతీ :
రాగులు, జొన్నలు, గోధుమలు తదితర ధాన్యాలను చాలా మెత్తటి పిండిలా పట్టించి వాటిని చపాతీలుగా చేసుకోవచ్చు. అస్సలు నూనె లేకుండా వీటిని అట్ల పెనంపై కాల్చుకోవచ్చు. లేదంటే ఒక్కసారి మంటపై వేసి పుల్కాలూ చేసుకోవచ్చు. వీటికి నూనె లేకుండా చేసిన మంచి పప్పు కూరను జత చేస్తే సరి. ఆరోగ్యకరమైన నూనె లేని టిఫిన్ రెడీ అయిపోతుంది.
వండని టిఫిన్లు :
ఉదయాన్నే వండుకుని తిన్న టిఫిన్ల కంటే అసలు వంటే లేకుండా తినగలిగిన కొన్ని ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌లు ఉన్నాయి. వీటిని అసలు వండం కాబట్టి నూనె వాడటం అనే ప్రసక్తే ఉండదు.
- కొన్ని కూరగాయలు, ఆకుకూరలు తీసుకుని ఉప్పు వేసి బాగా కడుక్కోండి. తినడానికి వీలైన అందమైన ముక్కలుగా వాటిని కట్ చేసి కాస్త ఉప్పు, నిమ్మరసం పిండుకుని పైన కాసిన్ని నవ్వులు చల్లుకుని తినవచ్చు.
- బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. అలాగే పండ్ల ముక్కలన్నింటినీ చేర్చి ఫ్రూట్ సలాడ్ చేసుకుని తినవచ్చు.
- కాసిన్ని కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. అందులో నానబెట్టుకున్న చియా గింజలు వేయండి. అందులో అరటి, బొప్పాయి, సపోటా, మామిడి.. లాంటి మెత్తగా ఉండే పండ్ల ముక్కలను చేర్చండి. అలాగే కొన్ని డ్రైఫ్రూట్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేయండి. కొన్ని ఖర్జూరమూ వేయండి. ఉదయాన్నే రుచికరమైన, ఆరోగ్యకరమైన మంచి బ్రేక్‌ఫాస్ట్ తిన్న భావన మీకు తప్పక కలుగుతుంది. పైగా దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. మామూలుగా అయితే దీన్ని ఫ్రీజర్‌లో పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. కావాలనుకుంటే కాసేపు ఫ్రీజర్‌లో ఉంచి తీసి తినండి.