breakfast recipe: చుక్క నూనె లేకుండా చల్ల పొంగడాలు
27 April 2023, 6:00 IST
breakfast recipe: మందంగా, మెత్తగా ఉండే చల్ల పొంగడాలు చూడటానికి దోసెలా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. వాటిని తయారుచేయడం ఎలాగో చూద్దాం.
చల్ల పొంగడాలు
చల్లపొంగడాలు వేసవిలో తినడానికి మంచి అల్పాహారం. పొట్టకు చల్లగా, నిండుగా ఉంటాయివి. తక్కువ నీళ్లతో, ఎక్కువ పెరుగుతో చేయడం వల్ల ఆరోగ్యం కూడా. వాటిని తయారు చేసుకోవడం కూడా సులువే.
కావాల్సిన పదార్థాలు:
బియ్యం - 250 గ్రాములు
లావు అటుకులు - సగం కప్పు
పుల్లటి పెరుగు - రెండు కప్పులు
బేకింగ్ సోడా - పావు టీస్పూను
ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం:
ఒక పెద్ద గిన్నెలో బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. బియ్యంలో రెండు కప్పుల పెరుగు కొన్ని నీళ్లు కలిపి నానబెట్టాలి. కనీసం ఆరుగంటలు ఈ బియ్యం నానాలి. మిక్సీ పట్టుకునే కన్నా ఒక 10 నిమిషాల మందు సన్నం అటుకులు నీళ్లలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అటుకులు, నానబెట్టుకున్న బియ్యం, పెరుగుతో సహా వేసి మిక్సీ పట్టుకోవాలి. సిద్ధమైన పిండిని 7 నుంచి 8 గంటలు అలా వదిలేయాలి. పిండి పులిసాక ఉప్పు, సోడా వేసి బాగా కలుపుకొని దోశల్లాగా పెనం మీద వేసుకోవాలి. దోశ అంత సన్నగా కాకుండా కాస్త మందంగా పోసుకోవాలి. ఇష్టం ఉంటే వీటిమీద ఉల్లిపాయ ముక్కలు, క్యారట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఈ పొంగడాలు పల్లీ చట్నీతో చాలా బాగుంటాయి.